Begin typing your search above and press return to search.

తెలంగాణ‌కు రానున్న రూ.1257కోట్లు

By:  Tupaki Desk   |   24 Aug 2015 9:15 AM GMT
తెలంగాణ‌కు రానున్న రూ.1257కోట్లు
X
విష‌యం ఏదైనా కానీ.. ఎవ‌రున్నా కానీ.. ఒక్క‌సారి ఇష్యూను టేక‌ప్ చేస్తే దానిపై ప‌లుర‌కాలుగా పోరాటం చేసి మ‌రీ అనుకున్న‌ది సాధించే ల‌క్ష‌ణం తెలంగాణ‌రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్ ఎంతుంద‌న్న విష‌యం తాజాగా మ‌రోసారి నిరూపిత‌మైంది. తెలంగాణ స‌ర్కారుకు చెందిన రూ.1257కోట్ల మొత్తాన్ని ఆర్ బీఐ అనుమ‌తితో ఐటీ శాఖ బ‌దిలీ చేసుకోవ‌టం.. దీనిపై గుర్రుగా ఉన్న తెలంగాణ ప్ర‌భుత్వం కొద్ది నెల‌లుగా ఐటీ శాఖ మీద పోరాటం చేస్తున్న సంగ‌తి తెలిసిందే.

ఏపీ బెవ‌రేజ‌స్ కొర్పొరేష‌న్ కు సంబంధించిన ఆదాయ‌ప‌న్ను బ‌కాయిలు చెల్లించ‌లేదంటూ.. ఆర్‌బీఐ వ‌ద్ద ఉన్న మొత్తంలో నుంచి రూ.1257 కో్ట్ల‌ను త‌న ఖాతాలోకి ఐటీ శాఖ బ‌దిలీ చేసుకోవ‌టం తెలిసిందే. ఉన్న‌ట్లుండి ఇంత భారీ మొత్తాన్ని ఐటీ శాఖ బ‌దిలీ చేసుకోవ‌టంతో టీ స‌ర్కారు కంగుతింది. ఈ విధానం స‌రికాదంటూ కేంద్ర ఆర్ధిక‌మంత్రి మొద‌లుకొని.. ప‌లువురుమంత్రుల్ని తెలంగాణ మంత్రి కేటీఆర్ వెళ్లి త‌మ వాద‌న‌ను వినిపించారు.

అప్ప‌టికి ఫ‌లితం లేక‌పోవ‌టంతో.. ఈ అంశంపై హైకోర్టును ఆశ్ర‌యించారు. ప్ర‌భుత్వరంగ సంస్థ బకాయిలకు సంబంధించి.. ప్ర‌భుత్వ నిధులు తీసుకోవ‌టం స‌రికాదంటూ త‌న వాద‌న‌ను ప‌లు వేదిక‌ల మీద బ‌లంగా వాదించింది. ప‌ట్టువ‌ద‌ల‌ని విక్ర‌మార్కుడి తీరులో వీలైన‌న్ని మార్గాల్లో ప్ర‌య‌త్నించిన తెలంగాణ ప్ర‌భుత్వం ఎట్ట‌కేల‌కు తాను అనుకుంది సాధించింది.

తెలంగాణ స‌ర్కారు వినిపిస్తున్న వాద‌న‌పై కేంద్ర ఆర్థిక‌.. రెవెన్యూ శాఖ కార్య‌ద‌ర్శులు సానుకూలంగా స్పందించి.. తెలంగాణ నుంచి తీసుకున్న రూ.1257 కోట్ల‌ను తిరిగి ఇవ్వాల‌న్న నిర్ణ‌యం తీసుకున్నారు. దీంతో.. మ‌రి రెండు.. మూడు రోజుల్లో ఈ భారీ మొత్తం తెలంగాణ‌కు తిరిగి రానుంద‌ని చెబుతున్నారు. దీనికి సంబంధించిన ఫైలుపై ఆర్థిక‌మంత్రి అరుణ్ జైట్లీ సంత‌కం చేసిన‌ట్లుగా తెలుస్తోంది. ఈ భారీ మొత్తం ఐటీ శాఖ బ‌ద‌లాయింపుతో.. గ‌త కొద్ది నెలలుగా తెలంగాణ ప్రభుత్వం విప‌రీత‌మైన నిధుల కొర‌త ఎదుర్కొంటోంది. ఈ మొత్తం క‌నుక తిరిగి వ‌చ్చేస్తే.. టైట్ మొత్తం హుష్ కాకి అయిపోయి.. ఫుల్ స్వింగ్ లో ఉండొచ్చంటున్నారు.