Begin typing your search above and press return to search.

ఏపీకి రైల్వే పనులు అందుకే ఆగిపోయాయట!

By:  Tupaki Desk   |   20 March 2021 7:30 AM GMT
ఏపీకి రైల్వే పనులు అందుకే ఆగిపోయాయట!
X
ఏపీ వాటా ఇవ్వకపోవడం వల్లే 10వేల కోట్ల రైల్వే పనులు ఆగిపోయాయని కేంద్ర రైల్వే మంత్రి పీయూష్ గోయల్ సంచలన ప్రకటన చేశారు. ఏపీ రూ.1636 కోట్లు ఇవ్వనందున రూ.10వేల కోట్ల పనులు ఆగిపోయాయని తెలిపారు.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వైఖరి వల్లే రూ.వేల కోట్ల విలువైన రైల్వే పనులు నిలిచిపోయాయని రైల్వే శాఖ మంత్రి పీయూష్ గోయల్ వెల్లడించారు. రాజ్యసభలో శుక్రవారం వైసీపీ ఎంపీలు విజయసాయిరెడ్డి , పరిమల్ నథ్వానీ, టీడీపీ ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్ అడిగిన ప్రశ్నలకు ఆయన లిఖితపూర్వక సమాధానమిచ్చారు.

కడప-బెంగళూరు లైనులో 50శాతం వాటా భరిస్తామని 2006లో రాష్ట్రప్రభుత్వం హామీ ఇచ్చిందని.. రాష్ట్రం భూసేకరణ చేయకపోవడంతో పనులు ఆగాయని కేంద్రమంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. రాష్ట్రసర్కార్ వల్లే 841 కిలోమీటర్ల మేర 4 లైన్ల పనులు ఆగాయని తెలిపారు. ఏపీ తన వాటా ఇచ్చాక తదుపరి పనులు ప్రారంభమవుతాయని కేంద్రమంత్రి స్పష్టం చేశారు.

విశాఖపట్నం కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్ ఏర్పాటు చేస్తున్నట్లు కేంద్రమంత్రి గోయల్ తెలిపారు. వాల్తేర్ స్థానంలో రాయగడ కేంద్రంగా కొత్త డివిజన్ వస్తుందని.. పాలన, నిర్వహణ అవసరాల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్రమంత్రి పేర్కొన్నారు.

ఏపీలో 64428 కోట్ల రూపాయల విలువైన 5704 కిలోమీటర్ల విస్తీర్ణంలో 32 రైల్వే ప్రాజెక్టులు పూర్తిగా లేదా పాక్షికంగా వివిధ దశల్లో అభివృద్ధి చెందుతున్నాయని రైల్వే మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు.