Begin typing your search above and press return to search.

అప్పు అడిగినా తప్పేనంటున్న కేంద్రం

By:  Tupaki Desk   |   5 Dec 2015 7:24 AM GMT
అప్పు అడిగినా తప్పేనంటున్న కేంద్రం
X
ఆంధ్రప్రదేశ్ పరిస్థితి మూలిగే నక్కపై తాటిపండు పడిన చందంగా మారింది. అసలే విభజన కష్టాలను ఈదలేక నానా బాధ పడుతుంటే ప్రకృతి విపత్తులు మరిన్ని కష్టాలు తెస్లున్నాయి. చంద్రబాబు పదవి చేపట్టిన కొద్దిరోజులకే గత ఏడాది హుద్ హుద్ తుపాను వచ్చింది. ఈ ఏడాది కరవు... దక్షిణాంద్రలో వరదలు.. ఇలా వరుస విపత్తులతో ఏపీ ఆర్థిక ఇబ్బందులు రెట్టింపవుతున్నాయి. ఈ సమయంలో అండగా ఉండాల్సిన కేంద్రం నుంచి అందుతున్న సహాయం అంతంతే కాగా.. కనీసం ఆర్బీఐ నుంచి అప్పు తీసుకుందామన్నా కూడా అందుకు కేంద్రం నిబంధనలు అడ్డంకిగా మారాయి. ప్రత్యేక హోదా ఇవ్వని కేంద్రం కనీసం ప్రత్యేక కేసుగా తీసుకుని ఈ నిబంధనల నుంచి ఏపీని మినహాయించాలని రాష్ట్రం కోరుతున్నా కేంద్రం మాత్రం కరుణించడం లేదు. తాజాగా ఆర్బీఐని ఏపీ 4వేల కోట్ల రుణం అడిగితే కేంద్రప్రభుత్వం తీసుకువచ్చిన ఫిస్కల్ రెస్పాన్సిబిలిటీ అండ్ బడ్జెట్ మేనేజిమెంట్ నిబంధనలను చూపించి 2 వేల కోట్లకే అనుమతిచ్చారు. దీంతో కేంద్రం పద్ధతి ''అమ్మ పెట్టాపెట్టదు.. అడుక్కు తినానివ్వదు'' అన్నట్లుగా ఉందన్న విమర్శలు వస్తున్నాయి.

కరవు - వరదలు - సంక్షేమ పథకాలు - నూతన రాజధాని నిర్మాణం - సిబ్బంది వేతనాల పెరుగుదలతో ఆర్థిక లోటుతో అల్లాడుతున్న ఆంధ్రప్రదేశ్ అప్పుల కోసం చుట్టూ చూస్తోంది. కేంద్రప్రభుత్వం తీసుకువచ్చిన ఫిస్కల్ రెస్పాన్సిబిలిటీ అండ్ బడ్జెట్ మేనేజిమెంట్ ప్రకారం ఆంధ్రప్రదేశ్ జిడిపిలో 3 శాతానికి మించి అప్పులు తీసుకునే అవకాశం లేదు. దానికి తోడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అప్పుల కోసం తిరుగుతున్న ప్రతిసారీ రాష్ట్రం నిరుపయోగ వ్యయాన్ని ఎక్కువగా చేస్తోందని కేంద్రప్రభుత్వం హెచ్చరికలు జారీ చేస్తూనే ఉంది. యథాప్రకారం రాష్ట్రప్రభుత్వం నాలుగువేల కోట్లు కావాలని అడిగితే తొలి త్రైమాసికంలో 3500 కోట్లు - రెండో త్రైమాసికంలో 3500 కోట్లకు అనుమతించిన ఆర్‌ బిఐ మూడో త్రైమాసికంలో రెండు వేల కోట్లకే అనుమతి మంజూరు చేసింది. ఆంధ్రప్రదేశ్ రాజధాని శంకుస్థాపనకు ప్రధాని నరేంద్రమోదీ వస్తున్నారనే సందర్భాన్ని చూపించి ప్రభుత్వం 1500 కోట్ల రూపాయలు కావాలని కేంద్రాన్ని అక్టోబర్ 11న అడిగింది. గత ఏడాది డిసెంబర్‌లో ప్రధాని నరేంద్రమోదీని కలిసినపుడు ఆంధ్రప్రదేశ్ అవశేష రాష్ట్రంగా మిగిలింది కనుక అభివృద్ధి పనులకు కొంత మినహాయింపులు ఇచ్చి ఆర్థికంగా ఆదుకోవాలని కోరారు. ఎఫ్‌ ఆర్‌ బిఎం నిబంధనలు సడలించి జిడిపిలో 7 శాతం వరకూ నిధులు అప్పు చేసుకునేందుకు వీలుకల్పించాలని సిఎం కోరారు. అప్పుల నిబంధనలను సడలించని కేంద్రం గత ఏడాది 4403 కోట్లు మంజూరు చేయగా, ఈ ఏడాది ప్రత్యేక సాయం కింద 100 కోట్లు, ఏడు వెనుకబడిన జిల్లాల అభివృద్ధికి 350 కోట్లు, కొత్త రాజధానికి 350 కోట్లు, పోలవరం ప్రాజెక్టుకు 350 కోట్లు మంజూరు చేసింది. అలాగే ఇటీవల కురిసిన వర్షాలకు దెబ్బతిన్న ప్రాంతాల సాయానికి మరో 300 కోట్లు మంజూరు చేసింది.

రాష్ట్రప్రభుత్వం ప్రస్తుతం ఉన్న నిబంధనల ప్రకారం 17851 కోట్లు రుణంగా పొందే వీలుండగా ఇప్పటికే రాష్ట్రప్రభుత్వం తొమ్మిది వేల కోట్లకు పైగా అప్పులు చేసింది. కాగా, తాజాగా రాష్ట్రావసరాలను తీర్చుకునేందుకు రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా నుండి రుణం తీసుకోవాలని ఎపి ప్రభుత్వం నిర్ణయించింది. ఫిస్కల్ రెస్పాన్సిబిలిటీ అండ్ బడ్జెట్ మేనేజిమెంట్ నిబంధనల మేరకు నాలుగు వేల కోట్ల రూపాయలు రుణం తీసుకునేందుకు అనుమతించాలంటూ కేంద్ర ప్రభుత్వానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం లేఖ రాసింది. దానికి కేంద్రం ఆమోదం తెలిపింది. అక్టోబర్ -డిసెంబర్ త్రైమాసికానికి 2వేల కోట్ల రూపాయలు రుణంగా తీసుకోవచ్చని కేంద్రం చెప్పింది. దాంతో బాండ్లను సమర్పించి ఆ మొత్తాన్ని అప్పుగా తీసుకోవాలని రాష్ట్ర సర్కార్ నిర్ణయించింది. గతంలో రిజర్వుబ్యాంకు నుండి ఆంధ్రప్రదేశ్ 9వేల కోట్ల రూపాయల వరకూ రుణం తీసుకుంది.