Begin typing your search above and press return to search.

హోదా పోరాటం గిట్టుబాటు అవుతోందా?

By:  Tupaki Desk   |   5 Aug 2016 6:06 AM GMT
హోదా పోరాటం గిట్టుబాటు అవుతోందా?
X
విభజన జరిగిన రెండేళ్ల తరువాత ఏపీలోని పాలక పార్టీ సహా విపక్షాలన్నీ ప్రత్యేక హోదా పోరాటాన్ని ఒక్కసారిగా ఉద్ధృతం చేయడంతో కేంద్రం దిగివస్తున్నట్లుగా కనిపిస్తోంది. ఏపీ ప్రత్యేక హోదా పోరాటంతో ప్రస్తుత పార్లమెంటు సమావేశాలు కూడా వాడివేడిగా సాగాయి. దీంతో కేంద్రం ఏపీకి అన్యాయం చేస్తోంది.. మిత్రపక్షాన్ని కూడా పట్టించుకోని పార్టీ బీజేపీ అన్న సంకేతం దేశమంతా పాకింది. ఇలాంటి పరిస్థితుల్లో ఈ ఏడాది పలు కీలక రాష్ట్రాల్లో ఎన్నికలు ఉన్న నేపథ్యంలో వాటిపై ఆ ప్రభావం పడకుండా బీజేపీ జాగ్రత్త పడుతోంది. ముఖ్యంగా తమపై నమ్మకం పోకుండా ఉండాలంటే ఏపీకి న్యాయం చేసి తమ చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని భావిస్తోంది. అందులో భాగంగానే ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వకపోయినా అందుకు సరిపడేలా భారీ ప్యాకేజీ ప్రకటించేందుకు ప్లాన్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఏటా రూ.2 వేల కోట్లు ఇచ్చేలా ప్యాకేజీ డిజైన్ చేస్తున్నట్లు వినికిడి.

ప్రత్యేక హోదా హామీని అమలు చేసేందుకు రాజ్యాంగ నిబంధనలు అడ్డుగా నిలుస్తు న్నాయనే సాకుతో పాటు మిత్రపక్షం అధికారంలో ఉన్నప్పటికీ రాష్ట్రానికి అదనంగా ఎలాంటి సహాయం చేయ లేమని రాజ్యసభలో కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ చేసిన ప్రకటనపై టిడిపి అధినేత - ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బాహాటంగానే తన అసంతృప్తిని - ఆగ్రహాన్ని వ్యక్తం చేయడానికి తోడు ఆ పార్టీ పార్లమెంట్‌ సభ్యులు లోక్‌ సభలో ఆందోళనకు దిగి సభా కార్యక్రమాలకు అడ్డుతగిలిన నేపధ్యంలో ఆంధ్రప్రదేశ్‌ కు కొంత ఆర్థిక సహాయం చేసేందుకున్న అవకాశాలను అన్వేషించే ప్రక్రియ ఊపందుకున్నది. ఏపీకి కేంద్ర సాయం వివాదాన్ని వెంటనే పరిష్కరించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలన్న ప్రధాని నరేంద్ర మోడీ - బిజెపి అధ్యక్షుడు అమిత్‌ షాల ఆదేశంపై కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ రాష్ట్రానికి ప్రకటించాల్సిన ఆర్థిక ప్యాకేజీ రూపురేఖలను సిద్ధం చేసే ప్రక్రియలో మునిగితేలుతున్నట్లు సమాచారం. అన్నీ అనుకన్నట్లు జరిగితే ఈ సమావేశాల్లోనే ప్రకటన రావొచ్చని సమాచారం.

రాష్ట్రాన్ని ఆదుకొనేందుకు తీసుకొనే చర్యలపై అతి త్వరలోనే ఒక నిర్ణయం తీసుకొని ప్రకటిస్తామని రెండు రోజుల క్రితం లోక్‌ సభలో ఆందోళన చేస్తున్న టిడిపి ఎంపీలకు హామీ ఇచ్చిన జైట్లీ గురువారం నాడు తెలుగు దేశం పార్లమెంటరీ పార్టీ నాయకుడైన కేంద్ర సహాయ మంత్రి సుజనా చౌదరి - ఆ పార్టీ ఎంపీ సి.ఎం.రమేష్‌ లను పార్లమెంట్‌ ప్రాంగణంలోని తన కార్యాలయానికి పిలిపించుకొని పలుదఫాలుగా సుదీర్ఘంగా మంతనాలు జరిపారు. రాష్ట్రానికి చెందిన సీనియర్‌ నాయకుడు - కేంద్ర సమాచార మంత్రి వెంకయ్యనాయుడు కూడా కొద్దిసేపు ఈ ప్యాకేజీ రూపకల్పన కసరత్తులో పాలు పంచుకొన్నట్లు సమాచారం. గత రాత్రి బిజెపి అధ్యక్షుడు అమిత్‌ షా - ఆర్థిక మంత్రి జైట్లీలు వెంకయ్య నాయుడు నివాసానికి వెళ్లి ఏపీ సమస్య పరిష్కారానికి అనుసరించాల్సిన వ్యూహంపై ఆయనతో చర్చలు జరిపారని తెలుస్తోంది. ఇక జాప్యం చేయకుండా వివాదానికి తెరదించాలని అరుణ్‌ జైట్లీని అమిత్‌ షా ఆదేశించినట్లు తెలియవచ్చింది.

ప్రత్యేక హోదా కల్పిస్తే రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా అమలు జరిగే కేంద్ర ప్రాయోజిత సంక్షేమ పథకాలకయ్యే వ్యయంలో 90శాతాన్ని కేంద్ర ప్రభుత్వం - పది శాతాన్ని మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం భరించాల్సి ఉంటుంది. గత అయిదేళ్లలో రాష్ట్రంలో అమలైన కేంద్ర పథకాల కోసం వెచ్చించిన మొత్తాన్ని పరిగణనలోకి తీసుకొంటే హోదా ఇస్తే ఏపీకి అదనంగా లభించేది కేవలం పదమూడు - పధ్నాలుగు వందల కోట్లు మాత్రమేనని ఈ కసరత్తులో తేలిందని పేర్కొంటున్నాయి. దీనికితోడు, విదేశీ ఆర్థిక సహాయ సంస్థల రుణాలతో ఆయా రాష్ట్రాలలో అమలు చేసే అభివృద్ధి ప్రాజెక్టులలో కూడా రుణాల తిరిగి చెల్లింపు బాధ్యత 90:10 నిష్పత్తిలోనే ఉంటుంది, ఏపీకి మంజూరయ్యే అవకాశమున్న విదేశీ ఆర్థిక సహాయ ప్రాజెక్టులతో ఏడాదికి కనీసం అయిదారు వందల కోట్ల రూపాయలకు మించి వెసులుబాటు లభించే అవకాశం ఉండకపోవచ్చునన్న అంచనాలతో మొత్తం మీద వచ్చే అయిదేళ్లలో ప్రతిఏటా సుమారు 2 వేల కోట్లకు పైగా ఆర్థిక సహాయాన్ని అదనంగా సమకూర్చగలిగితే పూర్తి న్యాయం చేసినట్లే కాగదలదని అరుణ్‌జైట్లీ అభిప్రాయపడు తున్నట్లు తెలియవచ్చింది. ప్రస్తుత పార్లమెంట్‌ సమావేశాలు ముగిసేలోగానే కేంద్రం దీనిని పార్లమెంట్‌ వేదికగానే ప్రకటించే అవకాశాలున్నాయని సమాచారం.