Begin typing your search above and press return to search.

అధికారుల గొడవ: జగన్ జిల్లాకు అవార్డు

By:  Tupaki Desk   |   19 Feb 2016 6:47 AM GMT
అధికారుల గొడవ: జగన్ జిల్లాకు అవార్డు
X
ఉపాధి హామీ పథకంలో అమల్లో ఏటా ఇచ్చే అవార్డులను చిత్తూరు జిల్లా సొంతం చేసుకుంటుండేది... చంద్రబాబు అధికారంలో లేనప్పుడు కూడా ఆ జిల్లాయే టాప్ లో ఉంటూ జాతీయ అవార్డు సొంతం చేసుకుంటుండేది... కానీ, ఈసారి మాత్రం చంద్రబాబు జిల్లాను కాదని జగన్ జిల్లాకు అవార్డు దక్కింది. అలా అని.. కడప జిల్లా చిత్తూరు కంటే ఏమైనా మెరుగైన ఫలితాలు సాధించిందా అంటే అలాంటిదేమీ లేదు. కేవలం రెండు అంశాల్లోనే చిత్తూరును డామినేట్ చేసిన కడప... ఆరు అంశాల్లో చిత్తూరు కంటే వెనుకబడింది... అయినా, అవార్డు మాత్రం కడప జిల్లాకు వచ్చింది. ఇప్పుడు అధికార వర్గాల్లో ఇదే చర్చ.... ఎందుకిలా జరిగింది.. కడపకు అంత ప్రాధాన్యం ఎలా దక్కింది..? అని అంతా ఎవరి కోణంలో వారు విశ్లేషించుకుంటున్నారు.

కేంద్రప్రభుత్వం పదేళ్ళకిందట జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని ప్రారంభించింది. అప్పట్లో సుమారు 10 జిల్లాల్లో ఈ పథకాన్ని ప్రయోగాత్మకంగా చేపట్టింది. కరువు కాటకాలతో అల్లాడుతున్న రాయలసీమలోని అనంతపురం - చిత్తూరు - కడప జిల్లాలకు మొదటి దశలోనే ఈ పథకాన్ని మంజూరు చేసింది. పథకాన్ని అనంతపురం జిల్లాలో ప్రారంభించింది. ప్రతిష్టాత్మకమైన ఈ పథకం వల్ల చిత్తూరు జిల్లాకి అనేక విధాలుగా మేలు జరిగింది. వేలసంఖ్యలో ఊట చెరువులు - చెక్‌ డ్యామ్‌ ల నిర్మాణం జరిగింది. దీంతో వర్షపు నీటి వృధా తగ్గింది. ఉపాధి హామీ అమల్లో చిత్తూరు ఆదర్శంగా నిలిచింది. 2007- 08, 2008-09, 2013-14 సంవత్సరాల్లో జాతీయస్థాయిలో ఉత్తమ జిల్లాగా ఎంపికై పురస్కారాలు అందుకుంది. 2014-15 సంవత్సరానికిగాను కుప్పం మండలంలోని "జరుగు'' గ్రామపంచాయితీ ఉపాధి హామీ పథకం అమలులో దేశంలోని పది అత్యుత్తమ పంచాయితీల్లో ఒకటిగా నిలచింది. కానీ జిల్లా మొత్తానికి చూస్తే అవార్డు రాలేదు. గ్రామపంచాయితీల స్థాయిలో జిల్లాకి గుర్తింపు లభించినా జిల్లాస్థాయిలో మాత్రం అన్యాయం జరిగిందన్న వాదన వినిపిస్తోంది.

2014- 15 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఉపాధి హామీ పథకం అమలులో చిత్తూరు - కడప - విశాఖపట్నం జిల్లాలు రాష్ట్రస్థాయిలోని ఇతర జిల్లాలకు అందనంత ఎత్తులో నిలిచాయి. అయితే ఉత్తమ జిల్లాల ఎంపికలో పలు అంశాలను పరిగణనలోకి తీసుకుంటారు. పనుల సంఖ్య, పనుల విలువ, కూలీల సంఖ్య, పని దినాలు, వంద రోజులు పనిపొందిన కుటుంబాల సంఖ్య, ఖర్చుచేసిన నిధులు, సకాలంలో బిల్లుల చెల్లింపు, బిల్లుల చెల్లింపులో పారదర్శకత, సాంకేతిక పరిజ్ఞాన వినియోగం తదితర అంశాల ఆధారంగా ఉత్తమ జిల్లాల ఎంపిక జరుగుతుంది. ఈ ఏడాది ఉత్తమ జిల్లా పురస్కారం దక్కించుకున్న కడప, అవార్డు కోల్పోయిన చిత్తూరు మధ్య ఈ అంశాల్లో తేడాలు చూస్తే కేవలం రెండు అంశాల్లో మాత్రమే కడప జిల్లా చిత్తూరుకన్నా మెరుగైన ఫలితాలు సాధించింది. ఆరు అంశాల్లో చిత్తూరు జిల్లా కడపకన్నా ఎంతో మెరుగ్గా ఉంది. ఇంత వ్యత్యాసం ఉన్నా కూడా కేంద్ర ప్రభుత్వం మాత్రం కడపని ఉత్తమ జిల్లాగా ఎంపికచేసింది. అయితే... రాష్ట్రస్థాయిలో అధికారుల మధ్య ఉన్న విభేదాల వల్లే కడపను హీరో చేసి చిత్తూరును పక్కనపెట్టారని తెలుస్తోంది. అవార్డుల కోసం ప్రతిపాదనలు పంపే దశలో రాష్ట్రస్థాయి అధికారులు చిత్తూరును విస్మరించారన్న వాదన బలంగా వినిపిస్తోంది. జిల్లాకి చెందిన ఒక ముఖ్యఅధికారితో రాష్ట్రస్థాయి ఉన్నతాధికారి ఒకరికి గల అభిప్రాయభేదాలే ఈ పరిస్థితికి కారణమన్న ప్రచారం జరుగుతోంది. అధికారుల పొరపొచ్చాల కారణంగా ముఖ్యమంత్రి జిల్లాకు రావాల్సిన గుర్తింపు ప్రతిపక్ష నేత జిల్లాకు దక్కింది.

కాగా... ఉపాధి హామీ అవార్డులు ప్రతిపక్ష నేతల జిల్లాలకే దక్కుతాయన్న సరదా వాదన ఒకటి వినిపిస్తోంది. ఇంతకుముందు చిత్తూరుకు అవార్డు వచ్చిన అన్ని సంవత్సరాలు కూడా చంద్రబాబు ప్రతిపక్ష నేత హోదాలో ఉన్నారని... ఈసారి చంద్రబాబు ముఖ్యమంత్రి కాగా చిత్తూరుకు అవార్డు రాకుండా ప్రస్తుత ప్రతిపక్ష నేత జగన్ జిల్లాకు ఇచ్చారని అంటున్నారు.