Begin typing your search above and press return to search.

రెండున్నరేళ్ల తర్వాత కూడా అదే మాటా..?

By:  Tupaki Desk   |   4 Feb 2017 4:44 AM GMT
రెండున్నరేళ్ల తర్వాత కూడా అదే మాటా..?
X
మోడీ మంత్రివర్గంలో కీ రోల్ ప్లే చేస్తున్నట్లుగా చెప్పుకునే వెంకయ్య నాయకుడికి ఒక స్టాండర్డ్ డైలాగ్ ఉంటుంది. ఏపీకి వచ్చిన ప్రతిసారీ ఆయన నోటి నుంచి ఒకే మాట అదే పనిగా వస్తూ ఉంటుంది. కేంద్రానికి ఏపీ చాలా స్పెషల్ అని.. ఆంధ్రప్రదేశ్ ను ప్రత్యేక దృష్టితో చూస్తున్నట్లుగా చెబుతుంటారు. ఏపీ అభివృద్ధి కోసం ఎంతో చేస్తున్నట్లుగా చెప్పినప్పటికీ.. అవన్నీ ఎంత నిజమన్నది తాజాగా ఎంపీ విజయసాయిరెడ్డి అడిగిన ప్రశ్నకు కేంద్రం చెప్పిన సమాధానం చూస్తేనే అర్థమయ్యే పరిస్థితి.

విభజన సమయంలో ఏపీకి ఇస్తామన్న రైల్వే జోన్ గురించి ఆయన కేంద్రాన్ని ప్రశ్నించారు. దీనికి రాతపూర్వక సమాధానం ఇచ్చిన కేంద్రమంత్రి విశాఖకు రైల్వే జోన్ ఏర్పాటు ప్రతిపాదన అంశం ఏపీ విభజన చట్టంలో ఉందని పేర్కొంది. చట్టంలోని షెడ్యూల్ 18 ఐటెం నెంబరు 3 ప్రకారం.. ఆంధ్రప్రదేశ్ లో కొత్త రైల్వేజోన్ ఏర్పాటు సాధ్యాసాధ్యాల్ని పరిశీలిస్తున్నట్లు వెల్లడిచింది.

కేంద్రంలో మోడీ సర్కారు ఏర్పాటై..రెండున్నరేళ్లు పూర్తయింది. నేటికీ.. విభజన హామీల్లో కీలకమైన విశాఖ రైల్వే డివిజన్ అంశాన్నితేల్చలేదు. ఈ నిర్ణయంపై పలు రాష్ట్రాలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్ననేపథ్యంలో.. ఆయా రాష్ట్రాల స్టేక్ హోల్డర్లు.. ఎంపీలు.. రాష్ట్రప్రభుత్వాలతో కమిటీ చర్చ జరుగుతున్నట్లుగా కేంద్ర రైల్వే శాఖ సహాయమంత్రి వెల్లడించారు.

గమనించాల్సిన అంశం ఏమిటంటే.. రైల్వే జోన్ మీద మంత్రి ఇచ్చిన సమాధానంలో సాధ్యాసాధ్యాల్ని పరిశీలిస్తున్నట్లు చెప్పారే కానీ.. జోన్ ఏర్పాటుపై స్పష్టమైన హామీని ఇవ్వకపోవటం మర్చిపోకూడదు. రెండున్నరేళ్లుగా జోన్ విషయంపై చర్చలు జరుగుతున్నట్లుగా చెప్పారే కానీ.. ఆ దిశగా ఎలాంటి ముందడుగు పడలేదు. ఈ లెక్కన విశాఖ రైల్వేజోన్ సాకారమయ్యే ఛాన్స్ ఉందా? అన్నది ఇప్పుడు పెద్ద ప్రశ్నగా మారిందని చెప్పక తప్పదు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/