Begin typing your search above and press return to search.

విద్యుత్ సంక్షోభం పై రాష్ట్రాల‌కు కేంద్రం కీల‌క సూచ‌న‌లు !

By:  Tupaki Desk   |   12 Oct 2021 1:21 PM GMT
విద్యుత్ సంక్షోభం పై రాష్ట్రాల‌కు కేంద్రం కీల‌క సూచ‌న‌లు !
X
దేశంలో బొగ్గు కొర‌త కార‌ణంగా రాష్ట్రాలు విద్యుత్ స‌మ‌స్య‌ను ఎదుర్కొంటున్నాయి.  ఈ స‌మ‌స్య‌పై కేంద్రం కీల‌క నిర్ణ‌యాలు తీసుకున్న‌ది.  రాష్ట్రాల‌కు ప‌లు కీల‌క‌మైన సూచ‌న‌లు చేసింది.  కేంద్రం వ‌ద్ద ఉన్న కేటాయించ‌ని విద్యుత్‌ను వాడుకోవాల‌ని రాష్ట్రాల‌కు సూచించింది.  కొన్ని రాష్ట్రాలు అధిక ధ‌ర‌ల‌కు విద్యుత్ ను విక్ర‌యిస్తున్నాయ‌ని, వినియోగ‌దారుల‌కు ఇవ్వ‌కుండా విద్యుత్‌ను అమ్ముకోవ‌ద్ద‌ని కేంద్రం సూచించింది.  ఎక్కువ ధ‌ర‌ల కోసం విద్యుత్‌ను అమ్ముకునే రాష్ట్రాల‌పై చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని కేంద్రం హెచ్చ‌రించింది.

 కేటాయించ‌ని విద్యుత్‌ను వాడుకునే వెసులుబాటును తొల‌గిస్తామ‌ని కేంద్రం హెచ్చ‌రించింది.  విద్యుత్ ను స‌ర‌ఫ‌రా చేసే బాధ్య‌త డిస్ట్రిబ్యూష‌న్ కంపెనీల‌దే అని కేంద్రం పేర్కొన్న‌ది.  విద్యుత్ మార్గ‌ద‌ర్శ‌కాల ప్ర‌కారం సెంట్ర‌ల్ జ‌న‌రేటింగ్ కేంద్రం వ‌ద్ద ఏ రాష్ట్రాల‌కు కేటాయించ‌ని 15శాతం విద్యుత్ ఉంటుంది.  ఈ విద్యుత్‌ను కొర‌త ఎదుర్కొంటున్న రాష్ట్రాలు వాడుకోవాల‌ని కేంద్రం తెలిపింది.  అదే విధంగా మిగులు విద్యుత్ ఉన్న రాష్ట్రాలు కొర‌త రాష్ట్రాల‌కు విద్యుత్‌ను అందించాల‌ని కేంద్రం తెలియ‌జేసింది.

నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్, దామోదర్ వ్యాలీ కార్పొరేషన్ వంటివి, కేంద్రీయ విద్యుత్ ఉత్పాదక సంస్థల పరిధిలోకి వస్తాయి. ఎన్టీపీసీ కేంద్రాలు- ఏ రాష్ట్రంలో ఉంటే.. ఆ రాష్ట్రాలకు కల్పించిన కేటాయింపులు పోగా, మిగిలిన విద్యుత్ మొత్తం కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉంటుంది. డిమాండ్‌ కు అనుగుణంగా దాన్ని అన్ని రాష్ట్రాలకు సరఫరా చేస్తుంది. అదే సమయంలో  ఎవరికీ కేటాయించని విద్యుత్ కోటాను కేంద్ర ప్రభుత్వం తన ఆధీనంలో ఉంచుకుంటుంది. ఒక ఎన్టీపీసీ కేంద్రంలో వందశాతం మేర విద్యుత్ ఉత్పత్తి చోటు చేసుకుంటే అందులో 15 శాతాన్ని నాన్ అలకేటెడ్ పవర్‌ గా భావిస్తారు.దేశవ్యాప్తంగా అన్ని సెంట్రల్ పవర్ జనరేషన్స్ అన్నింట్లోనూ ఇలా 15 శాతం వరకు ఎవరికీ కేటాయించని విద్యుత్ కోటా ఉంటుంది. విద్యుత్ సంక్షోభ పరిస్థితులు నెలకొన్నప్పుడు దాన్ని వినియోగించుకోవడానికే ఈ నాన్ అలకేటెడ్ పవర్ కోటాను అందుబాటులోకి తీసుకొచ్చింది.

బొగ్గు కొరత వల్ల దేశవ్యాప్తంగా నెలకొన్న విద్యుత్ సంక్షోభాన్ని దృష్టిలో ఉంచుకుని, ఇప్పుడు ఆ కోటాను వినియోగించుకోవాల్సిందిగా కేంద్ర ఇంధన మంత్రిత్వ శాఖ రాష్ట్ర ప్రభుత్వాలకు సూచించింది. ఈ మేరకు ఓ నోటిఫికేషన్‌ ను విడుదల చేసింది. ఇంకొద్ది రోజుల్లో బ్లాక్ అవుట్‌ను ఎదుర్కొంటుందని భావిస్తోన్న దేశ రాజధానిలోని విద్యుత్ ఉత్పాదక సంస్థల్లో బొగ్గు నిల్వలు అడుగంటాయని విద్యుత్ శాఖ మంత్రి సత్యేంద్ర జైన్ స్పష్టం చేశారు. కొరతను అధిగమించడానికి ఇతర రాష్ట్రాల నుంచి విద్యుత్‌ను కొనుగోలు చేయాల్సి వస్తోందని అన్నారు. బొగ్గు సంక్షోభం వల్ల ఎన్టీపీసీ కేంద్రాలు పూర్తిస్థాయిలో విద్యుత్‌ ను ఉత్పత్తి చేయట్లేదని, 50 శాతానికి తగ్గించాయని చెప్పారు.