Begin typing your search above and press return to search.

రైల్వేజోన్ ఒక్కటే నికరం... తతిమ్మా దైవాధీనం!

By:  Tupaki Desk   |   10 Feb 2018 5:50 AM GMT
రైల్వేజోన్ ఒక్కటే నికరం... తతిమ్మా దైవాధీనం!
X
విభజన చట్టం అంశాలకు సంబంధించి కేంద్రం ప్రభుత్వం విపరీతంగా కసరత్తు చేసేస్తున్నట్లుగా.. తొందరలోనే వీటికి సంబంధించి ప్రకటన కూడా వచ్చేయబోతున్నట్లుగా ఇప్పుడు కొత్త ప్రచారం మొదలైంది. ఇన్ని రోజులు తెలుగు ఎంపీలందరూ ఒక్కుమ్మడిగా ఆందోళనలు చేస్తోంటే.. ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ మొత్తం మూడుసార్ల పార్లమెంటులో ఆ అంశంపై ప్రసంగాలు చేశారు. మూడుసార్లు కూడా ఏపీకి నెరవేర్చవలసిన కేంద్ర బాధ్యత గురించి కనీసమాత్రం గా కూడా స్పష్టత లేకుండా ఆయన చాలా లౌక్యంగా వ్యవహారాలను నడిపించారు. ఆందోళనలు చేస్తున్న వారిని తన మాటలు ఎలా నమ్మించగలవని జైట్లీ ఆశించారో తెలియదు గానీ.. ఒకటే మూస - యూజ్ లెస్ ప్రకటనతో ఆయన సభా సమయాన్ని వృథా చేశారు.

అయితే పార్లమెంటు వెలుపల మాత్రం ఏపీకి కేంద్రం నెరవేర్చవలసిన అంశాల గురించి చాలా వేగంగా, తీవ్రంగా కసరత్తు జరుగుతున్నట్లుగా కూడా వార్తలు వస్తున్నాయి. ఈ బడ్జెట్ సమావేశాల రెండో సెషన్స్ మార్చిలో మళ్లీ మొదలయ్యే లోగా.. ఏపీకి చేయవలసిన దాని గురించి పూర్తి క్లారిటీతో కేంద్రం ప్రకటన చేస్తుందని కూడా ఢిల్లీ వర్గాలు పేర్కొంటున్నాయి. వార్తలు వస్తున్నాయి. అన్ని అంశాల మీద కసరత్తు జరుగుతున్నదని మాత్రం అంటున్నారు.

కానీ ఢిల్లీ వర్గాల ద్వారా తెలుస్తున్న సమాచారాన్ని బట్టి.. రైల్వేజోన్ మాత్రం ఖరారుగా వచ్చేస్తుందని అనుకుంటున్నారు. మిగిలిన విషయాల్లో హామీలు వచ్చినా కూడా అమలయ్యేదాకా నమ్మలేని పరిస్థితే ఉంటుందని.. ఆ హామీలు కూడా అనేకానేక డొంకతిరుగుడులుగానే ఉండవచ్చునని తెలుస్తున్నది. రైల్వే జోన్ విషయంలో అచ్చంగా కేంద్రం ప్రకటన చేయడమూ - తదనుగుణంగా కొన్ని సాంకేతికమైన పేపర్ వర్క్ ను పూర్తి చేయడం మాత్రమే ఉంటుంది గనుక.. అది మాత్రం అచ్చంగా కార్యరూపం దాలుస్తుందని తెలుస్తోంది. మిగిలిన హామీలు అన్నీ.. అయినప్పటికీ గానీ నమ్మలేం అంటున్నారు. కసరత్తు అని ప్రస్తుతానికి చెబుతున్నారు గానీ.. తీరా ప్రకటన తయారయ్యే సమయానికి లోక్ సభలో చెప్పిన మాటలకంటె కొంత మెరుగ్గా ఉంటుందే తప్ప.. ఏపీ ప్రజలు ఉత్సాహంతో పొంగిపోయేంతగా ఆ హామీలు ఉండకపోవచ్చునని కూడా ఢిల్లీ వర్గాలు పేర్కొంటున్నాయి. మరి ఈ కొత్త హామీలు తేలిన తర్వాత.. వచ్చే సెషన్ బడ్జెట్ సమావేశాలలో ఏపీ ఎంపీలు ఎలా స్పందిస్తారో చూడాలి.