Begin typing your search above and press return to search.

కేసీఆర్, చంద్రబాబులకు షాకింగ్ న్యూస్

By:  Tupaki Desk   |   19 April 2016 7:08 AM GMT
కేసీఆర్, చంద్రబాబులకు షాకింగ్ న్యూస్
X
ఆంధ్రప్రదేశ్‌ - తెలంగాణ రాష్ట్రాలలో శాసనసభా స్థానాల సంఖ్యను పెంచేందుకు వీలు కల్పించేలా రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టాన్ని సవరించే ప్రతిపాదనను కేంద్ర ప్రభుత్వం ప్రస్తుతానికి అటకెక్కించింది. విభజనానంతరం తెలుగు రాష్ట్రా లలో రాజకీయ సుస్థిరతకు విఘాతం కలుగకుండా చూసే లక్ష్యంతో అసెంబ్లీ సీట్ల సంఖ్యను పెంచాలని రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టం నిర్దేశిస్తున్న విషయం తెలిసిం దే. అయితే, పెరగనున్న శాసనసభా స్థానాల సంఖ్యను అవకాశంగా తీసుకొని రెండు రాష్ట్రాలలో అధికారంలో ఉన్న పార్టీలు - ముఖ్యమంత్రులు ప్రతిపక్ష పార్టీల ఎమ్మెల్యేల ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నారనే ఫిర్యాదులు వెల్లువెత్తడంతో ఈనెల 25 నుండి ప్రారంభం కానున్న మలివిడత పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాలలోనే ఇందుకు అవసరమైన బిల్లును ప్రవేశపెట్టే విషయంపై ప్రభుత్వం పునరాలోచనలో పడినట్లు తెలియ వచ్చింది.

విభజన చట్టంలో ప్రతిపాదించిన విధంగా ఏపీలో శాసనసభాస్థానాల సంఖ్యను ప్రస్తుతమున్న 175 నుండి 225 స్థానాలకు - తెలంగాణ లో 119 నుండి 153కు పెంచేందుకు వీలుగా వెంటనే నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియను ప్రారంభించేందుకు ఎదురవుతున్న చట్టపరమైన అడ్డంకులను అధిగమించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు కోరడంతో రాష్ట్ర విభజన చట్టాన్ని సవరించనున్నట్లు కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి వెంకయ్యనాయుడు ఇంతకుముందు ప్రకటించారు. మలివిడత బడ్జెట్‌ సమావేశాలలోనే కేంద్రం ఈ బిల్లును ప్రతిపాదించి పార్లమెంట్‌ ఆమోదం పొందనున్నట్లు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా వెల్లడించారు. కానీ... ఇప్పుడు సీను మారుతోంది. ఫిరాయింపుల జోరు పెరగడంతో కేంద్రం తన ఆలోచనను మార్చుకున్నట్లు తెలుస్తోంది.

వచ్చే పార్లమెంట్‌ సమావేశాలలో అసెంబ్లీ సీట్ల సంఖ్యను పెంచేందుకు వీలుకల్పించే సవరణ బిల్లును ప్రవేశపెట్టడం లేదట. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఫిరాయింపుల వ్యవహారంపై తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు డాక్టర్ లక్ష్మణ్ కేంద్రానికి ఫిర్యాదు చేశారు. ఆ సందర్భంగా కేంద్రంలోని పెద్దలు ఆయనతో ఈ విషయం చెప్పారట. రాష్ట్ర విభజన చట్టాన్ని అమలు చేయాల్సి ఉన్నప్పటికీ, రెండు రాష్ట్రాలలో ఎమ్మెల్యే స్థానాలు పెంచాల్సిన అవసరమున్నప్పటికీ తెలుగు రాష్ట్రాలలో అధికారంలో ఉన్న పార్టీలు - ముఖ్యమంత్రులు దీనిని తమ రాజకీయ స్వప్రయోజనాల కోసం దుర్వినియోగం చేస్తున్నందున సవరణ బిల్లును ప్రవేశపెట్టే విషయంలో తొందరపడి ఎలాంటి నిర్ణయం తీసుకోవద్దనే తాను కేంద్ర నేతలకు ఆయన సూచించడంతో వారు కూడా అదే అభిప్రాయం వ్యక్తంచేసినట్లు సమాచారం.

ఇప్పుడు బిల్లు ప్రవేశపెడితే కానీ ప్రక్రియ మొదలు కాదు.. అలాంటప్పుడు కేంద్రం దీనికి సుముఖంగా లేనట్లయితే వచ్చే ఎన్నికల నాటికి సీట్ల పెంపు అనుమానమే. దాన్నే నమ్ముకుని జనాన్ని సమీకరిస్తున్న చంద్రబాబు - కేసీఆర్ లకు ఇది షాకింగ్ న్యూసే మరి.