Begin typing your search above and press return to search.

జగన్ అవినీతి తవ్వుతానంటే...కేంద్రం నోటీసులిచ్చిందే!

By:  Tupaki Desk   |   22 July 2019 2:59 PM GMT
జగన్ అవినీతి తవ్వుతానంటే...కేంద్రం నోటీసులిచ్చిందే!
X
అవినీతి రహిత పాలన అందిస్తానంటూ వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఘనంగా ప్రకటిస్తే... ఆ ప్రకటనను స్వాగతించాల్సిన గురుతర బాధ్యత ఉన్న కేంద్రంలోని నరేంద్ర మోదీ సర్కారు అడ్డుపుల్లలు వేస్తోందన్న వాదన వినిపిస్తోంది. నిజమా? అంటే... ఇప్పుడు కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల నుంచి ఏపీ ప్రభుత్వానికి జారీ అయిన నోటీసులను చూస్తే... నిజమేనని ఒప్పుకోక తప్పదు. రాష్ట్ర విభజన నేపథ్యంలో అసలే తీవ్ర ఆర్థిక లోటుతో ప్రస్థానం ప్రారంభించిన ఏపీలో తొలి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన చంద్రబాబు సర్కారు... ఇష్టారాజ్యంగా నిర్ణయాలు తీసుకుని రాష్ట్రాన్ని మరింత అప్పుల పాలు చేసింది. ఈ విషయాన్ని విపక్షంలో ఉన్నప్పటి నుంచే నెత్తీనోరు మొత్తుకుంటూ వచ్చిన జగన్... తాజాగా తాను అధికారంలోకి రాగానే... గత సర్కారు తప్పిదాలను తవ్వి తీసి రాష్ట్రాన్ని పురోభివృద్ధి బాటలో నడిపిస్తానని దాదాపుగా శపథం చేసినంత పని చేశారు.

జగన్ చేసిన ప్రకటనపై తొలుత హర్షం వ్యక్తం చేసిన మోదీ... రానురాను తన వైఖరిని మార్చుకున్నట్లుగానే కనిపిస్తున్నారు. రాష్ట్రానికి వేలాది కోట్ల మేర నష్టాన్ని తెచ్చిపెడుతున్న విద్యుత్ కొనుగోలు ఒప్పందా(పీపీఏ)లను పున:సమీక్షిస్తానంటూ జగన్ రంగంలోకి దిగితే... మోదీ సర్కారు ఆదిలోనే అడ్డుపుల్ల వేసిన సంగతి తెలిసిందే. పీపీఏల పున:సమీక్షతో పెట్టుబడులు నిలిచిపోయే ప్రమాదం ఉందన్న సాకుతో జగన్ తన నిర్ణయాన్ని మార్చుకోవాలని ఇప్పటికే కేంద్రం రెండు లేఖలు రాసింది. అయినా కూడా తాను చెప్పిన మాటకు కట్టుబడ్డ జగన్... పీపీఏల పున:సమీక్షకే మొగ్గు చూపగా... ఇప్పుడు కేంద్రం ఆయనకు భారీ షాకే ఇచ్చింది. పీపీఏల పున:సమీక్షకు రావాలంటూ కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలైన ఎన్టీపీసీ - ఎస్ ఈసీఐలకు జగన్ సర్కారు లేఖలు రాసింది.

ఈ లేఖలను చూసిన ఆ రెండు సంస్థలు సమీక్షకు తాము రాలేమని చెబుతూనే... తమకు చెల్లించాల్సిన బకాయిలను తక్షణమే చెల్లించాలంటూ ఏకంగా నోటీసులు జారీ చేసి జగన్ సర్కారుకు షాకిచ్చాయి. అసలే అప్పుల్లో ఉన్న రాష్ట్రాన్ని కాపాడాల్సిన కేంద్రం.... ఉదారంగా నిధులు మంజూరు చేయాల్సింది పోయి.. కేంద్ర ప్రభుత్వ రంగంలోని విద్యుదోత్పత్తి సంస్థల ద్వారా తమ బకాయిల కోసం నోటీసులు జారీ చేయించిందంటే... పరిస్థితి ఎలా ఉందో ఇట్టే అర్థం కాకమానదు. కేంద్రం వ్యవహరిస్తున్న ఈ తీరుతో అవినీతిపై యుద్ధాన్ని జగన్ కొనసాగించడం కష్టంగానే కనిపిస్తోంది. అయినా అప్పులు అడగాల్సిన సమయం ఇదేనా? అన్న వాదన కూడా వినిపిస్తోంది.

పీపీఏల ద్వారా రాష్ట్రానికి వస్తున్న నష్టాన్ని తగ్గించుకుందామని జగన్ తీసుకున్న నిర్ణయమే తప్పిదమన్నట్లుగా మోదీ సర్కారు వ్యవహరిస్తున్న తీరుపై ఇప్పుడు సర్వత్రా విస్మయం వ్యక్తమవుతోందనే చెప్పాలి. అయినా పున:సమీక్ష అంటే పీపీఏలను రద్దు చేయడం కాదు కదా. రేట్లపై పున:సమీక్షే కదా. ఆ మాత్రానికే ఇప్పటికిప్పుడు అప్పులు చెల్లించాలంటూ కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల నుంచి నోటీసులు జారీ చేయించడం ద్వారా... అవినీతిపై జగన్ సాగిస్తున్న యుద్ధంపై కేంద్రం వైఖరి ఏమిటన్న ప్రశ్న కూడా ఉదయిస్తోంది. మొత్తంగా పీపీఏల పున:సమీక్షకు రమ్మంటే... ఆ సమీక్షలకు పిలవడమే తప్పన్నట్లుగా ఇప్పటికిప్పుడు అప్పులు చెల్లించాలంటూ కేంద్రం నుంచి నోటీసులు రావడం జగన్ సర్కారుకు నిజంగానే షాకింగనే చెప్పక తప్పదు.