Begin typing your search above and press return to search.

తెలుగు రాష్ట్రాల లొల్లిపై కేంద్రం కొత్త వ్యూహం?

By:  Tupaki Desk   |   20 May 2020 5:30 AM GMT
తెలుగు రాష్ట్రాల లొల్లిపై కేంద్రం కొత్త వ్యూహం?
X
దేశంలో ఎన్నోరాష్ట్రాలు ఉన్నాయి. ముఖ్యమంత్రులకు కొదవ లేదు. అలాంటిది ఎవరికి లేనిది.. తనకు మాత్రమే ఉన్నట్లుగా కేంద్రంపై అదే పనిగా ఫైర్ అవుతున్న తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రికి కేంద్రం చెక్ పెట్టాలని డిసైడ్ అయ్యిందా? ఈ అంశంపై మోడీషాలు రోడ్ మ్యాప్ సిద్ధం చేసుకున్నారా? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది. సాధారణంగా రెండు రాష్ట్రాల మధ్య జల వివాదాలు చోటు చేసుకున్న వేళ.. తొందర పడి అదే పనిగా కలుగజేసుకునే ప్రయత్నం పెద్దగా కనిపించదు.

అందుకు భిన్నంగా ఏపీ షురూ చేస్తున్న ఎత్తిపోతల పథకంపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కమ్ ఎంపీ బండి సంజయ్ రాసిన లేఖకు.. యుద్ధ ప్రాతిపదికన కేంద్రమంత్రి స్పందించటం తెలిసిందే. ఏపీ ప్రభుత్వానికి ఆదేశాలు ఇచ్చేలా చేయటం చూస్తే.. తెలంగాణ ప్రయోజనాల్ని కాపాడే విషయంలో తామెంత కమిట్ మెంట్ తో ఉన్నామన్న విషయాన్ని తెలిపేలా కేంద్రం తీరు ఉందని చెబుతున్నారు. ఇదిలా ఉంటే.. తెలంగాణ సర్కారు చేపట్టిన ప్రాజెక్టులపై ఏపీ ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేస్తూ కృష్ణా బోర్డుకు లేఖ రాసిన దానికి స్పందించిన వేగాన్ని చూస్తే.. రోటీన్ కు భిన్నమని చెప్పక తప్పదు.

రెండు తెలుగు రాష్ట్రాల మధ్య మొదలైన లొల్లిలో కేంద్రం కీలకం కావాలని భావిస్తుందా? ఈ ఇష్యూలో పెద్దన్న పాత్రను పోషిస్తూ.. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రికి ఝులక్ ఇవ్వాలన్న ఆలోచనలా ఉన్నారా? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది. ప్రధాని మోడీ తీరును అదే పనిగా విమర్శలు చేసే బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ.. ఢిల్లీ రాష్ట్ర ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ లాంటి వారే మౌనంగా ఉన్న వేళలో.. కేంద్రం తీరును.. ప్రధాని పై అదే పనిగా విమర్శలు చేయటం పై మోడీషాలు గుర్రుగా ఉండటమే కాదు.. కేసీఆర్ మీద ప్రత్యేక నజర్ వేశారన్న భావన కలిగేలా పరిణామాలు చోటు చేసుకుంటున్నాయని చెప్పక తప్పదు.