Begin typing your search above and press return to search.

ఇండియాలో ఇక క‌న్న‌బిడ్డ‌ల‌ను కొడితే జైలుకే

By:  Tupaki Desk   |   20 Nov 2015 6:59 AM GMT
ఇండియాలో ఇక క‌న్న‌బిడ్డ‌ల‌ను కొడితే జైలుకే
X
ఇండియాలో చిన్న‌చిన్న విష‌యాలుగా ప‌రిగ‌ణించే కొన్ని అంశాలు విదేశాల్లో తీవ్ర శిక్ష‌లు ప‌డే నేరాల‌న్న సంగ‌తి తెలిసిందే. ప‌లువురు భార‌తీయుల‌కు అలాంటి శిక్ష‌లు అనుభ‌వించాల్సిన ప‌రిస్థితులూ ఎదురైన విష‌యం తెలిసిందే. త‌మ చిన్నారుల‌ను ముద్దాడినందుకు, త‌మ వద్దే ప‌డుకోబెట్టుకున్నందుకు గ‌తంలో ఓ భార‌తీయ దంప‌తులు కేసుల్లో చిక్కుకుని నార్వేలో నానా ఇబ్బందులు ప‌డిన సంగ‌తి తెలిసిందే. మ‌రీ అంతలా కాకున్నా ఇక ఇండియాలో పిల్ల‌ల విష‌యంలో ఇప్పుడు ప్రాక్టీస్ లో ఉన్న కొన్ని అంశాలు క‌ఠిన శిక్ష‌ల‌కు దారితీసే అవ‌కాశాలు క‌నిపిస్తున్నాయి. కేంద్రం ఆ దిశ‌గా కొత్త చ‌ట్టాలు రూపొందిస్తుండ‌డమే అందుకు కార‌ణం. మ‌న‌దేశంలో ఇక‌పై త‌ల్లిదండ్రులు త‌మ పిల్ల‌ల‌ను కొడితే క‌ఠినంగా శిక్షించేలా కొత్త చ‌ట్టం తేవ‌డానికి రంగం సిద్ధ‌మ‌వుతోంది.

చిన్నారుల సంర‌క్ష‌ణ‌, వారి హ‌క్కుల‌ను కాపాడేందుకు ఇండియ‌న్ గ‌వ‌ర్న‌మెంటు కొత్త చ‌ట్టాన్ని రెడీ చేస్తోంది. దాని ప్ర‌కారం పిల్ల‌ల‌ను కొట్టే త‌ల్లిదండ్రుల‌కు శిక్ష‌లు ప‌డ‌తాయి. క్ర‌మ‌శిక్ష‌ణ పేరుతో చిన్నారుల‌ను దండించ‌డాన్ని ఈ చ‌ట్టం తీవ్రంగా వ్య‌తిరేకిస్తోంది. చిన్నారుల‌ను కొట్టిన నేరం తొలిసారి నిరూప‌ణ అయితే ఆర్నెళ్ల జైలు లేదా జ‌రిమానా విధిస్తారు. రెండు క‌లిపి కూడా విధించొచ్చు. రెండోసారి కూడా అదేనేరం చేస్తే మూడేళ్ల జైలు శిక్ష‌, 50 వేల జ‌రిమానా... మూడోసారి కూడా అదేప‌ని చేస్తే అయిదేళ్ల జైలు ల‌క్ష జ‌రిమానా వేసేలా ఈ చ‌ట్టంలో నిబంధ‌న‌లు పెడుతున్నారు. ఇక పాఠ‌శాల‌ల్లో చిన్నారుల‌ను దండించినా, విచార‌ణ‌కు పాఠ‌శాల సిబ్బంది స‌హ‌క‌రించ‌క‌పోయినా తీవ్ర శిక్ష‌లు ఉంటాయి. పిల్ల‌ల‌ను ఎవ‌రైనా చట్ట వ్య‌తిరేక కార్య‌క‌లాపాల్లో ఉప‌యోగిస్తే వారికి ఏడేళ్ల జైలు శిక్ష వేస్తారు.పిల్ల‌ల‌ను త‌ల్లిదండ్రులు కొడుతుంటే వారికి త‌ల్లిదండ్రుల‌తో అనుబంధం త‌గ్గుతుంద‌ని... హింసా ప్ర‌వృత్తివైపు మ‌ళ్లుతార‌ని కేంద్రం చెబుతోంది.