Begin typing your search above and press return to search.

నిధులిస్తే ఏపీకి ఖర్చు చేయటం చేతకావట్లేదట

By:  Tupaki Desk   |   14 July 2016 5:48 AM GMT
నిధులిస్తే ఏపీకి ఖర్చు చేయటం చేతకావట్లేదట
X
నిత్యం పేదరికపు అరుపులు అరిచే ఏపీ సర్కారుకు కేంద్రం తనదైన శైలిలో షాకిచ్చింది. అదనపు నిధుల కోసం నిత్యం పెడబొబ్బలు పెట్టే ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు తీరుకు భిన్నంగా ఏపీ సర్కారు పని చేస్తుందన్నది కేంద్రం ఆరోపణ. అదనపు నిధుల సంగతి తర్వాత.. ముందు ఇచ్చిన నిధుల్ని ఖర్చు చేయరే? అంటూ వార్నింగ్ తో కూడిన ఒక లేఖ రాసింది.

రాష్ట్రానికి కేంద్రం ఇచ్చిన నిధుల్ని సకాలంలో ఖర్చు చేయని పక్షంలో ఇచ్చిన నిధులను వెనక్కి తీసుకుంటామంటూ ఘాటుగా హెచ్చరికలు జారీ చేసింది. ఏపీలో రోడ్ల పనుల కోసం కేంద్రం భారీగా నిధులు విడుదల చేసింది. వాటిని ఖర్చు చేయాల్సి ఉన్నా.. అధికారుల తీరుతో ఇప్పటివరకూ ఆ నిధులు ఖర్చు చేయని పరిస్థితి. దీంతో.. ఆగ్రహం వ్యక్తం చేసిన కేంద్రం విడుదల చేసిన నిధుల్ని ఎందుకు ఖర్చు చేయరని ప్రశ్నించటమే కాదు.. పనులు పూర్తి చేసేందుకు అంత బద్ధకం ఎందుకని ఘాటుగా ప్రశ్నించింది.

ఇచ్చిన నిధులకు తగ్గట్లు పనులు జరగని పక్షంలో వాటిని వెనక్కి తీసేసుకుంటామని చెప్పిన కేంద్రం.. తమ అధికారులు వచ్చి జరిగిన పనులను సమీక్షిస్తారని వెల్లడించింది. రోడ్ల నిర్మాణ పనుల్ని ఏపీ సర్కారు చూసుకోవాలని.. లోపాల్ని సరిదిద్దుకోవాలని.. పనుల్లో వేగం పెరగని పక్షంలో నిధుల జారీ కష్టమని కేంద్రం తేల్చి చెబుతోంది. రావాల్సిన నిధుల గురించి పదే పదే తిరగటం తప్పు లేదుకానీ.. కేంద్రం విడుదల చేసిన నిధుల్ని.. ఎంచక్కా సమయానికి పూర్తిగా వినియోగిస్తే సరిపోతుంది కదా? నిధులు తెచ్చుకోవటమే కష్టంగా ఉన్న వేళ.. వచ్చిన నిధుల్ని ఖర్చు చేయటం కూడా కష్టమైతే ఎలా? కేంద్రం విడుదల చేసిన నిధులపై ఏపీ ముఖ్యమంత్రి ప్రత్యేకంగా దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.