Begin typing your search above and press return to search.

కేంద్రం పక్కకు తప్పుకొంది..!

By:  Tupaki Desk   |   27 Jun 2015 11:27 AM GMT
కేంద్రం పక్కకు తప్పుకొంది..!
X
ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ వివాదాల నుంచి కేంద్ర ప్రభుత్వం పక్కకు తప్పుకొంది. వాటిని పరిష్కరించే బాధ్యతను ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్‌ నరసింహన్‌ మీద పెట్టింది. ఇంకా చెప్పాలంటే, రెండు రాష్ట్రాల సమస్యలను మరికొంత కాలంపాటు అపరిష్కృతంగానే ఉంచాలని కంకణం కట్టుకుంది.

రెండు రాష్ట్రాలూ వివిధ అంశాలపై ఇప్పటికే నువ్వంటే నువ్వంటూ ఘర్షణ పడుతున్నాయి. ప్రజల్లో కూడా భావోద్వేగాలు పెరిగే పరిస్థితులు ఇప్పుడిప్పుడే వస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం నేరుగా చేసుకోకపోయినా గవర్నర్‌కు అయినా నిర్దిష్టంగా దిశానిర్దేశం చేస్తుందని ప్రతి ఒక్కరూ భావించారు. కానీ, శుక్రవారం తనను కలిసిన గవర్నర్‌ నరసింహన్‌కు అది కూడా దిశానిర్దేశం చేయలేదు కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌. ఉదాహరణకు, ఓటుకు నోటు కేసులో కేంద్రం చేసేది ఏమీ లేదు. ఈ విషయం ఇప్పటికే కోర్టుల పరిధిలో ఉంది. కనక దానిని పట్టించుకోకపోయినా అర్థం చేసుకోవచ్చు. కానీ, ఫోన్‌ ట్యాపింగ్‌ కేసు కానీ సెక్షన్‌ 8 కానీ కేంద్రం పరిధిలోని అంశాలు. వీటి విషయంలో ఎలా ముందుకు వెళ్లాలనే అంశంగా గవర్నర్‌కు కేంద్రం దిశానిర్దేశం చేసి ఉండాల్సింది.

కేంద్ర ప్రభుత్వం ఈ దిశగా అడుగులు వేయలేదని నిపుణులు చెబుతున్నారు. మీదే బాధ్యత అంటూ మొత్తం బాధ్యతను గవర్నర్‌ మీదకు నెట్టేసిందని అంటున్నారు. సమస్యలను పరిష్కరించి సానుకూల వాతావరణాన్ని తీసుకు రావాల్సిన బాధ్యత కూడా మీదేనని ఆయనకు స్పష్టం చేశారు. అయితే, కరవమంటే కప్పకు, వదలమంటే పాముకు కోపం అన్నట్లుగా రెండు రాష్ట్రాల మధ్య గవర్నర్‌ కూడా నలిగిపోయే పరిస్థితి. ఒక నిర్ణయం తీసుకుంటే ఒకళ్లు పొగుడుతారు. మరొకరు తిడతారు. ఈ నేపథ్యంలో కేంద్రం స్పష్టమైన దిశానిర్దేశం చేస్తుందని ఆశించిన గవర్నర్‌కు కూడా కేంద్రం నిరాశనే మిగిల్చింది.