Begin typing your search above and press return to search.

ప్రభుత్వాలే కాదు పార్టీలు కూడా తోలుమందమేనా?

By:  Tupaki Desk   |   30 May 2016 4:47 AM GMT
ప్రభుత్వాలే కాదు పార్టీలు కూడా తోలుమందమేనా?
X
ప్రజాసేవ చేస్తామని.. కోట్లాది మంది ప్రజల బతుకుల్ని మార్చేస్తామంటూ మాటలు చెప్పి అధికారాన్ని సొంతం చేసుకొని పాలించటం తెలిసిన కథే. ఎన్నికల సమయంలో పార్టీ అధినేతలు చెప్పే మాటలకు.. తర్వాతి కాలంలో వారు అధికారంలోకి వచ్చాక చేసే పనులకు ఎక్కడా పొంతన ఉండదన్న విషయం తెలిసిందే. ప్రజలు ఎదుర్కొనే విషయాలపై స్పందించే విషయంలో ప్రభుత్వాలు తోలు మందంగా వ్యవహరిస్తాయన్న విమర్శ ఎంతోకాలంగా ఉన్నదే.

రాజకీయ పార్టీలు ఇన్ని ఉన్నా.. రాజకీయ నేతలు ఎంతోమంది ఉన్న.. ప్రజల బతుకుల్ని సమూలంగా మార్చిన వైనం ఒక్కటి కూడా కనిపించదు. ఏదైనా అంశంపై సమాచార హక్కు ద్వారా దస్త్రం పెట్టుకుంటే వాటికి స్పందించే గుణం ప్రభుత్వాలకు తక్కువే. తమకు ఇబ్బంది లేని సమాచారాన్ని ఇచ్చేందుకు సుముఖంగా ఉండే ప్రభుత్వాలు.. తమకు ఇబ్బంది కలిగించే వాటి విషయంలో మాత్రం కరుకుగానే ఉండటం తెలిసిందే.

అయితే.. ఇలాంటి వైఖరి ప్రభుత్వాల్లోనే కాదు.. పార్టీల్లోనూ ఎక్కువేనన్న విషయం తాజా ఉదంతం స్పష్టం చేస్తోంది. రాజకీయ పార్టీలకు వచ్చే నిధులు.. వాటి పనితీరు.. పార్టీకి సంబంధించిన పలు అంశాలకు సంబంధించి ప్రజలకు వచ్చే సందేహాల్ని తీర్చుకోవటానికి అడిగే ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చే విషయంలో సానుకూలంగా స్పందించకపోవటంపై తాజాగా కేంద్ర సమాచార కమిషన్ నోటీసులు జారీ చేయటం ఆసక్తికరంగా మారింది.

ఈ నోటీసులు జారీ అయిన పార్టీలు చూస్తే.. కేంద్రంలో కొలువు తీరి.. దేశ ప్రజల జీవితాల్ని మొత్తంగా మార్చేస్తున్నట్లుగా ప్రచారం చేస్తున్న ప్రధాని మోడీకి చెందిన బీజేపీ.. అధికార పార్టీని నిత్యం విమర్శలతో టార్గెట్ చేసే కాంగ్రెస్ పార్టీలు దొందూ దొందేనన్న విషయం తాజాగా మరోసారి తేలింది. ఈ రెండు పార్టీలతో పాటు.. ఎన్ సీపీ.. బీఎస్ పీ.. సీపీఎం.. సీపీఐలు ఈ జాబితాలో ఉండటం గమనార్హం. సమాచార హక్కు చట్టం కింద అడిగిన ప్రశ్నకు సమాధానం ఇవ్వని ఈ ఆరు పార్టీ అధినేతలకు కేంద్ర సమాచార కమిషన్ తాజాగా నోటీసులు జారీ చేయటం గమనార్హం.