Begin typing your search above and press return to search.

విశాఖ ఉక్కు మీద సమాచారం అడిగితే షాకిచ్చేలా కేంద్రం ఆన్సర్

By:  Tupaki Desk   |   1 May 2021 12:30 PM GMT
విశాఖ ఉక్కు మీద సమాచారం అడిగితే షాకిచ్చేలా కేంద్రం ఆన్సర్
X
తమకు నచ్చని విషయాలకు సంబంధించి సమాధానం చెప్పేందుకు ప్రభుత్వాలు అస్సలు ఇష్టపడవు. ఇదేం మొదలు కాదు చివరా కాదు. కానీ.. మోడీ సర్కారు వ్యవహరిస్తున్న తీరు చూసినప్పుడు మాత్రమ ముక్కున వేలేసుకోవాల్సిందే. తమకు నచ్చని విషయాల పట్ల ఎంత కటువుగా ఉంటారన్నది కొద్దికాలంగా చూస్తున్నదే. తాజాగా విశాఖ ఉక్కు కర్మాగారానికి సంబంధించిన సమాచారాన్ని సమాచార హక్కు చట్టం కింద అడిగితే.. అందుకు కేంద్రంలోని మోడీ సర్కారు ఇచ్చిన సమాధానం వింటే అవాక్కు అవ్వాల్సిందే.

విశాఖ ఉక్కు ప్రజల ఆస్తి.. దీన్నెవరూ కాదనలేరు. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వమే కేంద్రంలో అధికారంలో ఉంది. అంటే.. ప్రజల ఆస్తికి సంబంధించిన వివరాల్ని ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాన్ని అడిగితే.. ఈ వివరాల్ని తాము ఇవ్వలేదని చెప్పటంలో అర్థమేమిటి? ఓపక్క విశాఖ ఉక్కు సంస్థను ప్రైవేటు వారికి అమ్మకానికి పెట్టినప్పుడు.. కొనే సంస్థకు సమాచారం ఇస్తారు కానీ.. ఆ సంస్థలో అసలేం జరుగుతుందన్న వివరాల్ని మాత్రం ప్రజలకు చెప్పరా? అన్నది అసలు ప్రశ్న.

ప్రజల ఆస్తిని అమ్మే వేళ.. ఆ ప్రక్రియకు సంబంధించిన వివరాల్ని ఎప్పటికప్పుడు ప్రజలకు తెలిసేలా చేయాల్సిన అవసరం ఉంది. అందుకు భిన్నంగా మోడీ సర్కారు వ్యవహరిస్తున్న తీరు చూస్తే.. ఇంత గుట్టు ఎందుకు? అన్న సందేహం రాక మానదు. విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణకు సంబంధించి అసలేం జరుగుతుందన్న విషయాల్ని వెల్లడించాలంటూ గుంటూరుకు చెందిన ఆర్టీఐ కార్యకర్త సాంబశివరావు సమాచార హక్కు చట్టం కింద అప్లికేషన్ పెట్టారు. దీనికి కేంద్రం స్పందించింది.

తాము సమాచారం ఇవ్వలేదని చెప్పటమే కాదు.. విశాఖ ఉక్కు సమాచార చట్టం కిందకు రాదంటూ కొత్త వాదనను వినిపించటం విశేషం. ప్రజల ఆస్తికి సంబంధించిన వివరాలు ప్రజలకు చెప్పటానికి ఉద్దేశించిన చట్టం పరిధిలోకి రావని చెప్పటం ఏమిటన్నది అసలు ప్రశ్న. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ విషయంలో కేంద్రం -రాష్ట్రాల మధ్య నడిచిన ఉత్తర ప్రత్యుత్తరాలు ఏమిటి? ఈ పెట్టుబడుల ఉపసంహకరణపై రాష్ట్ర ప్రభుత్వ స్పందన ఏమిటి? విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ ఎంతవరకు వచ్చింది? అసలేం జరుగుతుంది? అన్న ప్రశ్నలకు సమాధానం కోరితే.. సింపుల్ గా.. విశాఖ ఉక్కు సమాచార హక్కు చట్టం కిందకు రాదని తేల్చేయటం చూస్తే.. ఇలాంటివి మోడీ సర్కారుకు మాత్రమే సాధ్యమన్న భావన కలుగక మానదు.