Begin typing your search above and press return to search.

కేంద్రం ప‌చ్చి అబ‌ద్దాలు.. ఇవీ సాక్ష్యాలు

By:  Tupaki Desk   |   22 July 2021 10:30 AM GMT
కేంద్రం ప‌చ్చి అబ‌ద్దాలు.. ఇవీ సాక్ష్యాలు
X
దేశంలో క‌రోనా సెకండ్ వేవ్ సృష్టించిన విల‌య‌తాండవం అంతా ఇంతా కాదు. మ‌హ‌మ్మారి ధాటికి ప్ర‌జ‌లు పిట్ట‌ల్లాగా రాలిపోయారు. ఆక్సిజ‌న్ కొర‌త‌తో ఎంతో మంది ప్రాణాలు కోల్పోవ‌డం హృద‌యాల‌ను క‌ల‌చివేసింది. ఈ స‌మ‌స్య‌పై బాధ్య‌త తీసుకోవాల్సిన కేంద్ర ప్ర‌భుత్వం మాత్రం దేశంలో కొవిడ్ సెకండ్ వేవ్ సంద‌ర్భంగా ఆక్సిజ‌న్ కొర‌త‌తో ఏ ఒక్క‌రూ మ‌ర‌ణించ‌లేద‌ని రాజ్య‌స‌భ సాక్షిగా పేర్కొన‌డం విమ‌ర్శ‌ల‌కు తావిచ్చింది.

క‌రోనా సెకండ్ వేవ్ స‌మ‌యంలో దేశవ్యాప్తంగా ఆక్సిజ‌న్ కొర‌త‌తో రోగులు మ‌ర‌ణించారా? లేదా అనే ప్ర‌శ్న‌కు స‌మాధానంగా.. ఒక్క రాష్ట్ర ప్ర‌భుత్వం గానీ, కేంద్ర పాలిత ప్రాంతం గానీ ఆక్సిజ‌న్ కొర‌త‌తో రోగులు చ‌నిపోయిన‌ట్లు నివేదించ‌లేద‌ని కొవిడ్ మృతుల వివ‌రాలు దాచిపెట్టాల్సిన అవ‌స‌రం మాకు లేద‌ని కేవలం ప్రోటోకాల్‌ని అనుస‌రించి వివిధ రాష్ట్రాలు ఇచ్చిన గ‌ణాంకాల‌ను మాత్ర‌మే మేము వెల్ల‌డించామ‌ని కేంద్ర ప్ర‌భుత్వం వివ‌ర‌ణ ఇచ్చింది.

ఈ అంశంపై స్పందించిన కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మ‌న్సుఖ్ మాండ‌వీయ‌, స‌హాయ మంత్రి భార‌తీ ప్ర‌వీణ్ ప‌వార్ కూడా దేశవ్యాప్తంగా ఆక్సిజ‌న్ కొర‌త‌తో ప్రాణాలు కోల్పోయిన క‌రోనా రోగులు ఎవ‌రూ లేర‌ని స్ప‌ష్టం చేశారు. కేంద్ర ప్ర‌భుత్వ వివ‌ర‌ణ‌పై ప్ర‌జ‌లు మండిప‌డుతున్నారు. ప్రాణ‌వాయువు కొర‌త‌తో ప్ర‌జ‌లు రోడ్ల మీద‌, ఆసుప‌త్రుల మెట్ల మీద ఎక్క‌డ‌ప‌డితే అక్క‌డా ప్రాణాలు కోల్పోయారు. దానికి సంబంధించిన దృశ్యాలు టీవీల్లో సామాజిక మాధ్య‌మాల్లోనూ వైర‌ల్ అయ్యాయి. కానీ ఇప్పుడు ఆక్సిజ‌న్ లేక ఏ ఒక్క‌రూ చ‌నిపోలేద‌ని చెప్ప‌డం ఏంట‌నే విమ‌ర్శ‌లు వినిపిస్తున్నాయి.

మే 10న తిరుప‌తి రుయా ఆస్ప‌త్రిలో ఒకేసారి పెద్ద సంఖ్య‌లో క‌రోనా రోగులు చ‌నిపోయారు. ఈ ఘ‌ట‌న‌లో 11 మంది మ‌ర‌ణించార‌ని, అందుకు ప్రధాన కార‌ణం ఆక్సిజ‌న్ కొర‌త అని ఏపీ ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ కూడా ఆనాడు ప్ర‌క‌టించారు. ఆ ఘ‌ట‌న‌ను ప్ర‌ధాని మోడీ దృష్ట‌కీ తీసుకెళ్లారు. ఆక్సిజ‌న్ కొర‌త తీర్చేందుకు సాయం చేయాల‌ని మోడీని కోరారు. మొద‌ట 11 మంది మ‌ర‌ణించార‌ని చెప్పిన ఏపీ ప్ర‌భుత్వం ఆ త‌ర్వాత దానిని 23గా ప్ర‌క‌టించి బాధితుల‌కు ప‌రిహారం కూడా చెల్లించింది.

కానీ ఇప్పుడు కేంద్ర ప్ర‌భుత్వ‌మేమో రాష్ట్రల నుంచి ఆక్సిజ‌న్ కొర‌త వ‌ల్ల సంభ‌వించిన మ‌ర‌ణాలు త‌మ దృష్టికి రాలేద‌ని పేర్కొన‌డం గ‌మ‌నార్హం. ఒక్క రుయా ఆసుప‌త్రిలో అనే కాకుండా ఏపీలోనూ, తెలంగాణ‌లోనూ ఆక్సిజ‌న్ కొర‌త వ‌ల్ల ప్రాణాలు పోయాయ‌నేది కాద‌న‌లేని నిజం అని ప్ర‌జ‌లు అంటున్నారు. అనంత‌పురం, కాకినాడ ప్ర‌భుత్వాసుప‌త్రుల్లోనూ ఆక్సిజ‌న్ అంద‌క క‌రోనా రోగులు చ‌నిపోయారు. ప్రాణ వాయువు స‌కాలంలో అంద‌క త‌మ త‌ల్లి కాకినాడ ప్ర‌భుత్వ ఆసుప‌త్రిలో మ‌ర‌ణించార‌ని ఓ త‌న‌యుడు త‌న ఆవేద‌న వ్య‌క్తం చేశాడు.

మ‌రోవైపు త‌న భార్య‌కు ప్రాణ‌వాయువు కోసం ఒక్క రాత్రి ఆరు ఆసుప‌త్రులు తిరిగామ‌ని కానీ చివ‌ర‌కు ఆమె ప్రాణాల‌ను ద‌క్కించుకోలేక‌పోయామ‌ని హైద‌రాబాద్‌కు చెందిన ఓ వ్య‌క్తి బాధ‌ప‌డ్డారు. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో హృద‌య విదార‌క సంఘ‌ట‌న‌లెన్నో. కార్పొరేట్ ఆసుప‌త్రుల‌కు చెందిన వైద్యులు కూడా ఆ రోజుల్లో ఆక్సిజ‌న్ కొర‌త తీవ్ర‌మైన స‌మ‌స్య‌గా మారింద‌ని వెల్ల‌డించారు. తెలుగు రాష్ట్రాల్లోనే అని కాదు దేశ‌వ్యాప్తంగా ఇలాంటి దుస్థితే ఏర్ప‌డింది.

ఆక్సిజ‌న్ కొర‌త‌తో ఎంతో మంది ప్రాణాలు కోల్పోయి.. ఎన్నో కుటుంబాలు క‌న్నీళ్లు పెడుతుంటే కేంద్రం మాత్రం పార్ల‌మెంట్‌లో ఆక్సిజ‌న్ అంద‌క ఎవ‌రూ చ‌నిపోలేద‌ని చెప్ప‌డం ఆశ్చ‌ర్యంగా ఉంది. చేతులు దులుపుకునే ప్ర‌య‌త్నం చేసిన కేంద్ర ప్ర‌భుత్వంపై ప్ర‌జ‌లు తీవ్ర‌మైన కోపంతో ర‌గిలిపోతున్నారు. ఇప్ప‌టికే క‌రోనా క‌ట్ట‌డిలో కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ విఫ‌ల‌మైంద‌నే విమ‌ర్శ‌లున్నాయి.

ఈ నేప‌థ్యంలో ఇలాంటి త‌ప్పుడు వ్యాఖ్య‌లు చేయ‌డం ఎంత‌వ‌ర‌కూ సమంజ‌స‌మ‌నే మాట‌లు వినిపిస్తున్నాయి. ఆక్సిజ‌న్ స‌ర‌ఫ‌రా కోసం గ్రీన్ ఛానెళ్ల ఏర్పాటు, చివ‌రికి విమానాల కూడా త‌ర‌లించిన సంగ‌తి తెలిసిందే. కానీ ఇవ‌న్నీ మ‌ర్చిపోయి అస‌లు ఆక్సిజ‌న కొర‌త వ‌ల్ల ఒక్క‌రు కూడా చ‌నిపోలేద‌ని ప్ర‌క‌టించిన కేంద్ర వైఖ‌రి ఆంత‌ర్యం ఏమిటో అంతుప‌ట్ట‌డం లేద‌ని ప్ర‌జ‌లు ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు.