Begin typing your search above and press return to search.

చంద్రుళ్ల జంపింగ్ పాలిటిక్స్ కు ‘మోడీ’ సాయం?

By:  Tupaki Desk   |   9 March 2017 4:31 AM GMT
చంద్రుళ్ల జంపింగ్ పాలిటిక్స్ కు ‘మోడీ’ సాయం?
X
ఆపరేషన్ ఆకర్ష్ పేరుతో రెండు తెలుగురాష్ట్రాల ముఖ్యమంత్రులిద్దరూ జంపింగ్ రాజకీయాల్ని ఏ స్థాయిలో ప్రోత్సహించారో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరమే లేదు. తమకు బలమైన నేతలు ఉన్నప్పటికి.. పార్టీని మరింత బలోపేతం చేయటానికి.. ప్రత్యర్థి పార్టీలోని బలమైన నేతల్ని తమ పార్టీలోకి తీసుకొచ్చే కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేసిన విషయం తెలిసేందే. ఈ స్థాయిలో నేతల జంపింగ్స్ కు సై అంటున్న చంద్రుళ్లు.. 2019 ఎన్నికల వేళ సీట్ల సర్దుబాటు ఏ విధంగా చేస్తారన్న సందేహాలు కొందరు వ్యక్తం చేశారు.

దీనికి సమాధానంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ స్థానాలు పెంచుకుంటే పోలా అన్నసమాధానం వచ్చింది. ఈ మాటలేదో యథాలాపంగా వచ్చినవి కావన్నది మర్చిపోకూడదు. రాష్ట్ర విభజన నేపథ్యంలో అసెంబ్లీ నియోజకవర్గాల పెంపు విషయంపై ఇచ్చిన హామీతో సీట్ల పెంపు పెద్ద కష్టమైన అంశం కాదు. కాకుంటే.. కేంద్రం అందుకు సానుకూలంగా ఉండాలన్నదే అసలు పాయింట్. నిన్నమొన్నటి వరకూ సీట్ల పెంపుపై కేంద్రం అంత సుముఖంగా లేదన్న మాట వినిపించింది. నిజానికి సీట్ల పెంపు వ్యవహారం పది రోజుల్లో ముగిసిపోయేది కాదు. దానికి చాలానే కసరత్తు అవసరం.

ఎన్నికలకు ఇంకా రెండేళ్లు మాత్రమే గడువు ఉన్న నేపథ్యంలో.. సీట్ల పెంపు అంశంపై ప్రత్యేక దృష్టి పెడితే తప్పించి పూర్తి కాని పరిస్థితి. తాము చేసిన జంపింగ్ రాజకీయాలకు పుణ్యం.. పురుషార్థం దక్కాలంటే.. 2019 నాటికి అసెంబ్లీ స్థానాల సంఖ్య పెరగాల్సిందే. అయితే.. కేంద్రం నుంచి సానుకూలత రాని నేపథ్యంలో.. ఇప్పటికే ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అందుకు తగ్గట్లు ప్లానింగ్ చేస్తున్నారు. అసెంబ్లీ సీట్లను ఇద్దరేసి బలమైన నేతలు ఆశించే అవకాశం ఉన్న చోట్ల.. సదరు నేతల్ని ఎమ్మెల్సీలను చేసేసి.. ఫ్యూచర్ కి ప్రాబ్లం కాకుండా చూసుకుంటున్నారు.

ఇంతకీ.. సీట్ల పెంపకం మీద ఉన్నట్లుండి ఫోకస్ పెరగటానికి కారణం లేకపోలేదు. అసెంబ్లీ సీట్ల సంఖ్యను పెంచేందుకు వీలుగా కేంద్రం నుంచి వచ్చిన తాజా వర్తమానమే ఈ చర్చకు కారణంగా చెప్పాలి. ప్రస్తుతం ఏపీలో 175 అసెంబ్లీ స్థానాలు ఉండగా.. వాటిని 225కు పెంచటం.. అదే సమయంలో తెలంగాణలో ఉన్న119 స్థానాల్ని 153 స్థానాలకు పెంచేందుకు వీలుగా.. పార్లమెంటులో బిల్లు ప్రవేశ పెట్టేందుకు అనువుగా.. భౌగోళిక.. ఇతర సంబంధిత గణాంకాలు.. పాలనా యూనిట్లలో మార్పులు.. చేర్పులతో కూడిన ఆడ్మినిస్ట్రేటివ్ రిపోర్ట్ ను పంపాలని కేంద్ర న్యాయ మంత్రిత్వ శాఖ ద్వారా ఉభయ రాష్ట్రాలకు సమాచారం అందింది. దీంతో.. అసెంబ్లీ సీట్ల పెంపుఅంశంపై చర్చ మళ్లీ మొదలైంది. నిన్న మొన్నటి వరకూ ఈ వ్యవహారంపై చూసీచూడనట్లుగా వ్యవహరించిన కేంద్రం.. ఇప్పుడు కదలికరావటంపై ఆసక్తి వ్యక్తమవుతోంది.

కేంద్రం కోరిన సమాచారాన్ని రెండు రాష్ట్రాలు పంపిన తర్వాత ఏం జరుగుతుందన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. అయితే..అసెంబ్లీ నియోజకవర్గాల పెంపు అంత అషామాషీ వ్యవహారం ఎంతమాత్రం కాదని.. దానికి చాలానే లెక్కలు ఉన్నాయని.. నియోజకవర్గాల సరిహద్దులు సిద్ధం చేయటం.. అందుకు కేంద్రం ఓకే అనటానికి మద్యనే కసరత్తు ఉందని.. ప్రతి దశ పట్ల కేంద్రం ప్రత్యేక శ్రద్ధను ప్రదర్శిస్తే తప్పించి.. 2019 ఎన్నికల నాటికి కొత్త అసెంబ్లీ నియోజకవర్గాలు సిద్ధం కావని చెబుతున్నారు. ఏమైనా.. నిన్నటి వరకూ లేని ఆశల్ని.. నేడు మొగ్గ తొడిగేలా కేంద్రం స్పందిస్తున్న నేపథ్యంలో చంద్రుళ్లు చేసిన జంపింగ్ పాలిటిక్స్ కు మోడీ దన్ను ఉందనేటట్లుగా తాజా పరిణామాలు ఉన్నాయని చెప్పక తప్పదు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/