Begin typing your search above and press return to search.

చంద్రుళ్ల‌కు కేంద్రం మ‌రో షాకిచ్చిందే!

By:  Tupaki Desk   |   15 April 2017 5:54 AM GMT
చంద్రుళ్ల‌కు కేంద్రం మ‌రో షాకిచ్చిందే!
X
ఇద్ద‌రు చంద్రుళ్లుగా వినుతికెక్కిన ఏపీ సీఎం నారా చంద్ర‌బాబునాయుడు - తెలంగాణ సీఎం క‌ల్వ‌కుంట్ల చంద్ర‌శేఖ‌ర‌రావులు... ఇప్పుడైతే పార్టీలు వేర‌య్యాయి గానీ... 18 ఏళ్ల క్రితం వ‌ర‌కూ ఇద్ద‌రూ ఒకే గూటి ప‌క్షులే. ఒకే పార్టీలో సుదీర్ఘ కాలం ఉన్న కార‌ణమో - లేక మరే కార‌ణ‌మో తెలియ‌దు గానీ... పార్టీలు మారినా - రెండు వేర్వేరు రాష్ట్రాల‌కు సీఎంలుగా ఉన్న‌ప్ప‌టికీ వీరి మ‌ధ్య చాలా పోలిక‌లే క‌నిపిస్తున్నాయి. పాలనా వ్యవ‌హారం ద‌గ్గ‌ర నుంచి, పార్టీ సైద్ధాంతిక నిర్ణ‌యాల వ‌ర‌కూ ఇద్ద‌రు ఒకే పంథాతో ముందుకు సాగుతున్న స్ప‌ష్టంగా క‌నిపిస్తోంది. త‌న కంటే సీనియ‌ర్ అయిన చంద్ర‌బాబు కంటే కూడా కాస్తంత స్పీడ్‌ గానే క‌నిపిస్తున్న కేసీఆర్‌... అన్ని విష‌యాల్లోనూ దాదాపుగా పైచేయి సాధించార‌న్న వాద‌న వినిపిస్తోంది.

ఈ క్ర‌మంలో ఇరువురూ పార్టీ ఫిరాయింపుల‌కు తెర తీసిన కార‌ణంగా రెండు రాష్ట్రాల్లో పెద్ద సంఖ్య‌లో విప‌క్షాల‌కు చెందిన‌ ఎమ్మెల్యేలు... ఆప‌రేష‌న్ ఆక‌ర్ష్ దెబ్బ‌కు అధికార పార్టీ ఎమ్మెల్యేలు అయిపోయారు. వారిలో కొంద‌రు మంత్రులుగానూ ప‌ద‌వీ బాధ్య‌త‌లు చేప‌ట్టారు. ఈ త‌ర‌హా అన్ని విష‌యాల్లో కేసీఆర్ చూపిన బాట‌లోనే చంద్ర‌బాబు ప‌య‌నిస్తున్నారు. రాష్ట్ర విభ‌జ‌న నేప‌థ్యంలో పార్టీల్లోని నేత‌ల సంఖ్య‌కు అందుబాటులో ఉన్న అసెంబ్లీ స్థానాల సంఖ్య‌కు ఏమాత్రం పొంతన లేక‌పోగా... మొన్న‌టి ఎన్నిక‌ల్లో ఎలాగోలా నెట్టుకొచ్చిన ఇద్ద‌రు చంద్రుళ్లు... ఇప్పుడు కొత్త‌గా పార్టీలోకి తెచ్చుకున్న వారితో పాటు నాడు టికెట్ రాక అసంతృప్తితో ఉన్న వారు పార్టీ వీడ‌కుండా ఉండేందుకు ఇద్ద‌రు చంద్రుళ్లు ప‌క్కా ప‌థ‌క‌మే ర‌చించుకున్నారు.

ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర పున‌ర్విభ‌జ‌న చ‌ట్టంలోని అసెంబ్లీ స్థానాల సంఖ్య పెంపును ఆస‌రా చేసుకుని కేంద్రంతో రాయ‌బారం న‌డుపుతున్న వీరిద్ద‌రూ... వ‌చ్చే ఎన్నిక‌ల్లోగా ఎలాగైనా అసెంబ్లీ సీట్ల సంఖ్య‌ను పెంచుకునేందుకు శాయ‌శ‌క్తులా ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. ఈ క్ర‌మంలో కొన్నిసార్లు కేంద్రం నుంచి సానుకూల స్పంద‌న వ‌స్తున్నా... ఆ వెనువెంట‌నే ప్ర‌తికూల ప్ర‌క‌ట‌న‌లు కూడా వినిపిస్తున్నాయి. ఇటీవ‌ల ముగిసి పార్ల‌మెంటు స‌మావేశాల్లో భాగంగా తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ సీట్ల సంఖ్య పెంపుపై కేంద్రం రెండు ర‌కాల కామెంట్లు చేసింది. సీట్ల సంఖ్య పెంపు సాధ్యం కాద‌ని ఓసారి, ఆ త‌ర్వాత కేంద్ర మంత్రి వెంక‌య్య‌నాయుడు రంగ‌ప్ర‌వేశంతో సానుకూలంగా స్పందించింది.

సాక్షాత్తు కేంద్ర హోం శాఖ మంత్రి సానుకూలంగా స్పందించిన నేప‌థ్యంలో ఇక అసెంబ్లీ సీట్ల సంఖ్య పెంపు ఖాయ‌మేన‌ని ఇద్ద‌రు చంద్రుళ్లు తెగ ఖుషీగా ఉన్నార‌ట‌. ఈ క్ర‌మంలో వైసీపీ కీల‌క నేత‌ - ఆ పార్టీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి సంధించిన ఓ ప్ర‌శ్న‌కు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ నుంచి ఓ సంచ‌ల‌న ఆన్స‌ర్ వ‌చ్చింది. ఈ ఆన్స‌ర్ ఇద్ద‌రు చంద్రుళ్ల‌కు ఏమాత్రం మింగుడుప‌డ‌నిదేన‌ని చెప్ప‌క త‌ప్ప‌దు ఎందుకంటే... తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ సీట్ల పెంపు ఇప్పుటికిప్పుడు... అంటే 2019 ఎన్నిక‌ల‌లోగా సాధ్యం కాద‌ని కేంద్రం లిఖిత‌పూర్వ‌క స‌మాధానంలో కుండ‌బ‌ద్దలు కొట్టింది.

కేంద్ర హోం శాఖ స‌హాయ మంత్రి హ‌న్స్ రాజ్ గంగారాం ఆహిర్ పేరిట విడుద‌లైన ఈ ప్ర‌క‌ట‌న వివ‌రాల్లోకెళితే... 2014 ఏపీ పునర్విభజన చట్టంలోని సెక్షన్ 26కు అనుగుణంగా రాజ్యాంగంలోని 170వ అధికరణను సవరించనిదే తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ సీట్ల పెంపు సాధ్యం కాదట‌. ఏపీలో అసెంబ్లీ సీట్లను 175 నుంచి 225కు - తెలంగాణలో 119 నుంచి 153కు పెంచడం సాధ్యం కాదని ఆ ప్ర‌క‌ట‌న తేల్చేసింది. రాజ్యాంగ సవరణ జరిగితే తప్ప ఇది సాధ్యమయ్యే పనికాదట‌. ఒకవేళ రాజ్యాంగాన్ని సవరించాలంటే సగానికి పైగా రాష్ట్రాలు ఈ ప్రతిపాదనను అమోదించాల్సి ఉంటుంద‌ని, వచ్చే ఎన్నిక‌ల నాటికి ఈ ప‌ని దుస్సాధ్య‌మేన‌ని ఆ ప్ర‌క‌ట‌న తేల్చిచెప్పింది. మ‌రి ఈ ప్ర‌క‌ట‌న ఇద్ద‌రు చంద్రుళ్ల‌లో ఏ మేర ప్ర‌కంప‌న‌లు సృష్టిస్తుంద‌న్న త్వ‌ర‌లోనే తేలిపోనున్న‌ట్లు విశ్లేష‌ణ‌లు సాగుతున్నాయి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/