Begin typing your search above and press return to search.

పోల‌వ‌రంపై బాబుకు కేంద్రం మ‌రో షాకిచ్చిందే!

By:  Tupaki Desk   |   20 April 2017 4:53 AM GMT
పోల‌వ‌రంపై బాబుకు కేంద్రం మ‌రో షాకిచ్చిందే!
X
జాతీయ ప్రాజెక్టు హోదా క‌లిగిన పోల‌వ‌రం ప్రాజెక్టు పూర్తి అయితే... న‌వ్యాంధ్ర రూపురేఖ‌లే మారిపోతాయ‌ని, ఈ దిశ‌గా కేంద్రం సంపూర్ణ స‌హ‌కారంతో ప్రాజెక్టు ప‌నుల‌ను ప‌రుగులు పెట్టిస్తున్నామంటూ ఊద‌ర‌గొడుతున్న చంద్ర‌బాబు స‌ర్కారుకు నిజంగానే పెద్ద దెబ్బ ప‌డిపోయింది. ఆ దెబ్బ కూడా ఏ విప‌క్షం నుంచో కాకుండా... ఇటు రాష్ట్రంలోనే కాకుండా అటు కేంద్రంలోనూ మిత్ర‌ప‌క్షంగా కొన‌సాగుతున్న బీజేపీ ప్ర‌భుత్వం నుంచే ఈ దెబ్బ ప‌డ‌టం గ‌మ‌నార్హం.
రాష్ట్ర విభ‌జ‌న నేప‌థ్యంలో నిబంధ‌న‌ల మేర‌కు ఇప్ప‌టికే తానిచ్చిన నిధుల‌కు లెక్క‌లు చెప్పాలంటూ ప‌లుమార్లు కేంద్ర ప్ర‌భుత్వం చంద్ర‌బాబు స‌ర్కారుకు శ్రీముఖాలు పంపిన సంగ‌తి తెలిసిందే. అయితే కేంద్రం అడిగిన లెక్క‌ల‌ను చెప్పే విష‌యాన్ని ఎప్ప‌టిక‌ప్పుడు దాట‌వేస్తూ వ‌స్తున్న చంద్ర‌బాబు స‌ర్కారు... ఎలాగోలా నెట్టుకొస్తోంది. తానిచ్చిన నిధుల‌కు లెక్క‌లు చెబితే త‌ప్పించి త‌దుప‌రి నిధుల విడుద‌ల సాధ్యం కాద‌ని కేంద్రం చెప్పినా... చంద్ర‌బాబు స‌ర్కారులో చ‌ల‌నం క‌నిపించ‌డం లేద‌న్న వాద‌న వినిపిస్తోంది.

ఈ క్ర‌మంలో పోల‌వ‌రం ప్రాజెక్టుకు సంబంధించి తాను ఇస్తున్న నిధుల‌ను చంద్ర‌బాబు స‌ర్కారు స‌వ్యంగా ఖ‌ర్చు చేస్తోందా? అన్న అనుమానం వ‌చ్చిన కేంద్రం... స‌ద‌రు లెక్క‌ల‌ను ఎప్ప‌టిక‌ప్పుడు ప్ర‌త్య‌క్షంగా ప‌రిశీలించేందుకు ఓ క‌మిటీని వేసింది. చంద్ర‌బాబుకు మాట‌మాత్రంగా కూడా చెప్ప‌కుండా కేంద్రం వేసిన ఈ క‌మిటీ నేడు పోల‌వ‌రం ప్రాజెక్టును సంద‌ర్శించ‌నుంది. వ‌రుస‌గా మూడు రోజుల పాటు రాష్ట్రంలోనే ఉండే ఈ క‌మిటీ... తొలి రెండు రోజులు ప్రాజెక్టు ప‌నుల‌ను ప‌రిశీలించి, ఆ త‌ర్వాత విజ‌య‌వాడ‌లో చంద్ర‌బాబు స‌ర్కారు సిద్ధం చేసిన లెక్క‌ల‌ను ప‌రిశీలించ‌నున్న‌ట్లు స‌మాచారం. ఈ క‌మిటీకి కేంద్ర జ‌ల సంఘం స‌భ్యుడు మ‌సూద్ అహ్మ‌ద్ నేతృత్వం వ‌హించ‌నుండ‌గా, క‌మిటీలో మ‌రో న‌లుగురు స‌భ్యులు - న‌లుగురు చీఫ్ ఇంజినీర్లు కూడా ఉన్నార‌ట‌. ఇక వీరితో పాటు ఇప్ప‌టికే పోల‌వ‌రం ప‌నుల ప‌ర్య‌వేక్ష‌ణ కోసం నియ‌మించిన క‌మిటీ చైర్మ‌న్‌ - ఆ క‌మిటీలోని ప‌లువురు స‌భ్యులు కూడా కొత్త క‌మిటీలో ఆహ్వానితులుగా ఉంటార‌ని కేంద్ర జ‌ల‌వ‌న‌రుల శాఖ స్ప‌ష్ట‌మైన ఉత్త‌ర్వులు జారీ చేసింది.

ఇక ఈ కొత్త క‌మిటీ బాధ్య‌త‌ల‌ను కూడా కేంద్రం స్ప‌ష్టంగానే వివ‌రించింది, ప‌నుల ప‌ర్య‌వేక్ష‌ణ‌తో పాటు ప‌నుల నాణ్య‌త‌, నిధుల స‌ద్వినియోగం, ప‌నుల్లో జ‌రుగుతున్న జాప్యాన్ని నివారించేందుకు తీసుకోవాల్సిన జాగ్ర‌త్త‌లు త‌దిత‌రాల‌పైనా క‌మిటీ ప‌రిశీల‌న చేస్తుంద‌ట‌. ప్ర‌తి మూడు నెల‌ల‌కు ఓమారు రాష్ట్రానికి రానున్న ఈ క‌మిటీ.. ప‌నుల్లో ఏమాత్రం నాణ్య‌త లోపించినా, జాప్యం జ‌రిగినా, చిల్లి గ‌వ్వ కూడా ప‌క్క‌దారి ప‌ట్టినా... కూడా వెంట‌నే కేంద్రాన్ని అప్ర‌మ‌త్తం చేస్తుంద‌ట‌. అంతేకాకుండా ప్రాజెక్టును ప‌రిశీలించిన ప్ర‌తి సారీ నిధుల వ్య‌యంతో పాటు ప్ర‌తి అంశంపైనా క‌మిటీ స్ప‌ష్ట‌మైన నివేదిక‌ను కేంద్రానికి స‌మ‌ర్పించ‌నుంద‌ట‌.

కేంద్రం నుంచి ఈ ప్ర‌క‌ట‌న వెలువ‌డిన వెంట‌నే... చంద్ర‌బాబు అండ్ కో షాక్ కు గుర‌య్యార‌ట‌. ఇప్ప‌టికే ప‌నుల ప‌ర్య‌వేక్ష‌ణ కోసం ఓ క‌మిటీని వేశార‌ని, ఇప్పుడు మ‌రో క‌మిటీ వేసి నిధుల వ్య‌యంపైనా నిఘా పెడితే... తామెలా ప‌నిచేసేది అంటూ బాబు అండ్ బ్యాచ్ తెగ ఇబ్బంది ప‌డుతున్నార‌ట‌. అంటే... ఇక‌పై పోల‌వ‌రం ప్రాజెక్టు ప‌నులు ఫ‌లానా కార‌ణం చేత ఆగిపోయాయ‌ని బుకాయించ‌డం, నిధులు ఖ‌ర్చు కాకున్నా ఖ‌ర్చు చేసిన‌ట్లు చూప‌డం సాధ్యం కాద‌న్న మాట‌. కేంద్రం తీసుకున్న ఈ షాకింగ్ నిర్ణ‌యంతో ఇటు బాబు స‌ర్కారుతో పాటు అటు ప‌నులు చేస్తున్న రాయ‌పాటి సాంబ‌శివ‌రావు కంపెనీ ప‌ప్పులు ఉడక‌వ‌న్న మాట‌.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/