Begin typing your search above and press return to search.

అపద్భాందవులకు ఇక.. ఎలాంటి సమస్యలు ఉండవు

By:  Tupaki Desk   |   28 Jun 2015 3:58 AM GMT
అపద్భాందవులకు ఇక.. ఎలాంటి సమస్యలు ఉండవు
X
రోడ్డు మీద యాక్సిడెంట్‌ జరిగితే చూసీచూడనట్లుగా వెళ్లే వాళ్లు వేలాది మంది ఉంటే.. తమకు సంబంధం లేకున్నా మానవత్వంతో స్పందించి.. వారికి అండగా నిలిచి.. వారిని ఆసుపత్రికి తరలించేందుకు ఎంతగానో తపిస్తారు.

దురదృష్టకరమైన విషయం ఏమిటంటే.. తోటి ప్రాణం పోతున్నా పట్టించుకోకుండా వెళ్లే వారు సేఫ్‌గా ఎలాంటి చిక్కులు లేకుండా ఉంటే.. ఆపత్‌కాలంలో అండగా నిలిచిన అపద్భాందవులు మాత్రం పోలీసులు.. కోర్టు చిక్కుల్లో చిక్కుకుంటారు. ఇవన్నీ లెక్క తేలేసరికి.. నెత్తి మీద బబ్బలెక్కి.. తోటి మనిషికి సాయం చేస్తే ఇన్ని చిక్కులా అని వాపోయేవారు చాలామందే కనిపిస్తారు.

ఇలాంటి వారి విషయం కేంద్రం సరికొత్త నిర్ణయం తీసుకుంది. ఆపత్‌కాలంలో సాయం చేసి.. ప్రాణాలు కాపాడే అపద్భాందవుల విషయం మరింత మానవత్వంతో వ్యవహరించాలని.. వారికి ఎలాంటి సమస్యలు రాకుండా చూడాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా సరికొత్త ఆదేశాల్ని జారీ చేస్తూ రాష్ట్రాలకు ప్రత్యేకంగా లేఖ రాసింది.

దీని ప్రకారం.. రోడ్డు ప్రమాదాలు సంభవించినప్పుడు సాయం చేసి.. అండగా నిలిచి.. ఆసుపత్రులకు చేర్చిన వారిని దర్యాప్తు.. వివరాల సేకరణ అంటూ వారిని ఏ మాత్రం ఇబ్బంది పెట్టకూడదని.. ఈ కేసు దర్యాప్తు మొత్తంలో ఒక్కసారి మాత్రమే విచారించాలని తేల్చారు. ప్రమాదాలు జరిగినప్పుడు దగ్గర ఉండి ఆదుకున్న వారు కానీ.. ప్రత్యక్ష సాక్ష్యులను కానీ నిబంధనల పేరుతో ఇబ్బంది పెట్టద్దంటూ ఆదేశాలు జారీ చేశారు.

ప్రమాదంలో గాయపడిన వారిని ఆసుపత్రుల్లో చేర్చిన వారిని రిజిస్ట్రేషన్‌ ఫీజులు చెల్లించాలని ఆసుపత్రులు కోరకూడదని చెప్పటమే కాదు.. ఇలా సాయం చేసిన వారికి అవార్డులు రివార్డులతో సత్కరించాలే తప్పించి..వారిని ఏమాత్రం ఇబ్బంది పెట్టద్దని పేర్కొంది. ఎన్నాళ్లకు నలుగురికి ఉపయోగపడే నిర్ణయాన్ని కేంద్రం తీసుకుందో..?