Begin typing your search above and press return to search.

ఈ తెలివి ముందేమైంది: కొన్ని అశ్లీల సైట్ల‌కు ఓకే

By:  Tupaki Desk   |   6 Aug 2015 9:41 AM GMT
ఈ తెలివి ముందేమైంది: కొన్ని అశ్లీల సైట్ల‌కు ఓకే
X
కీల‌క నిర్ణ‌యాలు తీసుకునేట‌ప్పుడు ముందు వెనుక చూసుకోవ‌టం.. ఒక‌టికి ప‌దిసార్లు ఆలోచించిన త‌ర్వాత విధాన‌ప‌ర‌మైన నిర్ణ‌యాలు తీసుకోవ‌టం ఉత్త‌మం. గ‌తంలో ఏదైనా నిర్ణ‌యం తీసుకుంటే భావ వ్య‌క్తీక‌ర‌ణ ప‌రిమితంగా ఉండేది. కానీ.. మారిన కాలంతో.. సోష‌ల్ మీడియా బ‌లంగా ఉన్న ఈ రోజుల్లో విష‌యం ఏదైనా కానీ.. వెంట‌నే చ‌ర్చ జ‌ర‌గ‌టం.. తేడా వ‌స్తే ర‌చ్చ ర‌చ్చ‌గా మారిపోవ‌టం తెలిసిందే.

అశ్లీల వెబ్ సైట్ల మీద చ‌ర్య‌లు తీసుకునే విష‌యంలో ఎవ‌రికి తెలీకుండా.. బ‌య‌ట‌కు చెప్ప‌కుండా కేంద్రం నిర్ణయం తీసుకోవ‌టం.. దీనిపై ర‌చ్చ ర‌చ్చ జ‌ర‌గ‌టం తెలిసిందే. ప్ర‌జాస్వామ్య దేశంలో భావ వ్య‌క్తీక‌ర‌ణ‌కు.. న‌చ్చింది చూసేందుకు అవ‌కాశం ఉండ‌టంతో పాటు.. గ‌తంలో అశ్లీల వెబ్ సైట్లను ప‌రిమితుల‌తో అనుమ‌తించొచ్చంటూ సుప్రీం సైతం నిర్ణ‌యం వెల్ల‌డించిన త‌ర్వాత.. కేంద్రం తీసుకున్న నిర్ణ‌యంపై ప‌లు విమ‌ర్శ‌లు చెల‌రేగాయి.

ఇప్ప‌టివ‌ర‌కూ 857 అశ్లీల వెబ్ సైట్ల‌ పై కొర‌డా విద‌ల్చ‌టం.. వాటిల్లో కొన్ని హాస్య వెబ్ సైట్లు ఉండ‌టం క‌ల‌క‌లం రేపింది. ఇవ‌న్నీ ఒక ఎత్తు అయితే.. కేంద్రం తీసుకున్న నిర్ణ‌యంపై ప‌లువురు ప్ర‌ముఖులు.. సెల‌బ్రిటీలు సైతం వ్యంగ‌స్త్రాలు సంధించ‌టంతో.. సోష‌ల్ మీడియాలో మోడీ స‌ర్కారుపై చుర‌క‌ల జోరు పెరిగింది.

తాము తీసుకున్న నిర్ణ‌యంతో రేగిన క‌ల‌క‌లాన్ని స‌ర్దేందుకు కేంద్రం రంగంలోకి దిగింది. నిషేధం వేటు వేసిన 857లో కొన్నింటిపై నిషేధాన్ని తీసేస్తూ నిర్ణ‌యం తీసుకుంది. పిల్ల‌ల అశ్లీల వెబ్ సైట్ల మీద ఆంక్ష‌లు విధిస్తూ నిర్ణ‌యం తీసుకున్నారు. చేతులు కాలాక ఆకులు ప‌ట్టుకున్న చందంగా నిషేధంపై అత్యుత్సాహం ప్ర‌ద‌ర్శించి.. వ్య‌తిరేక‌త వెల్లువ‌లా మార‌టంతో వెన‌క్కి త‌గ్గిన తీరు చూసిన‌ప్పుడు.. ఇదే తెలివి ముందే ఉంటే ఇంత జ‌రిగేది కాద‌న్న అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది.