Begin typing your search above and press return to search.

సిగరెట్లు తాగాలంటే 21 దాటాల్సిందే..! చట్టంలో కేంద్రం సవరణలు..!

By:  Tupaki Desk   |   3 Jan 2021 5:16 AM GMT
సిగరెట్లు తాగాలంటే 21 దాటాల్సిందే..! చట్టంలో కేంద్రం సవరణలు..!
X
సిగరెట్లు తాగడం ఓ ఫ్యాషన్ ​లా మారిపోయింది. సినిమాలు - టీవీల ప్రభావంతో యువత సిగరెట్లకు బానిసలవుతున్నారు. బహిరంగ ప్రదేశాల్లో సిగరెట్లు తాగడం నిషేధం.. కానీ మనదేశంలో ఆ చట్టం మాత్రం సరిగ్గా అమలు కావడం లేదు. మరోవైపు చట్టప్రకారం.. 18 ఏళ్లు నిండిన వాళ్లు సిగరెట్లు కొనొచ్చు. ఇప్పటికే విద్యార్థులు స్కూల్​ డేస్​ నుంచే సిగరెట్లకు బానిసలవుతున్నారు. పొగాకు ఉత్పత్తుల వల్ల క్యాన్సర్​ వస్తుందని తెలిసినా.. యువతకు అదంతా ఏమీ పట్టదు. మరోవైపు ప్రభుత్వాలు కూడా వీటి ఉత్పత్తుల వల్ల వచ్చే ఆదాయానికి ఆశపడి.. వీటిని నియంత్రించలేని పరిస్థితి ఉంది.

పొగాకు ఉత్పత్తుల వ్యాపారం.. మనదేశంలో జోరుగా సాగుతున్నది. అయితే సిగరెట్ల వాడకాన్ని తగ్గించాలని ప్రభుత్వం యోచిస్తున్నది. ప్రతిఏటా క్యాన్సర్​ దినోత్సవం, పొగాకు వ్యతిరేక దినోత్సవం సందర్భంగా అవగాహన కల్పిస్తుంటారు. కానీ ఆరోజుల్లో కూడా పాన్​ డబ్బాల్లో - బడ్డీ కొట్లలో యథేచ్చగా సిగరెట్ల అమ్మకాలు సాగుతూనే ఉంటాయి. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఓ కీలక నిర్ణయం తీసుకున్నది. ఇక నుంచి 18 ఏళ్లునిండిన వారికి సిగరెట్లు అమ్మకూడదని.. 21 ఏళ్లు నిండిన వాళ్లకే సిగరెట్లు అమ్మాలని నిర్ణయించింది. ఆ మేరకు చట్టంలో సవరణలు చేయనున్నారు. సిగరెట్లు, పొగాకు ఉత్పత్తులు (ప్రకటనలపై నిషేధం - వ్యాపార నియంత్రణ - వాణిజ్యం - ఉత్పత్తి - సరఫరా - పంపిణీ) సవరణ చట్టం - 2020 పేరుతో ఇప్పటికే ప్రభుత్వం ముసాయిదాను రూపొందించింది.

కేంద్ర ఆరోగ్య శాఖ నేతృత్వంలో సిద్ధం చేస్తున్న కొత్త బిల్లులో భాగంగా వయో పరిమితిని 21 ఏళ్ల వరకు పెంచనున్నారు. ఈ మేరకు సిగరెట్లు - ఇతర పొగాకు ఉత్పత్తుల చట్టం, 2003కి సవరణ చేయనున్నారు. నూతన చట్టప్రకారం 21 ఏళ్లు లోపు వాళ్లకు సిగరెట్లు అమ్మడం నిషేధం. విద్యా సంస్థలకు 100 మీటర్లలోపు కూడా ఇదే నిషేధాజ్ఞలు వర్తిస్తాయి. నిబంధనలు ఉల్లంఘించిన వారికి కఠిన శిక్షలు కూడా అమలు చేయనున్నారు. నిబంధనలు ఉల్లంఘిస్తే రెండేళ్ల జైలుశిక్ష రూ. లక్ష జరిమానా విధించనున్నారు. రెండో సారి కూడా పట్టుబడితే ఐదేళ్ల జైలుశిక్ష రూ. 5 లక్షల జరిమానా విధించనున్నారు.