Begin typing your search above and press return to search.

విశాఖ విషాదం.. వార్నింగ్ ఇచ్చిన కేంద్రం

By:  Tupaki Desk   |   10 May 2020 6:42 AM GMT
విశాఖ విషాదం.. వార్నింగ్ ఇచ్చిన కేంద్రం
X
విశాఖ గ్యాస్ లీక్ ఘటన దేశవ్యాప్తంగానే కాదు ప్రపంచవ్యాప్తంగా అందరినీ ఆందోళనకు గురిచేసింది. విశాఖ గ్యాస్ లీకేజీ వీడియోలు వైరల్ అయ్యాయి. ప్రపంచవ్యాప్తంగా ఇక్కడి బాధ చూసి అందరూ షాక్ అయ్యారు. ఈ పరిణామంతో లాక్ డౌన్ తో 40 రోజులకు పైగా నిర్వహణ సరిగా లేని ఫ్యాక్టరీలను తెరిచేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలని ప్రపంచవ్యాప్తంగా ప్రభుత్వాలు కంపెనీలకు ఆదేశాలిచ్చాయి. ఐక్యరాజ్యసమితి కూడా ఈమేరకు భద్రత చర్యలు తీసుకోవాలని కోరింది. ఈ నేపథ్యంలోనే కేంద్ర ప్రభుత్వం తాజాగా సంచలన ఆదేశాలు జారీచేసింది.

దేశంలో మూడో దశ లాక్ డౌన్ ముగియనున్న మే 17 తర్వాత దేశవ్యాప్తంగా కెమికల్ - మ్యానుఫ్యాక్చరింగ్ ఫ్యాక్టరీలు తెరవడానికి సంబంధించి కేంద్ర హోంశాఖ ఆదివారం సరికొత్త మార్గదర్శకాలు జారీ చేసింది. ఫ్యాక్టరీల పున: ప్రారంభం సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు.. కార్మికుల రక్షణ, చుట్టుపక్కల ప్రాంతాల్లోని ప్రజల్ని అప్రమత్తం చేయడం.. తదితర అంశాలపై కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. కంపెనీలు తెరిచే సమయంలో ప్రతీదాన్ని రీచెక్ చేశాకే ఓపెన్ చేయాలని.. ఉత్పత్తికి ముందుకు ఇవన్నీ ట్రయల్ రన్ చేశాకేనని కేంద్రం మార్గదర్శకాల్లో పేర్కొంది.

జాతీయ డిజాస్టర్ మేనేజ్ మెంట్ ఆథారిటీ గైడ్స్ లైన్స్ పేరుతో హోంశాఖ తాజా ఉత్తర్వులు ఫ్యాక్టరీలకు హెచ్చరికగా మారాయి. యూనిట్లను రీస్టార్ట్ చేసే విషయంలో తొలి వారాన్ని పూర్తిగా ట్రయల్ రన్ మాత్రమే నిర్వహించాలని కేంద్రం సూచించింది. ప్రొటోకాల్స్ ఫాలో అవుతూ ఫ్యాక్టరీలు తెరిచిన వారంతర్వాతే టార్గెట్లు విధించుకొని ఉత్పత్తిని ప్రారంభించాలని.. లేకపోతే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ మార్గదర్శకాలు అమలు చేయాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాలదేనని కేంద్రం స్పష్టం చేసింది. కలెక్టర్ స్థాయి అధికారులు సైతం స్వయంగా చొరవ తీసుకొని భద్రత పరిశీలించాలని సూచించింది. అధికారులు తనిఖీలు చేయాలని సూచించింది.

ప్రధానంగా ఫ్యాక్టరీలన్నీ కార్మికులు, ప్రజల భద్రతకు పెద్దపీట వేయాలని.. కరోనా వైరస్ ప్రబలకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కేంద్రం మార్గదర్శకాల్లో పేర్కొన్నారు. ఇలా విశాఖ గ్యాస్ లీకేజీ.. పోయిన ప్రాణాల తర్వాత దేశవ్యాప్తంగా ఫ్యాక్టరీల ఓపెనింగ్ పై కేంద్రం కట్టుదిట్టమైన చర్యలకు ఆదేశించింది.