Begin typing your search above and press return to search.

నోట్ల రద్దు అనంతరం అదిరిపోయే ఆఫర్ రెఢీ..?

By:  Tupaki Desk   |   30 Nov 2016 4:15 AM GMT
నోట్ల రద్దు అనంతరం అదిరిపోయే ఆఫర్ రెఢీ..?
X
దేశంలో బ్లాక్ మనీ లేకుండా చేస్తే.. ఎంతో బాగుంటుందంటూ జరుగుతున్న ప్రచారాన్ని నిజం చేసే ప్రయత్నాల్లో కేంద్రం ఉన్నట్లు చెబుతున్నారు. నల్లధనానికి కట్టడి చేసి.. దేశ వ్యాప్తంగా బ్లాక్ మనీ అన్నది లేకుండా చేయటం.. ప్రతి లావాదేవీని కచ్ఛితంగా అధికారికంగా మార్చటం ద్వారా దేశం రూపురేఖలే మారిపోతాయన్నవాదనకు బలం చేకూరేలా కేంద్రం తాజాగా ఒక సరికొత్త నిర్ణయాన్ని తీసుకునేందుకు సిద్ధమవుతున్నట్లు చెబుతున్నారు.

నోట్ల రద్దుపై జాతి జనుల్లో మరింత ఉత్సాహాన్ని నింపేందుకు.. వారిలో మరిన్ని ఆశలు పెరిగేలా చేసేందుకు వీలుగా సరికొత్త నిర్ణయాన్ని తీసుకోనున్నట్లుగా తెలుస్తోంది. ఒక కొత్త పథకం ద్వారా.. గృహనిర్మాణ రంగానికి కొత్త ఉత్సాహాన్ని ఇవ్వటంతో పాటు.. సామాన్యుడు సొంతింటి కలను నిజం చేసుకునేందుకు వీలుగా కేంద్రం కొత్త పథకాన్ని తీసుకురావాని భావిస్తున్నట్లు చెబుతున్నారు. ఈ పథకంలో గృహ రుణాన్ని కేవలం 6 నుంచి 7 శాతం మాత్రమే ఉంటుందని చెబుతున్నారు.

రూ.50 లక్షల మొత్తాన్ని రుణంగా ఇచ్చేందుకు వీలుగా ఈపథకాన్ని సిద్ధం చేయనున్నట్లు తెలుస్తోంది. రూ.50లక్షల మొత్తాన్ని రుణంగా ఇవ్వటం అంటే.. దేశంలోని ఎగువ మధ్యతరగతి.. మధ్యతరగతి వారికి మేలు చేకూరే ఈ పథకాన్ని వీలైనంత త్వరగా తెర మీదకు తీసుకురావాలన్నఆలోచనలో ప్రభుత్వం ఉందని చెబుతున్నారు. ఈ నిర్ణయం కానీ అధికారికంగా మారితే.. రియల్ ఎస్టేట్ రంగానికి కొత్త ఉత్తేజంగా మారుతుందనటంలో సందేహం లేదు. అయితే.. ఈ అత్యల్ప వడ్డీరేట్లు తొలిసారి ఇంటిని కొనుగోలు చేసే వారికి మాత్రమే వర్తింపచేసేలా చేయాలని కేంద్రం భావిస్తున్నట్లు చెబుతున్నారు. పెద్దనోట్ల రద్దుకారణంగా వచ్చేలాభాన్ని కేంద్రం ఈ రూపంలో ప్రజలకు అందించాలని భావిస్తోంది.

వడ్డీ రేట్లు ఎక్కువగా ఉండటం ద్వారా.. సొంతింటి కలను చాలామంది సాకారం చేసుకోలేని పరిస్థితి. ప్రస్తుతం 9 శాతం వరకూ ఉన్న బ్యాంకు వడ్డీ రేట్లను 6 శాతమో.. 7 శాతానికో కుదించటం ద్వారా.. భారీ ప్రయోజనం చేకూరేలా చేయాలన్న ఆలోచనలో ఉన్నట్లు చెబుతున్నారు. ఈ పథకానికి సంబంధించిన పూర్తి వివరాల్ని 2017-18 వార్షిక బడ్జెట్ లో ప్రకటించే వీలుందన్న మాట వినిపిస్తోంది. ఇదిలా ఉంటే.. నోట్ల రద్దు నేపథ్యంలో బ్యాంకుల్లో భారీగా పెరిగిన నగదు డిపాజిట్ల నేపథ్యంలో డిసెంబరు నెలాఖరులో గృహరుణాల వడ్డీ రేట్లు భారీగా తగ్గిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకునే వీలుందన్న మాట వినిపిస్తోంది. అదే జరిగితే.. ఉందిలే.. మంచికాలం ముందుముందునా అని దేశ ప్రజలు అనుకోవటం ఖాయం.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/