Begin typing your search above and press return to search.

రాజ్ భవన్..అసెంబ్లీలకు రూ.500కోట్లు

By:  Tupaki Desk   |   14 Aug 2015 5:03 AM GMT
రాజ్ భవన్..అసెంబ్లీలకు రూ.500కోట్లు
X
ఏపీ రాజధాని నిర్మాణం కోసం కేంద్ర సర్కారు ఎంత మొత్తం ఇస్తుందన్న విషయంపై ఇప్పటికి స్పష్టత లేని పరిస్థితి. దాదాపు రూ.2.5లక్షల కోట్లు ఖర్చు అయ్యే అవకాశం ఉందని భావిస్తున్న రాజధాని నిర్మాణం కోసం కేంద్రం తన భాగంగా ఎంత ఇస్తుందన్నది తెలీకున్నా.. తాజాగా మాత్రం ఓ రూ.500కోట్లు ఇచ్చేందుకు మోడీ సర్కారు ముందుకొచ్చింది.

ఏపీలో నిర్మిస్తున్న రాజధాని నిర్మాణంలో భాగంగా ఏపీ అసెంబ్లీ భవనానికి.. గవర్నర్ నివాసమైన రాజ్ భవన్ నిర్మాణానికి రూ.500కోట్లు ఇచ్చేందుకు సముఖత వ్యక్తం చేస్తూ కేంద్రం ముందుకు వచ్చింది.

రెండు భవనాల నిర్మాణానికి రూ.500కోట్లు ఇస్తామని.. వెంటనే.. ఆయా భవనాలకు సంబంధించిన డిజైన్లుపంపాలని కోరింది. ఓ పక్క ఏపీకి ప్రత్యేకహోదా ఇవ్వాలన్న డిమాండ్ ఊపందుకున్న సమయంలో కేంద్రం ఏపీ రాజధానిలో నిర్మించే రెండు భవనాలకు సంబంధించి నిధులను ఇస్తానని తనకు తానే ముందుకు రావటం గమనార్హం.

రాజధాని నిర్మాణానికి సంబంధించిన ప్రక్రియ ఓ పక్క ఊపందుకున్నప్పటికీ ఇప్పటివరకూ చప్పుడు చేయని కేంద్రం.. తాజాగా మాత్రం అందుకు భిన్నంగా అసెంబ్లీ.. రాజ్ భవన్ లకు రూ.500కోట్లు ఇస్తానని చెప్పటం చూస్తుంటే.. ప్రత్యేక ప్యాకేజీ ద్వారా.. ప్రత్యేక హోదా అంశాన్ని సర్దిబుచ్చాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక.. రూ.500కోట్లు ఇస్తామన్న మాట విషయానికి వస్తే.. ఎన్ని రూ.500కోట్లు కలిపితే రూ.లక్ష కోట్లు అవుతుంది. అలాంటి లక్ష కోట్లు రెండున్న తడవలు తేలితే కానీ.. ఏపీ రాజధాని నిర్మాణం ఒక కొలిక్కి రాని పరిస్థితి. అలాంటప్పుడు తాజాగా ఏపీకి ఇస్తానన్న రూ.500కోట్లు ముష్టితో సమానమేనని వాదన వినిపిస్తోంది.

రూ.500 కోట్లు.. రూ.వెయ్యి కోట్ల లాంటి చిల్లరతో కూడిన ప్రతిపాదనలు.. హామీల కన్నా.. మొత్తంగా ఎంత మొత్తాన్ని ఇస్తుందన్న విషయంపై ఒకేసారి ప్రకటన చేస్తే బాగుంటుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.