Begin typing your search above and press return to search.

ఎంపీ ఫిర్యాదుతో బడా ఆసుపత్రికి షోకాజ్ షాక్

By:  Tupaki Desk   |   5 May 2016 6:06 AM GMT
ఎంపీ ఫిర్యాదుతో బడా ఆసుపత్రికి షోకాజ్ షాక్
X
ఆసుపత్రుల తీరుపై ప్రముఖులు సైతం ఫిర్యాదులు చేస్తున్న పరిస్థితి. రెండు తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ అయితే కార్పొరేట్ ఆసుపత్రుల తీరుపై ఇప్పటికే పలుమార్లు తన అసంతృప్తిని బాహాటంగా బయటపెట్టటమే కాదు.. రెండు తెలుగురాష్ట్ర ప్రభుత్వాలు స్పందించాలని కోరారు కూడా. అయినా అందుకు రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు స్పందించిందే లేదు. ప్రజల నెత్తిన భారీగా భారాన్ని మోపుతూ.. వైద్యాన్ని ఫక్తు వ్యాపారంగా మార్చిన కార్పొరేట్ వైద్యం మీద గవర్నర్ ధర్మాగ్రహం రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలకు పట్టలేదు.

ఇదిలా ఉంటే.. ఒక రాజ్యసభ సభ్యుడికి కార్పొరేట్ ఆసుపత్రి నిర్వాకంతో షాక్ తగలటంతో ఆయన గుస్సా ప్రదర్శించటమే కాదు.. సదరు ఆసుపత్రి మీద చర్యల కోసం పోరాటం చేస్తున్న సంగతి తెలిసిందే. హైదరాబాద్ లోని యశోద ఆసుపత్రికి తన భార్యకు చికిత్స చేసేందుకు తీసుకెళ్లిన సందర్భంలో తనకు ఎదురైన చేదు అనుభవాన్ని ఇప్పటికే ఎంపీ ఎంఏ ఖాన్ మీడియాకు చెప్పటం తెలిసిందే.

భార్య వైద్యం కోసం యశోద ఆసుపత్రికి తీసుకెళితే.. వైద్యం చేయకుండా అనవసరమైన టెస్ట్ లు చేశారంటూ ఆయన ఆరోపిస్తున్నారు. ఈ ఆరోపణల్ని యశోదా ఆసుపత్రి ఖండించింది. ఇదిలా ఉంటే.. రాజ్యసభ సభ్యుడినైన తనకే ఇలాంటి పరిస్థితి ఎదురైతే.. మిగిలిన వారి సంగతేమిటంటూ కేంద్ర వైద్యారోగ్య శాఖను ఎంపీ సంప్రదించి.. ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో యశోదాకు షోకాజ్ నోటీసులు జారీ అయ్యాయి. రాజకీయ నాయకులకు చేదు అనుభవాలు ఎదురైతే తప్పించి రియాక్ట్ కారన్న మాట. నలుగురికి మేలు చేసేలా గవర్నర్ లాంటి వారు కార్పొరేట్ వైద్యంలో సాగుతున్న దోపిడీ గురించి ప్రస్తావించినప్పడు ఒక్కరంటే ఒక్క రాజకీయ నేత కూడా రియాక్ట్ కాకపోవటం గమనార్హం.