Begin typing your search above and press return to search.

ప్యాకేజీ అంట : హోదాకు మంగళం పాడినట్టే!

By:  Tupaki Desk   |   1 Sep 2016 4:22 AM GMT
ప్యాకేజీ అంట : హోదాకు మంగళం పాడినట్టే!
X
తిరుపతిలో పవన్‌ కల్యాణ్‌ సభ తర్వాత మొత్తానికి ఏపీకి సంబంధించిన వ్యవహారాల్లో కాస్త వేగం వచ్చింది. చంద్రబాబు కూడా ప్రత్యేకహోదా పై వెనక్కు తగ్గే సమస్యే లేదని వాక్రుచ్చడంతో ఢిల్లీ సర్కార్‌ ఏదైనా చేసేస్తుందని అంతా అనుకున్నారు. దానికి తోడు జైట్లీ - వెంకయ్య లతో సుజనా సమావేశాలు కూడా ఆశలు పుట్టించాయి. కానీ తాజాగా వస్తున్న వార్తల ప్రకారం.. ఆంధ్రప్రదేశ్‌ కు మంచి ప్యాకేజీ ఇవ్వడానికి రంగం సిద్ధం చేస్తున్నారని తెలుస్తోంది. ప్రత్యేకహోదా అనే పదం వాడి.. ఆ గుర్తింపు ఇవ్వడానికి రాజ్యాంగపరమైన కొన్ని చిక్కులు ఉన్నందున.. హోదా వస్తే ఎలాంటి సదుపాయాలు అయితే వస్తాయో అదే మాదిరి లాభాలన్నీ కలసి వచ్చేలాగా.. రూపొందించిన మంచి ప్యాకేజీని ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది.

దీని ప్రకారం పోలవరం నిర్మాణ బాధ్యతపై ఓ ఒప్పందం చేసుకుని చేపడతారని, రెవిన్యూలోటును పూర్తిగా భర్తీ చేసేలా నిదులు ఇస్తారని, రాజధానిలో కోర్‌ కేపిటల్‌ భవనాల నిర్మాణానికి పూర్తిస్థాయిలో నిధులు వస్తాయని దాదాపు 4 - 5 వేల కోట్ల రూపాయలు అమరావతి నిర్మాణానికి మాత్రమే ఇస్తారని వార్తలు వస్తున్నాయి.

వారం కంటె తక్కువ రోజుల్లోనే ప్యాకేజీకి సంబంధించిన ప్రకటన వచ్చేస్తుందనే ప్రచారం జరుగుతోంది. అయితే ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే.. ప్యాకేజీ ముసుగులో ఇక ప్రత్యేక హోదా అనే మాటను అటకెక్కించేసినట్లే అని ప్రజలు అనుకుంటున్నారు. ఒకవైపు చంద్రబాబు మాత్రం ప్రత్యేకహోదా విషయంలో రాజీ లేదు, తగ్గేది లేదు అని బీరాలు పలుకుతూనే ఉన్నారు. కానీ కేంద్రం మాత్రం ఈ ప్యాకేజీ ద్వారా ఆ కలలను పూర్తిగా తొక్కేయబోతున్నదని అంతా అనుకుంటున్నారు.