Begin typing your search above and press return to search.

పేరుకే విశాఖ జోన్.. ఆదాయం నిల్..

By:  Tupaki Desk   |   28 Feb 2019 8:48 AM GMT
పేరుకే విశాఖ జోన్.. ఆదాయం నిల్..
X
విశాఖ రైల్వే జోన్ ఏపీ ప్రజల చిరకాల కోరిక. ఏపీ పునర్విభజన చట్టం ప్రకారం ఏపీలోని విశాఖను కేంద్రం రైల్వే జోన్ గా ప్రకటించాల్సింది. గత నాలుగేళ్లుగా అధికార - ప్రతిపక్ష పార్టీలు విశాఖను రైల్వే జోన్ గా ప్రకటించాలని కోరుతూ వచ్చారు. కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టని ప్రతిసారీ ఎదురుచూసి నిరాశ చెందేవారు. కాగా ఇక ఏపీలో ఎన్నికల సమీపిస్తుండటంతో బీజేపీ ప్రభుత్వం ఎన్నికల తాయిలంగా విశాఖ రైల్వే జోన్ గా ప్రకటించింది.

పేరుకే విశాఖ రైల్వే జోన్ ను ప్రకటించింది తప్ప మళ్లీ మోడీ సర్కార్ తిరకాసు పెట్టింది. ప్రస్తుతం కేంద్రం ప్రకటించిన జోన్ వల్ల ఏపీకీ ఎలాంటి లాభం చేకూరదనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. ఏడాదికి సుమారు రూ.7500 కోట్ల ఆదాయం వచ్చే వాల్తేరు డివిజన్ ను రెండు ముక్కలు చేసి రైల్వే జోన్ ప్రకటించారు. దీనివల్ల విశాఖ రైల్వేకు ఆదాయం అంతంత మాత్రంగా రానుంది.

విశాఖకు చత్తీస్ గడ్ - ఒడిశా - కోరాపూట్ రైల్వే లైన్ల నుంచి భారీ ఎత్తున ఖనిజ రవాణ జరుగుతుంది. ఈ లైన్లను కొత్తగా రాయగడ డివిజన్లో ఏర్పాటు చేశారు. రాయగడ్ డివిజన్ భువనేశ్వర్ కేంద్రంగా ఉన్న ఈస్ట్ కోస్ట్ రైల్వే జోన్లో ఉండబోతుంది. దీంతో ఆదాయం అంతా పాత జోన్ కు వెళుతుంది నిర్వహణ మాత్రం విశాఖ జోన్ కు కట్టబెట్టారు. అదేవిధంగా రైల్వే జోన్ వస్తే ఉద్యోగాల్లో ప్రాధాన్యం ఉంటుంది. కానీ కేంద్రం ఆర్ఆర్బీని ప్రకటించలేదు. దీంతో ఏపీ ప్రజలు పరీక్షలు రాసేందుకు భువనేశ్వర్ - సికింద్రాబాద్ ప్రాంతాలకు వెళ్లాల్సి ఉంటుంది.

ఆదాయం లేకుండా విశాఖ రైల్వే నిలదొక్కుకోవడం కష్టంగా కనిపిస్తుంది. ఎన్నికలు సమీపిస్తున్నందునే మోడీ సర్కార్ తుతూ మంత్రంగా విశాఖ జోన్ ప్రకటించిందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా వైసీపీ నేత తమ్మినేని సీతారాం కూడా కేంద్రం రైల్వే జోన్ విషయంలో చేసిన మోసాన్ని ఎండగట్టారు. కేంద్రం విశాఖ రైల్వే జోన్ ప్రకటించడంతో కొంతమంది స్వాగతిస్తుండగా మరికొందరు ఆదాయం లేకుండా విశాఖ జోన్ ఎలా నిలదొక్కుకుంటుందని ప్రశ్నిస్తున్నారు. ఎలాగూ త్వరలో మోడీ ఏపీ పర్యటన చేయనుండటంతో మరిన్ని ఎన్నికల తాయిలాలు ప్రకటించడం ఖాయంగా కన్పిస్తుంది.