Begin typing your search above and press return to search.

తమిళులంటే అంత అలుసా.. కేంద్రం తీరుపై ఆగ్రహం!!

By:  Tupaki Desk   |   5 Sep 2020 3:00 PM GMT
తమిళులంటే అంత అలుసా.. కేంద్రం తీరుపై ఆగ్రహం!!
X
కేంద్ర ప్రభుత్వ అధికారులపై తమిళనాడు ప్రజలు, అధికారులు తీవ్ర ఆగ్రహంగా ఉన్నారట. ఇటీవల కేంద్రప్రభుత్వ అధికారులు వ్యవహరిస్తున్న తీరును వారు తీవ్రంగా తప్పుబడుతున్నారట. ఇటీవల తమిళనాడుకు చెందిన ‘కావేరి కమిటీ’ కర్ణాటకు విడుదల చేసిన నీటి పరిణామం గురించి వివరాలు తెలియజేయాలంటూ కేంద్ర జలసంఘానికి సమాచార హక్కు చట్టం ద్వారా దరఖాస్తు చేసుకున్నది. కాగా కేంద్ర జలసంఘం కావేరి కమిటీలో ఇంగ్లీష్ ​లో కాకుండా హిందీలో సమాచారాన్ని పంపారు. దీంతో కేంద్రజలసంఘం తీరుపై తమిళ నేషనలిస్ట్ పార్టీ నేత, కావేరీ కమిటీ కోఆర్డినేటర్ మణియారసన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తమిళనాడులో హిందీ అధికారిక భాష కాదని, కేవలం ఆంగ్లం, తమిళం మాత్రమే ఇక్కడి ప్రజలు మాట్లాడుతారని ఆయన పేర్కొన్నారు. తమిళ ప్రజలను అవమానించేందుకు కేంద్రజలసంఘం ఈ విధంగా వ్యవహరించిందని మండిపడ్డారు. హిందీలో ప్రత్యుత్తరం పంపడం రాజ్యాంగ విరుద్ధమని పేర్కొన్నారు. తమిళ ప్రజల హక్కులను కేంద్రప్రభుత్వం కాలరాస్తున్నదని.. తమపై బలవంతంగా హిందీని రుద్దాలని యత్నిస్తున్నదని.. కేంద్ర నిర్ణయాన్ని తమిళ ప్రజలు ఎప్పటికీ స్వాగతించబోరని స్పష్టం చేశారు. తగిన సమయంలో తమిళ ప్రజలు కేంద్రానికి బుద్ధి చెబుతారన్నారు.

ఇటీవల కేంద్ర ఆయుశ్ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో మూడు రోజుల పాటు వెబినార్ శిక్షణా శిబిరం సాగింది. ఈ సదస్సులోనూ తమిళ వైద్యులకు తీవ్ర అవమానం జరిగింది. వెబ్​నార్​కు దేశవ్యాప్తంగా 350 మంది హాజరుకాగా.. తమిళనాడు నుంచి 37 మంది వైద్యులు పాల్గొన్నారు. వీరంతా ఇక్కడ శిక్షణ తీసుకొని.. తమ జిల్లాల్లోని ఆయుశ్​ కేంద్రాల్లో నియమితులైన ఉద్యోగులకు శిక్షణ ఇవ్వాలి. అయితే ఈ శిక్షణా కార్యక్రమాల్లో అందరూ హిందీలోనే ప్రసంగించారు. దీంతో తమిళ వైద్యులకు ఏమీ అర్థం కాక తలలు పట్టుకున్నారు. చివరిరోజు కూడా ఆయుశ్​ విభాగానికి చెందిన కార్యదర్శి రాజేశ్​ కొటేచా హిందీలో మాట్లాడారు. దీంతో కొందరు తమిళ వైద్యులు తమకు హిందీ అర్థం కావడం లేదని చెప్పారు. దీంతో రాజేశ్​ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘నాకు ఇంగ్లిష్​ రాదు. నేను హిందీలోనే ప్రసంగిస్తాను. మీకు అర్థం అయితే వినండి లేదంటే వెళ్లిపోండి’ అంటూ ఆగ్రహంగా మాట్లాడారు. ఈ ఘటనపై పలు తమిళ సంఘాలు మండిపడ్డాయి.