Begin typing your search above and press return to search.

మోడీ 'ఘన' కార్యాన్నిపార్లమెంటు సాక్షిగా చెప్పిన కేంద్ర మంత్రి

By:  Tupaki Desk   |   26 July 2022 4:44 AM GMT
మోడీ ఘన కార్యాన్నిపార్లమెంటు సాక్షిగా చెప్పిన కేంద్ర మంత్రి
X
నేను కానీ దేశ ప్రధానమంత్రిని అయితేనా? అంటే చెప్పిన మాటను చెప్పకుండా చెప్పి.. ప్రధాని కుర్చీలో కూర్చున్న నరేంద్ర మోడీ.. తన ఎనిమిదేళ్ల కాలంలో ఏమేం చేశారో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. వివిధ అంశాలకు సంబంధించి ఆయన్ను కొందరు ఒకలా.. మరికొందరు ఇంకోలా అభివర్ణిస్తుంటారు. కానీ.. పెట్రోల్.. డీజిల్ ధరల పెంపు మీద మాత్రం ఆయన సర్కారు తీసుకున్న నిర్ణయాల్ని మాత్రం వాళ్లు.. వీళ్లు అన్న తేడా లేకుండా తప్పు పట్టేశారు. ఈ విషయంలోనూ కొందరు అతిగాళ్లు.. ధరల వాయింపు అంశంలోకి దేశభక్తిని తీసుకొచ్చి.. మోడీ భక్తులు ఏ రీతిలో ఉంటారన్న విషయాన్ని చెప్పకనే చెప్పేస్తుంటారు.

ఇలాంటి వారంతా మర్చిపోయే విషయం ఏమంటే.. ఇదే మోడీ తాను ప్రధానమంత్రి కావటానికి ముందు సోషల్ మీడియాలోనూ.. వాట్సాప్ గ్రూపుల ద్వారా అందరికి ప్రచారం చేసిన అంశం ఒకటుంది. అదేమంటే.. ప్రధానిగా మోడీ బాధ్యతలు చేపడితే.. లీటరు పెట్రోల్ రూ.50.. డీజిల్ ధరల్ని అంతకు మరింత తక్కువగా చేయటం ద్వారా దేశ ప్రజలకు కానుక ఇస్తారని.. అలాంటి అద్భుతాన్ని చూడాలంటే ప్రధానమంత్రి కుర్చీలో నరేంద్ర మోడీ కూర్చోవాలంటూ చెప్పిన మాటలు అన్ని ఇన్ని కావు.

చెప్పే మాటలకు.. చేసే పనులకు ఏ మాత్రం సంబంధం ఉండదన్న విషయాన్ని ఫ్రూవ్ చేస్తూ.. పెట్రోల్.. డీజిల్ ధరల విషయంలో మోడీ సర్కారు ఏ రీతిలో పని చేసిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మోడీ సర్కారు పుణ్యమా అని దేశ చరిత్రలో తొలిసారి లీటరు పెట్రోల్.. డీజిల్ ధరలు రూ.వందను దాటేశాయి. ఇప్పుడంటే డీజిల్ ధరల్ని వందకు కాస్త తక్కువగా కొన్ని రాష్ట్రాల్లో ఉన్నప్పటికీ.. ఆకాశమే హద్దుగా దూసుకెళుతున్న వైనం మాత్రం అందరికి పెను భారంగా మారిందని మాత్రం చెప్పక తప్పదు.

మోడీకి ముందు ప్రధానమంత్రికుర్చీలోకూర్చున్న వారంతా తమ పదవీ కాలమైన ఐదేళ్లలో పెట్రోల్.. డీజిల్ ధరల్ని పెంచే అంశంలో డబుల్ డిజిట్ కూడా దాటని పరిస్థితి ఉంటుంది. కానీ.. మోడీ మాష్టారు డైలీ బేసిస్ లో పెట్రోల్.. డీజిల్ ధరల్ని పెంచే కొత్త విధానాన్ని తెర మీదకు తీసుకురావటం తెలిసిందే. అయితే.. ఏదైనా రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరిగితే మాత్రం.. ఆ మూడు.. నాలుగునెలల వరకు ధరలు పెంచకుండా జాగ్రత్తలు తీసుకోవటం కనిపిస్తుంది.

అలాంటి మోడీ సర్కారు ఏడాది వ్యవధిలో పెట్రోల్.. డీజిల్ ధరల్ని ఎన్నిసార్లు పెంచి ఉంటుందన్న ఆసక్తికర ప్రశ్నను సంధించారు. దీనికి తాజాగా జరుగుతున్న పార్లమెంటు సమావేశాల్లో కేంద్రమంత్రి తేలి లిఖిత పూర్వక సమాధానాన్ని ఇచ్చారు. ఏడాది వ్యవధిలో పెట్రోల్ ధరను 78 సార్లు.. డీజిల్ ధరను 76 సార్లు పెంచినట్లుగా పేర్కొన్నారు. కాకపోతే.. దీన్ని కేంద్రం పెంపుగా కాకుండా ఆయిలో మార్కెటింగ్ కంపెనీలు పెంచినట్లుగా పేర్కొన్నారు. 2021-22 ఆర్థిక సంవత్సరంలో పెట్రోల్ ధరను 78 సార్లు పెంచితే.. ఏడు సార్లు తగ్గించారని.. అదేసమయంలో డీజిల్ ధరను 76 సార్లు పెంచితే.. 10సార్లు తగ్గించినట్లుగా వెల్లడించారు.

2017 జూన్ 16 నుంచి రోజువారీ ధరల సవరణ విధానం అమల్లోకి వచ్చినట్లు పేర్కొన్నారు. అయితే.. గత ఆర్థిక సంవత్సరంలో పెట్రోల్ ధరలు 280 రోజులు.. డీజిల్ ధరలు 279 రోజులు స్థిరంగా ఉన్నట్లు పేర్కొన్నారు. అయితే.. ఈ ధరలు స్థిరంగా ఉండటానికి కారణం.. పలు రాష్ట్రాల్లో జరిగే ఎన్నికలుగా చెబుతున్నారు. ఏమైనా.. పార్లమెంటు సాక్షిగా.. మోడీ సర్కారు హయాంలో చమురు సంస్థలు దేశ ప్రజల్ని బాదేసిన బాదుడు రేంజ్ ఏమిటో చెప్పారని చెప్పక తప్పదు.