Begin typing your search above and press return to search.

ఏ కులంవారైనా అట్రాసిటీ కేసు పెట్టే రోజు వస్తోంది

By:  Tupaki Desk   |   24 Feb 2017 9:54 AM GMT
ఏ కులంవారైనా అట్రాసిటీ కేసు పెట్టే రోజు వస్తోంది
X
ఎస్సీ - ఎస్టీలను ఎవరైనా అవమానించినా, వేధించినా - దాడులు చేసినా అలాంటి చర్యలకు వ్యతిరేకంగా వారు అట్రాసిటీ కేసు పెట్టే ఛాన్సుంది. భారతదేశంలో బలమైన చట్టాల్లో అదొకటి. అయితే.. ఇకపై ఎస్సీ - ఎస్టీలే కాకుండా ఏ కులం వారైనా అట్రాసిటీ కేసులు పెట్టడానికి వీలు కల్పిస్తూ చట్టం తెచ్చేందుకు కేంద్రం ప్రయత్నిస్తోంది. కులం పేరుతో ఎవరికి అవమానించినా వారు ఈ చట్టం ప్రకారం అట్రాసిటీ కేసు పెట్టొచ్చు. కులం - జాతి పేరుతో అవమానాలకు గురవుతున్న వారికి చట్టపరమైన రక్షణ కల్పించేందుకు ఈ కఠిన చట్టాన్ని తయారు చేసే పనిలో కేంద్రం ఉన్నట్లు తెలుస్తోంది.

2014లో ఢిల్లీలో ఈశాన్య రాష్ట్ర యువకుడిపై జరిగిన దాడి ఘటనలో అప్పటి ప్రభుత్వం నియమించిన ఎంకే బారువా కమిటీ చేసిన సిఫార్సుల ఆధారంగా భారత శిక్షాస్మృతి (ఐపీసీ)లో మార్పులు చేయనున్నారు. ఇందులో భాగంగా కులం, జాతిపరంగా కించపరిచేలా చేసే వ్యాఖ్యలను తీవ్ర నేరంగా పరిగణించి మూడేళ్ల జైలు శిక్ష విధించేలా కేంద్ర హోంశాఖ ప్రతిపాదనలు సిద్ధం చేస్తోంది. జన్మస్థలం - జాతి(రేస్)ని సూచించేలా వెక్కిరించడం.. ప్రవర్తన - సంప్రదాయాలు - వేషధారణ తదితర వాటి ఆధారంగా ఒక జాతి వ్యక్తిని అవమానించే ఉద్దేశంతో మాట్లాడినా - శబ్దం - సైగ చేసినా - అవమానించేలా ఏదైనా వస్తువును చూపినా దానిని బాధితుడు చూసినా, విన్నా అలా చేసిన వ్యక్తి శిక్షార్హుడవుతాడు. మూడేళ్ల జైలు శిక్ష - జరిమానా లేదంటే రెండూ విధించాలని బారువా కమిటీ సూచించింది.

కాగా దీనిపై అభిప్రాయాలు తెలపాలంటూ కేంద్ర ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వాలను కోరింది. రాష్ట్రాలు తమ అభిప్రాయం తెలపగానే వచ్చే సమావేశాల్లోనే సరికొత్త చట్టాన్ని ప్రతిపాదించనున్నారు. ఈ చట్టం అమల్లోకి వస్తే జాతి ప్రస్తావనను కూడా కులం ప్రస్తావనగానే భావిస్తారు.

అయితే, ఇది బాధితులకు రక్షణగా నిలవడం గ్యారంటీ అని, మంచి చట్టమన్న అభిప్రాయం అందరిలో ఉన్నప్పటికీ దీన్ని ఎవరైనా దుర్వినియోగం చేసే ప్రమాదముందున్న వాదనా ఉంది. ఒక్కోసారి ఇతర ప్రాంతాల్లో తెలియకుండా మాటల ద్వారా కానీ, సైగల ద్వారా కానీ కులాన్ని సూచించేలా ఏమైనా చేసినా అది ఇబ్బందులుకు దారి తీయొచ్చన్న వాదన వినిపిస్తోంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/