Begin typing your search above and press return to search.

కేంద్రానికి ఆ పాటే నచ్చేసింది. జగన్ కి డబుల్ షాక్

By:  Tupaki Desk   |   10 Feb 2023 5:00 AM GMT
కేంద్రానికి ఆ పాటే నచ్చేసింది. జగన్ కి డబుల్ షాక్
X
ఏపీ అంతా ఒకే పాట పాడుతున్న వేళ కేంద్రానికి ఆ పాటే నచ్చేసింది అని అంటున్నారు. వైసీపీ తప్ప ఏపీలోని అన్ని రాజకీయ పార్టీలు అమరావతి ఏకైక రాజధాని అని అంటున్నారు. దీంతో కేంద్రం ఏమి చెబుతుందా అని అంతా ఎదురుచూశారు. దానికి కారణం హై కోర్టు లో అమరావతి కేసు ఉన్న వేళ రాజధాని ఎంపిక రాష్ట్రం ఇష్టం అని చెప్పినట్లుగా ప్రచారం సాగింది. కానీ దేశ అత్యున్నత న్యాయస్థానంలో మాత్రం తన అసలైన మాటను వినిపించింది.

విభజన చట్టం ప్రకారమే అమరావతి రాజధాని ఏర్పాటు అయిందని కేంద్రం సుప్రీం కోర్టుకు తాజాగా దాఖలు చేసిన అఫిడవిట్ తో స్పష్టం చేసింది. దీని కంటే ముందు రాజ్యసభలో కేంద్ర హోం శాఖ సహాయం మంత్రి నిత్యానంద రాయ్ కూడా అమరావతిని 2015లో అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం నోటిఫై చేసింది అని గుర్తు చేశారు. దాని కంటే ముందు నిపుణులతో ఒక కమిటీని కేంద్రం ఏపీ రాజధాని విషయంలో ఏర్పాటు చేసినట్లుగా చెప్పారు.

ఇక మూడు రాజధానుల విషయం వైసీపీ ప్రభుత్వం తమతో చెప్పలేదని కూడా ఎత్తి చూపారు ఇలా రాజ్యసభలో షాకు ఇచ్చిన కేంద్ర పెద్దలు ఇక ఏ మాత్రం ఆలస్యం చేయకుండా సుప్రీం కోర్టుకు కూడా అదే విషయాన్ని వివరించారు. దాంతో వైసీపీకి ఒక్క రోజు తేడాలో డబుల్ షాకులు కేంద్రం ఇచ్చినట్లు అయింది.

దీని వెనక ఏముంది అని ఆలోచించుకుంటే కేంద్రం కచ్చితంగా యూ టర్న్ తీసుకుంది అని అంటున్నారు. గతంలో అంటే ఏపీ సర్కార్ మూడు రాజధానుల వ్యవహారం తీసుకున్నపుడు రాజధాని అన్నది రాష్ట్రం ఇష్టమని చెప్పిన కేంద్ర పెద్దలు ఇపుడు ఇలా మాట్లాడడం మీదనే చర్చ సాగుతోంది. అయితే ఇక్కడ కేవలం రాజకీయ కారణాలతో పాటు అనేక ఇతర కారణాలు ఉన్నాయని అంటున్నారు.

అవేంటి అంటే మూడు రాజధానులు అని చెప్పి అన్నింటా అభివృద్ధికి ఏపీ ప్రభుత్వం నిధులు అడిగితే కేంద్రం ఇవ్వలేదు. ఇక అమరావతి విషయంలో ప్రజల మొగ్గుని కూడా గమనించి ఆ విధంగా ఏపీలో ప్రజల మన్నన పొందాలని భావిస్తోంది అని అంటున్నారు. ఇంకో వైపు చూస్తే ఏపీలో పొత్తుల విషయం కూడా బీజేపీ పెద్దల మనసులో ఉందని అంటున్నారు. రేపటి రోజున తెలుగుదేశం జనసేనలతో కలసి పొత్తు పెట్టుకుంటే అమరావతి రాజధాని అంశం కూడా చర్చకు వస్తుంది.

పైగా ఆ రెండు పార్టీలు జై అమరావతి అంటున్నాయి. ఏపీలోని బీజేపీ కూడా అదే చెబుతోంది. దాంతో కేంద్రం కూడా ఆ పాటే పాడింది అని అంటున్నారు. ఇలా విభజన చట్టంలోని 5, 6 సెక్షన్ల ప్రకారం అమరావతి రాజధాని ఎంపిక సరైనదేనని కేంద్రం పక్కాగా చెప్పి తెలుగుదేశానికి ఊపిరి పోసింది. అదే టైం లో వైసీపీని ఇరకాటంలో పెట్టేసింది అని అంటున్నారు. ఈ పరిణామాలతో వైసీపీ పూర్తిగా ఒంటరి అయింది అని అంటున్నారు.

సుప్రీం కోర్టులో ఇపుడు వైసీపీ ఏ విధంగా తన వాదన వినిపిస్తుంది. దానికి తగిన ఆధారాలు ఏ విధంగా సేకరిస్తుంది అన్నది ఆసక్తికరంగా మారుతోంది. ఇక ఏపీలో పొత్తులు ఉన్నా లేక ఒంటరిగా బీజేపీ పోటీ చేసినా కూడా అమరావతి అంశం తమకు రాజకీయంగా లాభిస్తుంది అన్న లెక్కలతోనే కేంద్రం యూ టర్న్ తీసుకుంది అని అంటున్నారు. ఏది ఏమైనా జగన్ కి గట్టి ఝలక్ కేంద్రం ఇచ్చేసింది. మరి ఆయన ఏ వ్యూహాలు రచిస్తారు అన్నదే చూడాలని అంటున్నరు

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.