Begin typing your search above and press return to search.

ఉద్యోగులపై ‘టీ’ సర్కారుకు కేంద్రం షాక్

By:  Tupaki Desk   |   25 July 2015 5:18 AM GMT
ఉద్యోగులపై ‘టీ’ సర్కారుకు కేంద్రం షాక్
X
తెలంగాణ రాష్ట్రంలో పని చేస్తున్న ఏపీ స్థానికత ఉందన్న మాటతో వందలాది విద్యుత్తు ఉద్యోగులను తెలంగాణ సర్కారు రిలీవ్ చేస్తూ నిర్ణయం తీసుకోవటం తెలిసిందే. దీనిపై పలు మార్గాల్లో పోరాటం చేస్తున్న విద్యుత్తు ఉద్యోగులకు ఊరట కలిగిస్తూ.. కేంద్ర హోం శాఖ తాజాగా ఆదేశాలు జారీ చేసింది. దీనికి సంబంధించిన లేఖ తాజాగా ఇరు రాష్ట్రాల సీఎస్ లకు అందించింది.

విద్యుత్తు సంస్థల్లో పని చేస్తున్న ఉద్యోగులకు సంబంధించి రాష్ట్ర విభజనకు ముందు.. అంటే 2014 జూన్ ఒకటి నాటికి ఎలాంటి పరిస్థితి ఉందో.. అదే విధానాన్ని అనుసరించాలని పేర్కొంది. ఈ విషయంలో రెండు తెలుగు రాష్ట్రాలు ఏకపక్ష నిర్ణయాలు ఏమీ తీసుకోవద్దని ఆదేశాలు జారీ చేసింది.

విభజన అనంతరం రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాల మధ్య పంచాయితీలు ఎన్ని ఉన్నా.. ఇప్పటివరకూ కేంద్ర హోం శాఖ ఇంత విస్పష్టంగా ఆదేశాలు జారీ చేసిన ఉదంతం లేదు. వందలాది విద్యుత్తు ఉద్యోగుల్ని తెలంగాణ ప్రభుత్వం రిలీవ్ చేయటం.. ఏపీ సర్కారుకు వారిని విధుల్లోకి తీసుకోవటానికి నిరాకరించటం తెలిసిందే. ప్రస్తుతం ఈ వ్యవహారం హైకోర్టులో ఉంది.

తాజాగా వెలువడిన కేంద్ర మార్గదర్శకాల నేపథ్యంలో.. హైకోర్టు కూడా ఈ వ్యవహారంపై తన తీర్పును ఇచ్చేస్తే అవకాశం ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. మరోవైపు.. ఈ వ్యవహారంపై తెలంగాణ సర్కారు స్పందన ఏమిటన్నది ప్రశ్నగా మారింది. ఎందుకంటే.. తాజాగా కేంద్రం నుంచి వచ్చిన ఆదేశాల నేపథ్యంలో.. ట్రాన్స్ కో జెన్ కో సీఎండీ మాట్లాడుతూ.. ఈ వ్యవహారం హైకోర్టులో ఉన్నందున తానేమీ స్పందించలేనని చెప్పుకొచ్చారు. విద్యుత్తు ఉద్యోగుల విషయంలో తెలంగాణ సర్కారు అనుసరించిన వైఖరిపై నిరసనలు వ్యక్తమవుతున్నాయి. అయినప్పటికీ.. తెలంగాణ సర్కారు తన మొండి పట్టుదలను వీడటం లేదని చెబుతున్నారు. మరి.. తాజా పరిణామాల్లో టీ సర్కారు స్పందన ఎలా ఉంటుందో..?