Begin typing your search above and press return to search.

పాకిస్తాన్‌ కు కొత్త‌పేరు పెట్టిన హోంమంత్రి

By:  Tupaki Desk   |   15 Oct 2017 5:39 AM GMT
పాకిస్తాన్‌ కు కొత్త‌పేరు పెట్టిన హోంమంత్రి
X
భారత్ పట్ల పాకిస్థాన్ దుష్ట కార్యక్రమాలు చేపడుతోంద‌ని కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ మండిప‌డ్డారు. కశ్మీర్‌లో సరిహద్దు పొడవునా పాక్‌కు దీ టుగా కాల్పులు జరిపేందుకు, ఉగ్రవాదుల ఏరివేతకు సైన్యానికి స్వేచ్ఛనిచ్చామన్నారు. పాక్ కాల్పులు జరుపుతున్నా, శాంతిమంత్రం జపించొద్దని, దీటుగా సమాధానం ఇవ్వాలని బీఎస్‌ఎఫ్ డీజీకి ఆదేశాలు జారీ చేశామన్నారు. భారత్‌కు వ్యతిరేకంగా అధర్మశీలమైన విద్రోహ కార్యకలాపాలకు పాల్పడుతోందంటూ ఆయన పాకిస్తాన్‌పై విరుచుకుపడ్డారు. బీజేపీ నిర్వహిస్తున్న ‘గుజరాత్ గౌరవ్ యాత్ర’లో భాగంగా శనివారం ఇక్కడ నిర్వహించిన ఒక సభలో రాజ్‌నాథ్ సింగ్ మాట్లాడుతూ ఉగ్రవాదులను అణచివేయడానికి, సరిహద్దుల పొడవునా అవతలి వైపు నుంచి జరిపే కాల్పులకు తగిన రీతిలో బదులివ్వడానికి ఎన్‌డీఏ ప్రభుత్వం ఆర్మీకి స్వేచ్ఛను ఇచ్చిందని తెలిపారు.

కాశ్మీర్ సమస్యను పరిష్కరించకుండా తమ ప్రభుత్వాన్ని ప్రపంచంలోని ఏ శక్తి అడ్డుకోజాలదని కేంద్ర హోంమంత్రి తెలిపారు. ‘కాశ్మీర్ గురించి ఎవరూ ఆందోళన చెందవలసిన అవసరం లేదు. కాశ్మీర్ సమస్యను పరిష్కరించకుండా మమ్మల్ని ప్రపంచంలోని ఏ శక్తి అడ్డుకోలేద‌ని` ఆయ‌న తెలిపారు. పాకిస్తాన్ భారత్‌లోకి ఉగ్రవాదులను పంపిస్తోందని, దేశాన్ని విభజించాలని కోరుకుంటోందని ఆయన ధ్వజమెత్తారు. ‘పాకిస్తాన్ మన పొరుగు దేశం. దాని పేరు ‘పాక్’-ఇస్తాన్, కాని ఆ దేశం ఎల్లవేళలా ‘నపాక్’ (అధర్మశీల) కార్యకలాపాలకు పాల్పడుతోంది. భారత్‌ను విభజించడానికి ప్రయత్నిస్తోంది. ఇందుకోసం ఉగ్రవాదులను భారత్‌లోకి పంపిస్తోంది’ అని రాజ్‌నాథ్ మండిప‌డ్డారు. పాకిస్తాన్ పొరుగు దేశం కాబట్టి, ఆ దేశంతో ఉన్న అన్ని ద్వైపాక్షిక సమస్యలను శాంతియుతంగా పరిష్కరించుకోవడానికి మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రయత్నించారని, చివరకు ఆయన ప్రొటోకాల్‌ను పక్కన పెట్టి పాకిస్తాన్‌కు కూడా వెళ్లారని రాజ్‌నాథ్ పేర్కొన్నారు. అయితే పాకిస్తాన్ మాత్రం తన విద్రోహ కార్యకలాపాలను మానుకోలేదని విమర్శించారు. ఇది ఎంతో కాలం సాగబోదని ఆయన పాకిస్తాన్‌ను హెచ్చరించారు.

సరిహద్దుల మీదుగా పాకిస్తాన్ జరిపే కాల్పులకు సమాధానంగా శాంతి కోసం ‘శ్వేత పతాకాన్ని’ చూపించడం కాకుండా, బుల్లెట్లతో బదులివ్వాలని తాను మన బలగాలను ఆదేశించానని హోంమంత్రి చెప్పారు. ఉగ్రవాదులను ఎదుర్కోవడంలో కూడా తాను మన బలగాలకు స్వేచ్ఛను ఇచ్చానని తెలిపారు. దీనివల్ల 2016-17 సంవత్సరాలలో జమ్మూకాశ్మీర్‌లో రికార్డు స్థాయిలో ఉగ్రవాదులు హతమయ్యారని పేర్కొన్నారు. భద్రతా బలగాలు మట్టుబెట్టిన ఉగ్రవాదుల సంఖ్య జోలికి తాను పోనని, అయితే గతంలో ఎన్నడు కూడా ఇంత పెద్ద సంఖ్యలో ఉగ్రవాదులను హతమార్చలేదని ఆయన పేర్కొన్నారు. 2014 మేలో మోడీ ప్రభుత్వం ఏర్పడిన తరువాత భారత్- పాక్ సరిహద్దుల్లో పాకిస్తాన్ కాల్పులు జరిపినప్పుడు మనం ‘శ్వేత పతాకాన్ని’ చూపే సంప్రదాయానికి స్వస్తి పలకాలని సరిహద్దు భద్రతా దళం (బిఎస్‌ఎఫ్) డైరెక్టర్ జనరల్‌కు ఆదేశాలు ఇవ్వడం జరిగిందని రాజ్‌నాథ్ సింగ్ తెలిపారు.