Begin typing your search above and press return to search.

జీఎస్ టీ జేబుల్ని గుల్ల చేస్తుందా?

By:  Tupaki Desk   |   7 Dec 2015 9:45 AM GMT
జీఎస్ టీ జేబుల్ని గుల్ల చేస్తుందా?
X
రోజులు గడుస్తున్న కొద్దీ జీవితం మరింత భారంగా మారే పరిస్థితులు కనిపిస్తన్నాయి. ఆదాయం పెరిగినా.. పెరగకున్నా.. ఖర్చులు మాత్రం విపరీతంగా పెరగటమేకాదు.. భవిష్యత్తు భయం కలిగించేలా మారుతోంది. ప్రభుత్వాలు ఎన్ని వచ్చి పోయినా.. సామాన్యుడి బతుకు చిత్రంలో మార్పు రావటం లేదు కానీ.. వారు చెల్లించే పన్నుల విషయంలో మాత్రం త్వరగా మార్పులు చోటు చేసుకోనున్నాయి.

తాజాగా జరుగుతున్న పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో వస్తుసేవల పన్ను బిల్లు (జీఎస్ టీ) ను ఎట్టి పరిస్థితుల్లో పాస్ చేయాలన్న కృతనిశ్చయంతో ఉన్న మోడీ సర్కారు.. ఇప్పటికే ఆ దిశగా ప్రయత్నాలు షురూ చేయటం తెలిసిందే. దీన్లో భాగంగానే.. కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియాగాంధీ.. మాజీ ప్రదాని మన్మోహన్ సింగ్ తో ప్రధాని నరేంద్ర మోడీ భేటీ కావటం తెలిసిందే. వస్తుసేవల పన్నుల బిల్లు విషయంలో మూడు అభ్యంతరాలు మినహా.. తమకు ఎలాంటి ఇబ్బంది లేదని కాంగ్రెస్ తేల్చి చెప్పింది.

ఈ నేపథ్యంలో ఈ బిల్లు చట్టంగా మారటానికి పెద్ద సమయం లేదని చెప్పాలి. మరి.. ఈ బిల్లు చట్టంగా మారితే సామాన్యుడికి కలిగే నష్టం ఏమిటన్న విషయాన్ని చూస్తే.. సామాన్యుడి మీద మరింత ఆర్థిక భారం కావటం ఖాయమనన మాట వినిపిస్తోంది. టెలిఫోన్ బిల్లులు.. హోటల్ బిల్లులతో పాటు.. మరికొన్ని సేవలు మరింత ఖరీదుగా మారనున్నాయి.

ఇప్పటివకే ఇలాంటి సేవలకు 14.5శాతం (స్వచ్ఛభారత్ కింద వసూలు చేస్తున్న 0.5శాతం సుంకం కలిపితే) పన్ను వసూలు చేస్తున్నారు. ప్రస్తుతం ఉన్న 14.5 పన్నును జీఎస్ టీ బిల్లు చట్టంగా మారితే.. కనిష్ఠంగా 17 శాతం.. గరిష్ఠంగా 18 శాతం వరకూ పన్ను పరిమితిని పెంచొచ్చని చెబుతున్నారు. అదే జరిగితే.. ప్రతి వంద రూపాయిల ఖర్చుకు ఇప్పటివరకూ వసూలు చేస్తున్న రూ.14.5 నుంచి రూ.18 పెరిగే అవకాశం ఉంది. వందకు రూ.3.50 అని సింపుల్ గా కనిపించినప్పటికీ.. మొత్తంగా చూసినప్పుడు ఈ భారం భారీగా ఉండటం ఖాయమంటున్నారు. మోడీ వస్తే మంచి రోజులు అన్నారు. మంచి రోజుల సంగతేమో కానీ.. మోత పుట్టే పన్నులు మాత్రం పక్కా అవుతున్నాయే.