Begin typing your search above and press return to search.

పోల‌వ‌రంలో ఆడేసుకుంటున్నారుగా.. కేంద్రం మ‌రో మెలిక‌..?

By:  Tupaki Desk   |   21 March 2022 4:30 AM GMT
పోల‌వ‌రంలో ఆడేసుకుంటున్నారుగా.. కేంద్రం మ‌రో మెలిక‌..?
X
పోల‌వ‌రం ప్రాజెక్టు. ఇది ఏపీ ప్ర‌జ‌ల‌కు జీవ‌నాడి. బ‌హుళార్థ సాధ‌క ప్రాజెక్టు. ఇదే ఏనాయ‌కుడైనా.. ఏ పార్టీ అయినా.. ఏ ప్ర‌భుత్వ మైనా చెప్పే మాట‌. కానీ.. నిర్మాణం విష‌యానికి వ‌స్తే.. మాత్రం ఏ పార్టీకి ఆ పార్టీ.. ఏ ప్ర‌భుత్వానికి ఆ ప్ర‌భుత్వం ఈ ప్రాజెక్టుతో ఫుట్ బాల్ ఆడేసుకుంటున్నాయి. గ‌తంలో చంద్ర‌బాబు, ఇప్పుడు.. జ‌గ‌న్‌.. ఇంత‌కుముందు.. ఇప్పుడు.. మోడీ ప్ర‌భుత్వం ఈ ప్రాజెక్టు విష‌యంలో చేస్తున్న యాగీ.. చూపుతున్న నిర్లిప్త‌త‌.. ప్ర‌జ‌ల‌కు శాపంగా మారింది. ముఖ్యంగా కేంద్రంలో బీజేపీ పాల‌కులు అనుస‌రిస్తున్న తీరు.. ప్రాజెక్టుకు శాపంగా మారింది.

గ‌తంలో చంద్ర‌బాబు ప్ర‌భుత్వం ఉన్న‌ప్పుడు.. 2018, 2019 నాటికి పూర్తి చేస్తామ‌ని.. ఎప్ప‌టిక‌ప్పుడు ప్ర‌య‌త్నాలు చేసింది. ఇక‌, కేంద్రం కూడా ఎప్ప‌టిక‌ప్పుడు గ‌డువు విధిస్తూనే ఉంది. అంతేకాదు.. విబ‌జ‌న చ‌ట్టంలో ఈ ప్రాజెక్టును కేంద్ర ప‌రిధిలో చేర్చారు కాబ‌ట్టి.. త‌మ‌కు ఇది ప్రాణ ప్ర‌ద‌మ‌ని.. దీనిని నిర్మించ‌డం.. త‌మ‌కు ప్ర‌తిష్టాత్మ‌క‌మ‌ని.. క‌బుర్లు చెప్ప‌డంలో కేంద్రంలోని మంత్రు ల‌ను మించిన వారు లేర‌నేలా .. ఉత్త‌ర కుమార ప్ర‌గ‌ల్భాలు సైతం ప‌లికారు. ఇక‌, రాష్ట్రంలో గ‌త టీడీపీ, ప్ర‌స్తుత వైసీపీ లు కూడా చేయ‌ని రాజ‌కీయం లేదు. ఇక‌, రాష్ట్ర బీజేపీ నాయ‌కులు అయితే.. మేం అధికారంలోకి రాగానే.. అంటూ మొద‌లు పెడుతున్నారు. వాళ్లు అధికారంలోకి వ‌చ్చేది లేదు.. పోల‌వ‌రం అయ్యేది లేద‌న్న‌ట్టుగా ఉంది ప‌రిస్థితి!

ఏదేమైనా పోల‌వ‌రం చుట్టూ అల్లుకున్న అనేక వివాదాలు.. నిర్ల‌క్ష్యాలు.. మ‌ళ్లీ మ‌ళ్లీ మొద‌టికి వ‌స్తున్నాయి. తాజాగా పోల‌వ‌రం ప్రాజెక్టును ఇంకేముంది.. త్వ‌ర‌లోనే పూర్తిచేసేస్తా.. అని సెల‌విచ్చిన కేంద్రం.,. మ‌రోసారి మెలిక‌లు పెట్టేసింది. ఇటీవ‌లే కేంద్ర జ‌ల‌శ‌క్తిమంత్రి గ‌జేంద్ర‌సింగ్ షెకావ‌త్ స్వ‌యంగా పోల‌వ‌రానికి వ‌చ్చారు. ఇక్క‌డ ప‌రిశీల‌న చేశారు. పున‌రావాసంపై ఆనందం వ్య‌క్తం చేశారు. దీనిని పూర్తి చేసే బాధ్య‌త నాది!_ అన్నారు. కానీ, తీరా చూస్తే.. ఇప్పుడు స‌రికొత్త మెలిక పెట్టి.. మౌనం పాటిస్తున్నారు. ఫ‌లితంగా అస‌లు పోల‌వ‌రం ముందుకు సాగుతుందా? లేదా? అనే సందేహాలు స‌గ‌టుఏపీ పౌరుడికి య‌థ‌త‌థంగా అలానే మిగిలిపోయాయి.

తాజా విష‌యంలోకి వెళ్తే.. 2004లో దివంగ‌త వైఎస్ హ‌యాంలో ప్రారంభించిన ఈ ప్రాజెక్టు ప‌నుల‌కు సంబంధించి అప్ప‌టి నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు అంటే.. తొలిద‌శ వ‌ర‌కు ఎంత ఖ‌ర్చు చేశారు? ఏం చేశారు? వంటి వివ‌రాల‌ను ఇవ్వాల‌ని… ఏపీ ప్ర‌భుత్వాన్ని కేంద్రం ఆదేశించింది. అంటే.. ప్రాజెక్టు తొలిదశలో +41.15 మీటర్ల స్థాయిలో నీళ్లు నిల్వచేసి కుడి, ఎడమ కాలువలకు, ఆయకట్టు కు ఇవ్వాలంటే ఆ స్థాయి నిర్మాణానికి, పునరావాసానికి ఎంత ఖర్చవుతుందని మళ్లీ లెక్కలు అడుగుతోంది. అక్కడివరకు నీళ్లు ఇస్తే ఏ స్థాయి ప్రయోజనాలు కలుగుతాయో చెప్పాల‌ని కేంద్ర జలసంఘం గతంలోనే ఒక సమావేశం ఏర్పాటు చేసి వివరాలు కోరింది.

పోలవరం డ్యాంను +45.72 మీటర్ల స్థాయిలో నీటిని నిల్వ చేసేందుకు అనుగుణంగా ఇప్పటికే పోలవరం ప్రాజెక్టు అథారిటీ, కేంద్ర జలసంఘం లెక్కలు కట్టించాయి. 2013-14 లెక్కల్లో కేంద్ర జలసంఘం అంచనాల ప్రకారం ఎంత? రివైజ్డు కాస్ట్‌ కమిటీ ప్రకారం ఎంతో కూడా లెక్క కట్టించారు. 2017-18 ధరల ప్రకారం ఆర్‌సీసీ రూ.47,725.74 కోట్లకు సిఫార్సు చేసింది. ఇది జరిగి రెండేళ్లు దాటింది. ఈ మొత్తానికి కేంద్రం పెట్టుబడి అనుమతి ఇచ్చి పనులను తొలిదశ, రెండో దశగా విడగొట్టి ఆ మేరకు నిధులు విడుదల చేస్తే సరిపోయేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

అయితే.. ఇవ‌న్నీ ప‌క్క‌న పెట్టి.. ఇప్పుడు ప్రత్యేకంగా తొలిదశ పేరుతో మళ్లీ లెక్కలు కట్టాలని కోరుతోంది. 2014లో పోలవరాన్ని జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించినప్పటి నుంచి ఇప్పటివరకూ ఎప్పటికప్పుడు లెక్కలు కడుతున్నారు. అయిన‌ప్ప‌టికీ కేంద్రం దీన్ని కొలిక్కి తెచ్చి పెట్టుబడి అనుమతి ఇచ్చేందుకు అడుగు ముందుకు వేయలేదు.

ఇప్పటికే ప్రాజెక్టులో అన్ని విభాగాలకు సంబంధించిన ఖర్చుల లెక్కలన్నీ పక్కాగా ఉన్నాయి. పైగా పునరావాసంలో +41.15 మీటర్ల స్థాయికి నీళ్లు నిలిపితే ఎంత? ఆ తర్వాత +45.72 మీటర్ల స్థాయికి నీరు నిలిపితే ఎంత ఖర్చవుతుందో కూడా లెక్కలేశారు. ఆర్‌సీసీ ఆమోదించిన 2017-18 లెక్కల ఖర్చుకు పెట్టుబడి అనుమతి ఇచ్చి, నిధులు విడుదల చేస్తూ తొలిదశ, మలి దశగా విడగొట్టే అవకాశం ఉంది. దీనివ‌ల్ల ప్రాజెక్టు ప‌రుగులు పెడుతుందా? అనేది సందేహం. ఏదేమైనా.. పార్టీలు ఏవైనా.. ప్రాజెక్టు విష‌యంలో చేస్తున్న తాత్సారం.. ఏపీ ప్ర‌జ‌ల‌కే శాపంగా మారింద‌ని అంటున్నారు జ‌ల‌వ‌న‌రుల నిపుణులు.