Begin typing your search above and press return to search.

ఆ ఆస్తుల పంపిణీపై కేంద్ర హోంశాఖ తీర్పు ఇదే..

By:  Tupaki Desk   |   19 April 2017 11:35 AM GMT
ఆ ఆస్తుల పంపిణీపై కేంద్ర హోంశాఖ తీర్పు ఇదే..
X
రెండు తెలుగు రాష్ట్రాల విభ‌జ‌న నేప‌థ్యంలో ఆస్తుల పంప‌కాలపై ఇరు రాష్ట్రాల మ‌ధ్య‌న బేధాభిప్రాయాలు ఉన్న విష‌యం తెలిసిందే. వీటిపై సుప్రీంను ఆశ్ర‌యించారు కూడా. ఆస్తుల పంప‌కంపై విభ‌జ‌న చ‌ట్టంలో వివ‌రాలు ఉన్న‌ప్పుటికి.. రెండు తెలుగు రాష్ట్రాల మ‌ధ్య మాత్రం పంచాయితీలు నెల‌కొన్నాయి. ఇదే సంద‌ర్భంలో ఆంధ్ర‌ప్ర‌దేశ్ ఉన్న‌త విద్యామండ‌లికి చెందిన ఆస్తులు.. బ్యాంకు ఖాతాలు.. ఫిక్సెడ్ డిపాజిట్లు.. ఉద్యోగులు.. ఉప‌క‌ర‌ణాలు.. అప్పుల్ని ఎలా పంచుకోవాల‌న్న లెక్క తేల్లేదు. దీంతో.. ఇరు రాష్ట్రాలు సుప్రీంకు వెళ్లిన తెలుగు రాష్ట్రాల‌కు మార్గ‌ద‌ర్శ‌నం చేసింది. అయితే.. వీటి అమ‌లు విష‌యంలో రెండు రాష్ట్రాల మ‌ధ్య‌నున్న లెక్క‌ల్ని తేల్చే విష‌యంపై తాజాగా కేంద్ర హోంశాఖ తుది ఆదేశాలు జారీ చేసింది.

విభ‌జ‌న చ‌ట్టంలోని సెక్ష‌న్ 48(1) ప్ర‌కారం తెలంగాణ‌.. ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రాల్లోని స్థిర‌.. చ‌ర ఆస్తుల పంపిణీని జ‌నాభా నిష్ప‌త్తి ప్ర‌కారం 52:48 నిష్ప‌త్తిలో పంచుకోవాల్సి ఉంది. అయితే.. స్థిర చ‌రాస్తుల మాటేమిట‌న్న‌ది ప్ర‌శ్న‌గా మారింది. వాటి విభ‌జ‌న ఎలా చేయాల‌న్న అంశంపై రెండు రాష్ట్రాల మ‌ధ్య‌నున్న విభేదాల్ని ప‌రిష్క‌రించుకునేందుకు హోంశాఖ‌ను కోర‌గా.. తాజాగా వీటిపై స్ప‌ష్ట‌త ఇచ్చింది.

తాజాగా విడుద‌ల చేసిన ఆదేశాల ప్ర‌కారం.. ఆంధ్ర‌ప్ర‌దేశ్ ఉన్న‌త విద్యామండ‌లి ఆస్తుల పంపిణీకి సంబంధించి.. ఏ రాష్ట్రంలో ఉన్న ఆస్తులు ఆ రాష్ట్రానికి చెందుతాయ‌ని.. ఉద్యోగులు కూడా ఎక్క‌డ ప‌ని చేస్తున్న వారు అక్క‌డే కొన‌సాగాల‌ని తీర్పునిచ్చింది. ఇక‌.. డిపాజిట్లు.. బ్యాంకు ఖాతాల్లోని సొమ్మును జ‌నాభా ప్రాతిప‌దిక‌న పంచుకోవాల‌ని పేర్కొంది. షెడ్యూల్ 9 - 10 లోని అన్ని సంస్థ‌ల ఆస్తుల విష‌యంలోనూ ఇదే విధానాన్ని పాటించాల‌ని కేంద్ర హోంశాఖ స్ప‌ష్టం చేసింది. త‌న నిర్ణ‌యాన్ని వెల్ల‌డించే ముందు రెండు తెలుగు రాష్ట్రాల అధికారుల‌తో కేంద్ర హోం శాఖ అధికారులు ప‌లుమార్లు భేటీ అయ్యారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/