Begin typing your search above and press return to search.

ఢిల్లీ టూ పోలవరం... గజేంద్ర మోక్షమేనా... ?

By:  Tupaki Desk   |   2 March 2022 5:30 PM GMT
ఢిల్లీ టూ పోలవరం... గజేంద్ర మోక్షమేనా... ?
X
ఎనభైఏళ్ల కల, రెండు దశాబ్దాల నిర్మాణ చరిత్ర కలిగిన పోలవరం ప్రాజెక్ట్ విషయంలో కేంద్రం ఇక జోరు చేయనుంది అంటున్నారు. ఇంతకాలం పోలవరం విషయంలో రాష్ట్ర పెద్దలు ఢిల్లీ వెళ్ళి చెప్పి రావడం, అధికారుల స్థాయిలో సమీక్షలు మాత్రమే ఉండేవి.

అయితే ఇపుడు జల శక్తి వనరుల శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ నేరుగా పోలవరానికి రానున్నారు. ఈ నెల 4న ఆయన గ్రౌండ్ లెవెల్ రియాలిటీస్ ని స్వయంగా తెలుసుకోవడానికి, అక్కడ పరిస్థితులు పరిశీలించడానికి ఢిల్లీ టూ పోలవరం డైరెక్ట్ గానే ల్యాండ్ అవుతున్నారు.

ఈ సందర్భంగా కొన్ని గంటల సేపు ఆయన పోలవరం ప్రాజెక్ట్ పరిసరాలలో గడుపుతున్నారు. ప్రతీ అంశాన్ని ఆయన జాగ్రత్తగా గమనించడమే కాకుండా ఎక్కడ ఏమేమిటి ఇప్పటిదాకా జరిగాయి అన్న దాని మీద్ ఫుల్ ఫోకస్ పెట్టనున్నారు.

ఇప్పటిదాకా అయిన వర్క్స్, వాటికి పెట్టిన ఖర్చు, ఇంకా ఎంత నిర్మాణం జరగాలి. అయ్యే ఖర్చు అంచనాలు ఏంటి అన్న దాని మీద ఫుల్ క్లారిటీ కోసమే గజేంద్ర సింగ్ పోలవరం వస్తున్నారు అని అంటున్నారు.

ఇప్పటికి మూడేళ్ళుగా జగన్ కేంద్రంలోని పెద్దల వద్దకు వెళ్లి 2018లో సవరించిన అంచనాల మేరకు 55 వేల కోట్ల రూపాయలను ఇవ్వాలని కోరుతూ వస్తున్నారు. అయితే కేంద్రం మాత్రం 2014 నాటి అంచనాలే పరిమితం అవుతామని చెబుతూ వస్తోంది. అలాగైతే నిర్వాసితుల సమస్యలు అలాగే ఉంటాయని రాష్ట్రం అంటోంది, ఇంకో వైపు చూస్తే పోలవరం ప్రాజెక్ట్ ఈ తీరున ఎప్పటికి పూర్తి అయ్యేనూ అన్న చర్చ కూడా సాగుతోంది

ఇవన్నీ ఇలా ఉండగానే సడెన్ గా సంబంధిత మంత్రిగా గజేంద్ర సింగ్ పోలవరానికి రావాలనుకోవడం పైన సర్వత్రా ఆసక్తి కనిపిస్తోంది. ఈ టూర్ తరువాత కేంద్రం ఏం చేస్తుంది అన్న చర్చ కూడా ఉంది. కేంద్రం కనుక ప్రాజెక్ట్ ని పూర్తిగా పరిశీలించి అంచనాలను కూడా పూర్తిగా లెక్క వేసుకుని రాష్ట్రం కోరినట్లుగా 55 వేల కోట్లకు ఓకే చెబుతుందా అన్న మాట కూడా ఉంది.

అదే సమయంలో కేంద్రం పోలవరాన్ని తొందరగా పూర్తి చేసి ఏపీకి తాము చేసినది చూపించుకోవాలన్న తాపత్రయంతో ఉంది అంటున్నారు. అందువల్లనే ఉన్న ఉదుటన గజేంద్ర సింగ్ షెడ్యూల్ పెట్టుకుని మరీ ఈ వైపుగా వస్తున్నారు అని తెలుస్తోంది. వచ్చే రెండేళ్ళలో ఏపీకి, కేంద్రానికి కూడా ఎన్నికలు ఉన్నాయి.

ఏపీకి జీవనాడి లాంటి పోలవరాన్ని తామే పూర్తి చేశామని చెప్పుకోవడం ద్వారా పొలిటికల్ మైలేజ్ కోసం బీజేపీ సవరించిన అంచనాలు ఆమోదించినా ఆశ్చర్యం లేదు అంటున్నారు.

మొత్తానికి గజేంద్ర సింగ్ టూర్ మాత్రం ఉత్కంఠను రేపుతోంది. ఆయన వెంట జగన్ కూడా పోలవరానికి వస్తున్నారు. మొత్తానికి అన్నిరకాలుగా నిధుల కేటాయింపు కోసం కేంద్ర ప్రభుత్వానికి తాము చేసిన విజ్ఞప్తులు, పెట్టిన ఒత్తిళ్లు ఫలించినట్టే కనిపిస్తున్నాయని వైసీపీ నేతలు అంటున్నారు. చూడాలి మరి ఏం జరుగుతుందో.