Begin typing your search above and press return to search.

డిజిటల్ మీడియాపై కేంద్రం కత్తి... సుప్రీంలో కీలక అఫిడవిట్

By:  Tupaki Desk   |   22 Sep 2020 3:30 AM GMT
డిజిటల్ మీడియాపై కేంద్రం కత్తి... సుప్రీంలో కీలక అఫిడవిట్
X
ఏదేనీ అంశంలో... అది సాధారణమైనదైనా, లేదంటే అత్యంత కీలకమైనదైనా, అత్యంత సున్నితమైనదైనా... డిజిటల్ మీడియా ముందూ వెనుకా చూసుకోకుండా వార్తలు రాసిపడేస్తోంది. ఈ తరహా ధోరణిపై తాను కత్తి చేతబట్టుకుని కదన రంగంలోకి దూకేస్తానంటూ కేంద్రంలోని నరేంద్ర మోదీ సర్కారు సంచలన ప్రకటన చేసింది. ఈ విషయంలో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేయాలని కోరుతున్నామని చెప్పిన కేంద్రం... ఒకవేళ సుప్రీం అది తన పని కాదంటే.. తానే స్వయంగా కత్తీ డాలు పట్టుకుని డిజిటల్ మీడియాపై దండెత్తేందుకు కూడా సిద్ధమేనని కూడా కేంద్రం సంచలన ప్రకటన చేసింది. ఈ మేరకు సోమవారం నాడు సుప్రీంకోర్టులో ఓ కేసు విచారణ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం సంచలన అఫిడవిట్ ను దాఖలు చేసింది.

సివిల్ సర్వీసుల్లో ముస్లింలు అనే కార్యక్రమాన్ని ప్రసారం చేసిన సుదర్శన్ టీవీపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేయడంతో పాటుగా సదరు టీవీ ఛానెల్ వ్యవహారంపై విచారణకు పూనుకుంది. ఈ సందర్భంగా సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు అఫిడవిట్ దాఖలు చేసిన కేంద్రం... డిజిటల్ మీడియాకు హద్దులు నిర్దేశించే పనిని, ఆ హద్దులు దాటితే దండించే పనికి పక్కా ప్రణాళిక రూపొందించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడింది. ఈ విషయంలో సుప్రీంకోర్టు నేరుగా కలగజేసుకుని మార్గదర్శకాలు జారీ చేస్తే సంతోషమని, అలా కాదంటే కోర్టు అనుమతితో తానే స్వయంగా డిజిటల్ మీడియా స్వైర విహారాన్ని నిలుపుదల చేసేందుకు రంగంలోకి దిగుతానని కూడా కేంద్ర ప్రభుత్వం చెప్పుకొచ్చింది.

విచారణ సందర్భంగా ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాలకు సంబంధించి మార్గదర్శకాలు జారీ చేయాలనుకుంటే... అంతకుముందే డిజిటల్ మీడియా నియంత్రణకు మార్గదర్శకాలు రూపొందించాల్సిన అవసరం ఉందని కేంద్రం అభిప్రాయపడిందతి. డిజిటల్ మీడియాను పూర్తిగా అనియంత్రితమైనదిగానే కాకుండా విషపూరిత ద్వేషం, హింసను వ్యాప్తి చేయడమే కాకుండా ప్రజల ఖ్యాతిని తీవ్రంగా దెబ్బతీస్తున్న మాద్యమంగా కేంద్రం అభివర్ణించింది. ఇలాంటి పోకడలను ఇప్పటికైనా కట్టడి చేయకపోతే ఇబ్బందేనని కూడా సుప్రీంకోర్టుకు కేంద్రం విన్నవించింది.