Begin typing your search above and press return to search.

కేంద్ర మంత్రి పదవి బీజేపీకా? టీడీపీకా?

By:  Tupaki Desk   |   19 July 2017 5:11 AM GMT
కేంద్ర మంత్రి పదవి బీజేపీకా? టీడీపీకా?
X
మరో రెండేళ్లలో లోక్‌ సభ ఎన్నికలను ఎదుర్కోవాల్సి ఉన్నందున ప్రధాని మోడీ అందుకోసం తన టీంలో మార్పులు చేర్పులు చేయనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుత పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ముగిసిన వెంటనే ఈ మార్పులకు అవకాశం ఉంది. వచ్చేనెల 11వ తేదీన పార్లమెంటు సమావేశాలు ముగుస్తాయి. ఆ తర్వాత ఏక్షణాన్నయినా కేంద్ర మంత్రివర్గ విస్తరణ జరగొచ్చని తెలుస్తోంది.

నిజానికి కేంద్ర మంత్రివర్గాన్ని ఎప్పుడో విస్తరించాల్సింది. కేంద్ర రక్షణ మంత్రిగా ఉన్న మనోహర్‌ పారికర్‌ గత ఏప్రిల్‌ లో ఆ పదవికి రాజీనామా చేసి గోవా ముఖ్య మంత్రిగా వెళ్లారు. అప్పటి నుంచి ఆర్ధిక మంత్రి అరుణ్‌ జైట్లీయే రక్షణ శాఖను కూడా అదనంగా నిర్వహి స్తున్నారు. ఆర్ధికమంత్రిగా సంస్కరణల పురోగతి మీద ఎక్కువగా దృష్టి సారించాల్సి రావడం..పెద్ద నోట్ల రద్దుతో వచ్చిన ఇబ్బందుల్ని అధిగమించే కసరత్తులో బిజీగా ఉండటం..కొత్తగా జీఎస్టీ పన్ను వ్యవస్ధను దేశవ్యాప్తంగా అమల్లోకి తేవడం.ఇలా అనేక కారణాల వల్ల ఆర్ధికమంత్రి మీద పని ఒత్తిడి పెంచతగదని ప్రధాని మోడీ భావిస్తున్నట్టు చెబుతున్నారు. మరోవైపు సరిహద్దుల్లో నిత్యం కలహాలు రేగుతుండడంతో రక్ణణ శాఖకు ప్రత్యేకంగా ఓ మంత్రి అవసరం.

కాగా పర్యావరణ మంత్రిగా ఉన్న అనిల్‌ దవే చనిపోవడం తో ఆ శాఖను సెన్స్‌ టెక్నాలజీ శాఖ మంత్రి హర్షవర్ధన్‌ కు అంటగట్టారు. తాజాగా వెంకయ్య నాయుడు ఉపరాష్ట్రపతి కాబోతు న్నందున ఆయన కేంద్ర కేబినెట్‌ నుంచి బైటికి రావాల్సి వచ్చింది. ఆయన కేవలం సమాచార - ప్రసారాల శాఖనే కాకుండా అర్బన్‌ డెవలప్‌ మెంట్‌ - హౌసింగ్‌ - పట్టణ పేదరిక నిర్మూలన శాఖలను కూడా నిర్వహించారు. ఈ రెండు శాఖలకు కొత్త వారిని ఎంపిక చేయాల్సి ఉంటుంది.

అలాగే సూక్ష్మ - చిన్న - మధ్యతరహా పరిశ్రమల శాఖ మంత్రి కల్‌ రాజ్‌ మిశ్రా వయో భారంతో ఇబ్బంది పడుతున్నారు. ఆయనకు 75 ఏళ్లు దాటాయి. మొన్న మొన్నటిదాకా ఉత్తరప్రదేశ్‌ అసెంబ్లి ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఆయన్ని తప్పించే ప్రయత్నాలు చేయలేకపోయినట్టు తెలుస్తోంది. ఇప్పుడిక ఆయన్ని తప్పించి ఏదైనా రాష్ట్రానికి గవర్నర్‌ గా పంపే ఆలోచన చేస్తున్నట్టు చెబుతున్నారు. వచ్చే డిసెంబర్ లో హిమాచల్‌ ప్రదేశ్‌ అసెంబ్లి ఎన్నికల్లో గనక బీజేపీ గెలిస్తే కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డాను ముఖ్యమంత్రిగా పంపే అవకాశాలున్నట్టు తెలుస్తోంది. ఇదే జరిగితే మరో ఖాళీ ఏర్పడుతుంది.

ఈ నేపథ్యంలో అప్పుడే బీజేపీ - మిత్ర పక్షాల ఎంపీలు మంత్ర పదవులపై ఆశలు పెంచుకుంటున్నారు. వెంకయ్యనాయుడు ఏపీకి చెందినవారు కావడంతో ఆయన స్థానంలో ఏదో ఒక మంత్రి పదవి దక్కించుకోవాలని ఏపీ నేతలు ప్రయత్నాలు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. మరి... ఆయన ప్లేసులోకి బీజేపీ నేతలు వస్తారో టీడీపీ నేతలు వస్తారో చూడాలి.