Begin typing your search above and press return to search.

కేంద్రం క్లారిటీ ఇచ్చాక కూడా ఈ వితండ వాదన ఏంది గల్లా?

By:  Tupaki Desk   |   6 Feb 2020 5:30 AM GMT
కేంద్రం క్లారిటీ ఇచ్చాక  కూడా ఈ వితండ వాదన ఏంది గల్లా?
X
రాష్ట్ర రాజధాని విషయం కేంద్రం పరిధిలోనిది కాదు. ఆయా రాష్ట్రాలకు సంబంధించిన విషయం. మేం అందులో జోక్యం చేసుకోమని కేంద్ర ప్రభుత్వం లోక్ సభలో లిఖిత పూర్వకం గా సమాధానం ఇచ్చిన తర్వాత కూడా టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ వితండవాదన ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. రాజధాని పైన కేంద్రం క్లారిటీ ఇచ్చిన తర్వాత కూడా ఏపీ రాజధానుల పై మోడీ సర్కారు జోక్యం చేసుకోవాలనే వాదనను వినిపించారు.

రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ సందర్భంగా లోక్ సభలో గల్లా వారు వినిపించిన వాదన వింటే అవాక్కు అవ్వాల్సిందే. రాజధాని అంశం రాష్ట్రం పరిధి లోనిది కాదని.. కేంద్రం జోక్యం చేసుకోవాల్సిందేనని గల్లా డిమాండ్ చేశారు. విభజన చట్టంలో రాజధాని అని ఉందే తప్పించి.. రాజధానులు అని ఎక్కడా లేదన్నారు. ఏపీ ప్రభుత్వం మూడు రాజధానులు ఏర్పాటు చేస్తే.. మౌలిక సదుపాయాల కల్పన కోసం కేంద్రం నిధులు కేటాయిస్తుందా? అని ప్రశ్నించారు.

విభజన చట్టం ప్రకారం రాజధానిని డెవలప్ చేసే బాధ్యత కేంద్రం మీద ఉందన్న ఆయన.. రాజధానికి ఏదైనా మార్పులు చేయాలంటే విభజన చట్టానికి సవరణలు చేయాలన్నారు. మూడు రాజధానులతో విపరీతమైన ఆర్థిక భారం పడుతుందన్న ఆయన.. కేంద్ర మంత్రి ఇచ్చిన వివరణలోనూ రాజధాని అనే ప్రస్తావించారే కానీ.. రాజధానులు అని చెప్పలేదంటూ తన వాదనను వినిపించారు. లోక్ సభలో ఎంపీ గల్లా చేస్తున్న వితండ వాదనను అడ్డుకునేందుకు వైఎస్సార్ కాంగ్రెస్ నేతలు ప్రయత్నించారు. దీంతో..వారిని సముదాయించేందుకు స్పీకర్ స్థానంలో ఉన్న వారు విపరీతంగా శ్రమించాల్సి వచ్చింది.

రాజధాని అంశం తమ పరిథి లో ఉండదని కేంద్రం తేల్చి చెప్పిన తర్వాత కూడా.. ఏదో ఒక అంశాన్ని చూపించి రచ్చ చేయాలన్నట్లుగా గల్లా వారి మాటలు ఉన్నాయంటున్నారు. టీడీపీ ఎంపీ మాటలు చూస్తే.. రాష్ట్రంలో తాము అధికారం లో లేకున్నా.. అక్కడ తాము అనుకున్నది మాత్రమే జరగాలన్నట్లుగా వారి తీరు ఉందన్న విమర్శలు వినిపిస్తున్నాయి.