Begin typing your search above and press return to search.

ఆ స‌వ‌ర‌ణ‌తో తెలుగు చంద్రుళ్ల క‌ల తీరిన‌ట్లే

By:  Tupaki Desk   |   6 July 2017 5:16 AM GMT
ఆ స‌వ‌ర‌ణ‌తో తెలుగు చంద్రుళ్ల క‌ల తీరిన‌ట్లే
X
తాజా ప‌రిణామాలు చూస్తుంటే.. తెలుగు రాష్ట్రాల ఇద్ద‌రు చంద్రుళ్లు విన‌యంతో.. విధేయ‌త‌తో మోడీ స‌ర్కారు మ‌న‌సు గెలుచుకున్న‌ట్లుగా క‌నిపిస్తోంది. అసాధ్య‌మ‌ని చెప్పే అంశాలు సైతం.. గుట్టుగా జెట్ స్పీడ్ తో దూసుకెళుతున్న వైనం చూస్తే.. కేంద్రం ఏం చేసినా.. తమ మద్ద‌తు మోడీకే అన్న‌ట్లుగా వ్య‌వ‌హ‌రిస్తున్న ఇద్ద‌రు చంద్రుళ్లు.. త‌మ విధేయ‌త‌తో తాము అనుకుంటున్న ప‌ని జ‌రిగేట‌ట్లుగా చూస్తున్న‌ట్లుగా అర్థ‌మ‌వుతుంది.

వ‌చ్చే సార్వ‌త్రిక ఎన్నిక‌ల నాటికి అసెంబ్లీ సీట్ల సంఖ్య‌ను పెంచుకోవాల‌ని రెండు రాష్ట్రాల చంద్రుళ్లు త‌హ‌త‌హ‌లాడటం తెలిసిందే. 2014 సార్వ‌త్రిక ఎన్నిక‌ల అనంత‌రం రెండు తెలుగు రాష్ట్రాల్లో ప‌వ‌ర్ లోకి వ‌చ్చిన చంద్రుళ్లు.. త‌మ బ‌లాన్ని మ‌రింత పెంచేందుకు విప‌క్ష పార్టీ ఎమ్మెల్యేల‌పై ఆప‌రేష‌న్ ఆక‌ర్ష్ ఆస్త్రాన్ని ప్ర‌యోగించిన వైనం తెలిసిందే.

దీంతో.. బ‌య‌ట పార్టీల నుంచి వ‌చ్చిన ఎమ్మెల్యేల‌కు నియోజ‌క‌వ‌ర్గాల కేటాయింపు వ‌చ్చేఎన్నిక‌ల‌కు క‌ష్టంగా మార‌నుంది. అయితే.. విభ‌జ‌న చ‌ట్టంలో ఉన్న ఒక అవ‌కాశాన్ని ఉప‌యోగించి.. కేంద్రం సాయంతో నియోజ‌క‌వ‌ర్గాల సంఖ్య‌ను పెంచుకునే అంశం మీద ఇద్ద‌రు చంద్రుళ్లు దృష్టి సారించారు.

మొద‌ట్లో అసెంబ్లీ సీట్ల పెంపు అంశం క‌ష్ట‌మ‌ని.. 2019 ఎన్నిక‌ల నాటికి సాధ్యం కాద‌న్న‌ట్లుగా కేంద్రం సంకేతాలు పంపింది. దీనికి సంబంధించి ప‌లువురు మంత్రులు ఇదే త‌ర‌హా అభిప్రాయాన్ని వ్య‌క్తం చేశారు. కానీ.. అందుకు భిన్నంగా జ‌ర‌గాల్సిన ప‌నులు మాత్రం జ‌రిగిపోతుండ‌టం గ‌మ‌నార్హం. రాష్ట్రప‌తి ఎన్నిక‌ల వేళ‌..ఎన్డీయే అభ్య‌ర్థి రామ్ నాథ్ కోవింద్‌ కు మ‌ద్ద‌తు ప్ర‌క‌టించిన నేప‌థ్యంలో నామినేష‌న్ కార్య‌క్ర‌మం సంద‌ర్భంగా ఇరువురు చంద్రుళ్లు క‌లిసి.. అసెంబ్లీ సీట్ల పెంపు అంశంపై ప్ర‌త్యేకంగా మాట్లాడుకున్న‌ట్లుగా వార్త‌లు వ‌చ్చాయి.

ఈ వాద‌న‌కు బ‌లం చేకూరేలా తాజా ప‌రిణామం చోటు చేసుకుంది. తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ సీట్ల పెంపున‌కు సంబంధించి మ‌రో కీల‌క అడుగు ప‌డింది. విభ‌జ‌న చ‌ట్టంలోని సెక్ష‌న్ 26 ప్ర‌కారం సీట్లు పెంచుకోవ‌టానికి వీలుగా రాజ్యాంగ స‌వ‌ర‌ణ చేసుకునేందుకు వీలుగా కేంద్ర న్యాయ‌శాఖ గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చేసిన‌ట్లుగా తెలుస్తోంది.

ఇందుకు సంబంధించిన ఫైల్ మీద ఆమోద ముద్ర వేసి కేంద్ర హోంశాఖ‌కు పంపిన‌ట్లుగా స‌మాచారం. అసెంబ్లీ సీట్ల పెంపున‌కు అడ్డంకిగా ఉన్న ఆర్టిక‌ల్ 170(3)ను ఏం చేయాల‌న్న అంశంపై న్యాయ‌శాఖ ఒక చ‌క్క‌టి ప‌రిష్కారం చూపింద‌ని చెబుతున్నారు. దీని ప్ర‌కారం ఆర్టిక‌ల్ కింద పొందుప‌రిచిన నిబంధ‌న‌లు రెండు తెలుగు రాష్ట్రాల‌కు వ‌ర్తించ‌వ‌న్న చిన్న క్లాజ్‌ను జ‌త చేయ‌టం ద్వారా అసెంబ్లీ సీట్ల సంఖ్య‌ను పెంచుకోవ‌చ్చ‌ని చెబుతున్నారు. 2019 సార్వ‌త్రిక ఎన్నిక‌ల నాటికి అసెంబ్లీ సీట్ల సంఖ్య పెంచుకోవాలంటూ ఆర్టిక‌ల్ 170(3) కి స‌వ‌ర‌ణ చేయాల్సిందే. మ‌రి.. రాజ్యాంగ స‌వ‌ర‌ణ అంటే.. దేశంలోని స‌గం రాష్ట్రాలు సీట్ల పెంపు నిర్ణ‌యానికి ఆమోదం తెల‌పాలి. కానీ.. అలాంటి ఇబ్బంది ఎదురుకాకుండా ఉండేందుకు వీలుగా ప్లాన్ సిద్ధం చేసిన‌ట్లుగా తెలుస్తోంది.

తాజాగా న్యాయ‌శాఖ తీసుకున్న నిర్ణ‌యానికి స‌గం రాష్ట్రాలు ఆమోద‌ముద్ర వేయాల్సిన అవ‌స‌రం ఉండ‌దు. క్యాబినెట్ లో నిర్ణ‌యం తీసుకున్న త‌ర్వాత పార్ల‌మెంటులో బిల్లు పాస్ చేస్తే స‌రిపోతుందని చెబుతున్నారు. అయితే.. తాజా స‌వ‌ర‌ణ వ‌ల్ల ఇత‌ర‌త్రా ప్ర‌భావాలు ఏమైనా త‌లెత్తుతాయా? అన్న సందేహం నేప‌థ్యంలో.. వాటిని క్లియ‌ర్ చేసే బాధ్య‌త‌ను హోం శాఖ మీద పెట్టారు.

తాజాగా చోటు చేసుకున్న ప‌రిణామాలు చూస్తే..వ‌ర్షాకాల స‌మావేశాల స‌మ‌యానికి అసెంబ్లీ సీట్ల సంఖ్య పెంచేందుకు వీలుగా ఉండే బిల్లును పార్ల‌మెంటు ముందుకు తీసుకురావొచ్చ‌న్న అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది. అదే జ‌రిగితే.. 2019 సార్వ‌త్రిక ఎన్నిక‌ల వేళ‌కు.. చంద్రుళ్లు కోరుకున్న‌ట్లుగా తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ సీట్ల సంఖ్య‌ను పెంచుకునే వీలు ఉంటుంద‌ని చెప్పొచ్చు.

సీట్ల పెంపు విష‌యంలో హోం శాఖ ఓకే చెప్పేసిన త‌ర్వాత‌.. కేంద్ర ఎన్నిక‌ల సంఘం వ‌ద్ద‌కు విష‌యం వెళుతుంద‌ని.. అంత‌కు ముందే క్యాబినెట్ లో దీనిపై చ‌ర్చించి ఆమోద‌ముద్ర వేస్తార‌ని చెబుతున్నారు. అనంత‌రం పార్ల‌మెంటు ఆమోదం పొందేలా చ‌ర్య‌లు తీసుకుంటారు. రాజు త‌లుచుకుంటే వ‌రాల‌కు కొద‌వా? అన్న‌ట్లు.. శ‌క్తివంత‌మైన మోడీ ఆశీస్సులు ఉన్న‌ప్పుడు ఎలాంటి బిల్లు అయినా ఆమోద‌ముద్ర ప‌డ‌టం ఖాయ‌మ‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.