Begin typing your search above and press return to search.

‘‘కాపీ’’ మీద కేంద్రం రియాక్ట్ అయ్యింది

By:  Tupaki Desk   |   7 July 2016 4:44 AM GMT
‘‘కాపీ’’ మీద కేంద్రం రియాక్ట్ అయ్యింది
X
‘‘ఈజ్ ఆప్ డూయింగ్ బిజినెస్’’ ఇష్యూలో తమ పోర్టల్ లో ఉంచిన అంశాల్నికాపీ కొట్టారంటూ ఏపీ సర్కారు మీద విమర్శలు చేయటమే కాదు.. కేసు నమోదు చేసిన తెలంగాణ సర్కారు ఈ ఇష్యూను కేంద్రం దృష్టికి తీసుకెళ్లిన విషయం తెలిసిందే. ఈ అంశంపై తాజాగా కేంద్రం రియాక్ట్ అయ్యింది. జూన్ 30 నాటికి నమోదైన పూర్తి సమాచారంతో సమగ్ర నివేదికను తమకు పంపాలంటూ తెలంగాణ ప్రభుత్వానికి కేంద్రం కోరింది. ర్యాంకింగ్ కోసం తమ విధానాన్ని ఏపీ సర్కారు కాపీ చేసిందన్న తెలంగాణ రాష్ట్ర వాదనపై కేంద్రం స్పందించి.. పూర్తి వివరాలు పంపాలంటూ తెలంగాణ పరిశ్రమల శాఖ కార్యదర్శికి లేఖ రాసినట్లుగా చెబుతున్నారు.

ఈ నేపథ్యంలో కేంద్రం కోరినట్లుగా పూర్తి సమాచారాన్ని తెలంగాణ రాష్ట్ర సర్కారు సిద్ధం చేశారు. ఉన్నతాధికారులంతా కలిసి ఏపీ చేసిన కాపీపై పక్కా నివేదికను సిద్ధం చేసినట్లుగా చెబుతున్నారు. దీన్ని ఈ రోజే (గురువారం) కేంద్రానికి పంపనున్నట్లు చెబుతున్నారు. అంతేకాదు.. ఈ అంశంపై తమ వాదనల్ని బలంగా వినిపించేందుకు ఉన్నతాధికారుల బృందాన్ని ఢిల్లీకి పంపాలన్న నిర్ణయాన్ని మంత్రి కేటీఆర్ తీసుకున్నట్లు చెబుతున్నారు. ర్యాంకు కోసం ఏపీ సర్కారు తెలంగాణ విధానాన్నికాపీ కొట్టటం దుర్మార్గంగా టీఆర్ ఎస్ నేతలు మాటల దాడి మొదలెట్టారు.

ఇదిలా ఉంటే.. ఏపీ పరిశ్రమల విధానాలు.. పెట్టుబడులను ఆకర్షించేందుకు వెబ్ సైట్ లో ఉన్న అంశాల్ని సమకూర్చిన సర్వీసు ప్రొవైడర్ వివరాల్ని తమకు ఇవ్వాలంటూ ఏపీ పరిశ్రమల శాఖ కమిషనర్ కార్తికేయ మిశ్రాకు హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు లేఖ రాశారు. తెలంగాణ పరిశ్రమల విధానాన్ని యథాతథంగా కాపీ చేశారంటూ తెలంగాణ మంత్రి కేటీఆర్ ఇచ్చిన ఫిర్యాదు నేపథ్యంలో ఈ పరిణామం చోటు చేసుకుంది. కాగా.. తెలంగాణ మంత్రి కేటీఆర్ ఆరోపించినట్లుగా తాము ఎలాంటి సమాచారాన్ని కాపీ కొట్టలేదని ఏపీ ప్రభుత్వ సలహాదారు పరకాల ప్రభాకర్ స్పష్టం చేయటం తెలిసిందే.