Begin typing your search above and press return to search.

ప్రత్యేక హోదా రాకపోతే ఏం..?

By:  Tupaki Desk   |   1 Aug 2015 9:08 AM GMT
ప్రత్యేక హోదా రాకపోతే ఏం..?
X
దేశంలో ఏ రాష్ట్రానికీ ప్రత్యేక హోదా ఇవ్వలేమని కేంద్రం స్పష్టంగా చెప్పేశాక దానిపై ఆశలు పూర్తిగా పోయాయి. అయితే.... ప్రత్యేక హోదా అన్న పేరుతో ఆంధ్రప్రదేశ్ కు లబ్ధి చేకూర్చితే ఆ హోదా కోరుతున్న మిగతారాష్ట్రాల నుంచి కూడా ఇబ్బందులు, ఒత్తిడి వస్తాయన్న ఉద్దేశంతో కేంద్రం ప్రత్యేక హోదాపై అంత మొండిపట్టుదలకు పోతున్నట్లుగా తెలుస్తోంది. అదేసమయంలో మిత్రపక్షం టీడీపీ పాలనలో ఉన్న ఏపీకి న్యాయం చేయాలన్న ఉద్దేశం కేంద్రానికి ఉందనీ తెలుస్తోంది. ప్రత్యేక హోదా అన్న పేరొక్కటి ఉండదు కానీ దాదాపుగా ఆ స్థాయి ప్రయోజనాలు కల్పించడానికి కేంద్రం యోచిస్తున్నట్లగా సమాచారం. అంతేకాదు... రాష్ట్రం తరఫు నుంచి కూడా వివిధ మార్గాల్లో కేంద్రం సాయం చేయడానికి గల అవకాశాలపై నివేదిక ఇవ్వనున్నారని సమాచారం. ఈ నేపథ్యంలో అసలు కేంద్రం ఏపీకి ఏఏ రకాలుగా సాయం చేయడానికి అవకాశముందన్నది నిపుణులు పేర్కొంటున్నారు.

- విభజన సమయంలో ఏపీ నెత్తిన పడిన అప్పుల భారాన్ని కేంద్రం కొంత భరించాలి. ఇది వడ్డీ చెల్లింపు భారం తీసుకోవడం రూపంలోనో... లేదంటే ఏకంగా కొన్ని రుణాలను మాఫీ చేయడంగానో ఉండాలి.

- ఏపీ ప్రభుత్వం కొత్తగా చేస్తున్న అప్పుల ద్వారా వచ్చిన మొత్తాన్ని కేంద్రం గ్రాంటుగా ప్రకటించే అవకాశం ఉంది. వీటిపై వడ్డీ రాయితీ ఇవ్వొచ్చు. లేదంటే వడ్డీ తక్కువగా ఉండే జపాన్ బ్యాంకుల నుంచి రుణం పొందేలా సహకరించి హామీగా ఉండాలి.

- కేంద్రం ఏపీకి ఇస్తున్న నిధుల్లో 70 శాతాన్ని తిరిగి చెల్లించే అవసరం లేకుండా గ్రాంటుగా ఇవ్వొచ్చు.

- కేంద్రం నిధుల్లో 30% నిధుల మీద వడ్డీ మినహాయింపు లేదా 10 ఏళ్ల పాటు మారటోరియం ఇవ్వొచ్చు

- ప్రత్యేక ప్యాకేజీ అమలువుతున్న ఏడు జిల్లాల్లో పన్ను మినహాయింపు ప్రకటించొచ్చు.

- ఆంధ్ర ప్రదేశ్ కొత్త రాజధాని ప్రాంతం లో రియల్ ఎస్టేట్ లో వచ్చే ఆదాయానికి కాపిటల్ గెయిన్స్ మీద 10 ఏళ్ల వరకు ఆదాయ పన్ను మినహాయింపు ఇవ్వాలి, అదికూడా ఆదాయ పన్ను చట్టం ప్రకారం ఏ విధమైన షరతులు లేకుండా ఇవ్వాలి. అంటే కాపిటల్ గెయిన్స్ ను కొన్ని రంగాల లో పెట్టుబడి పెడితే ఎలాగూ ఆదాయ పన్ను ఉండదు, దీనిలో కూడా ఆంధ్ర కు మినహాయింపు ఇవ్వాలి, తద్వారా పారిశ్రామిక రంగం లో పెట్టుబడులు పెరుగుతాయి.

- సాఫ్టువేర్ రంగంలో ఏపీని బలోపేతం చేయడానికి గాను పన్ను మినహాయింపులు కొనసాగించాలి, మాట్ (మినిమం ఆల్టర్ నేటివ్ టాక్స్) నుండి ఆంధ్ర కు పదేళ్ళ పాటు మినహాయింపు ఇవ్వాలి.

- కొత్త కంపెనీల రుణాలకు వడ్డీ మినహాయింపు కనీసం 6 నుంచి 8% వుండాలి. ఇప్పటికే ఎస్.సి.ఎస్.టి, బి.సి లకు ఇలాంటి పధకాలు వున్నాయి. ఈ వడ్డీ మినహాయింపు ఇస్తే కనీసం 15 ఏళ్ళు అయినా ఇవ్వాలి , లేకపోతె ఆంధ్ర ప్రదేశ్ లో పారిశ్రామిక వృద్ధి జరగదు. కొత్త పరిశ్రమలు కు, వాటితో పాటు ఇప్పటికే ఉన్న పరిశ్రమలకు కూడా ప్రోత్సాహకం కింద 3- 5% వడ్డీ మినహాయింపు ఇవ్వాలి. ఏపీలో రిజిస్టర్ అయిన, కేంద్ర కార్యాలయం ఉన్న కంపెనీలకు మాత్రమె ఈ వడ్డీ రిబేట్ ఇవ్వాలి.

- ఏపీ పారిశ్రామికవేత్తల కోసం 5 వేల కోట్లతో వెంచర్ ఫండ్ ను ఏర్పాటుచేయాలి. ముఖ్యంగా ఇది ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలకే ఇవ్వాలి. ఇతర రాష్ట్రాలలో సంస్థలు ఉన్న కంపెనీలకు ఇవ్వకూడదు. ఈ నిధిని ఏటా పెంచుతూ పోవాలి. వచ్చే 5 ఏళ్లలో ఏపీ వద్ద 20 వేల కోట్ల వెంచర్ కేపిటల్ పోగయి అది కొత్త సంస్థలకు మూలధనంగా ఇచ్చేలా ఉండాలి.

మనసుంటే మార్గముంటుంది అన్నట్లుగా కేంద్రం అనుకోవాలే కానీ ప్రత్యేక హోదా ఇవ్వకపోయినా ఏపీ పరిస్థితులను గమనించి ప్రత్యేకంగా తీసుకుని వివిధ రూపాల్లో లబ్ధి చేకూర్చొచ్చు. తెలుగుదేశం ఎంపీలు, సీఎం చంద్రబాబుల వైఖరి చూస్తుంటే కేంద్రం నుంచి ఇలాంటి ప్రత్యేక సహాయం అందే అవకాశాలు ఉన్నట్లుగానే అనిపిస్తోంది.