Begin typing your search above and press return to search.

కిలో బియ్యానికి రూ.29 ఎవరిస్తున్నారు కేసీఆర్?

By:  Tupaki Desk   |   18 Jun 2016 6:45 AM GMT
కిలో బియ్యానికి రూ.29 ఎవరిస్తున్నారు కేసీఆర్?
X
మంచి జరిగితే అది తమ ఖాతాలోకి.. చెడు జరిగితే ప్రత్యర్థి ఖాతాలో వేయటం రాజకీయాల్లో సహజమే. ఈ తీరుతో వ్యవహరిస్తున్న రాష్ట్రాలపై కేంద్రం కాస్త సీరియస్ గా ఉన్నట్లు కనిపిస్తోంది. కేంద్రం ఇచ్చే నిధుల్ని వినియోగించుకుంటూనే.. తమకు ఎలాంటి సాయం అందటం లేదంటూ చేస్తున్న కొన్ని రాష్ట్రాల తీరు మీద మోడీ సర్కారులోని మంత్రులు కొందరు టార్గెట్ చేసినట్లుగా కనిపిస్తోంది. దీనికి తగ్గట్లే తాజాగా చోటు చేసుకుంటున్న పరిణామాలే నిదర్శనం.

తెలంగాణ రాష్ట్రానికి తాము చాలానే చేస్తూన్నా.. ఏమీ చేయటం లేదంటున్న మాటను తిప్పి కొట్టేందుకు వీలుగా కేంద్రమంత్రులు గళం విప్పుతున్నారు. ఇందులో భాగంగా పలు వాస్తవిక అంశాల్ని తెరపైకి తీసుకొచ్చారు. కేంద్రంలో భాగస్వామి కాకున్నా.. అవసరానికి అనుగుణంగా కేంద్రం నుంచి ఎక్కువ సాయమే పొందుతూ కూడా.. కేంద్రంపై ఒంటికాలిపై విరుచుకుపడే వైఖరి కేసీఆర్ సర్కారుకు కాస్త ఎక్కువన్న భావన కేంద్రానికి ఉన్నట్లుగా చెబుతున్నారు. అందుకే అలాంటి వారి వైఖరిని ప్రశ్నించటంతో పాటు.. తెలంగాణ సర్కారు చేసే వాదనల్లో ఎక్కువ భాగంగా రాజకీయమే తప్పించి నిజాలు ఉండవన్నట్లుగా కేంద్రమంత్రుల చెబుతున్న మాటలు ఉంటున్నాయి. ఇటీవల కాలంలో ఒకరికి ముగ్గురన్నట్లుగా కేంద్రమంత్రులు టీఆర్ ఎస్ సర్కారుకు తాము అందిస్తున్న సహాయ సహకారాల్ని చెప్పుకురావటం గమనార్హం.

తాజాగా కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు మాట్లాడుతూ.. తెలంగాణప్రభుత్వం పేదలకు అందిస్తున్న కేజీ రూపాయి బియ్యం పథకానికి కేంద్రం అందిస్తున్న సాయాన్ని గుర్తు చేశారు. పేద ప్రజలకు ఇచ్చే బియ్యం కోసం కేంద్రం కిలోకు రూ.29 చొప్పున ఇస్తుందని.. ఈ విషయం ఎవరికి తెలుసని ప్రశ్నించారు. వెంకయ్య నోటి నుంచే కాదు.. ఇదే తరహా మాట మరి కొందరు కేంద్రమంత్రుల నోటి నుంచి రావటం గమనార్హం.

మరోవైపు కేంద్ర ఆరోగ్య మంత్రి జేపీ నడ్డా తెలంగాణ ప్రభుత్వానికి తాజాగా ఒక లేఖ రాశారు. నేషనల్ హెల్త్ మిషన్ కింద కేంద్రం ప్రతి ఏటా రాష్ట్రానికి నిధులు సమకూరుస్తున్నప్పటికీ తెలంగాణ ప్రభుత్వం ఆ నిధుల్ని వినియోగించుకోవటం లేదని ఆరోపించింది. గడిచిన రెండేళ్ల వ్యవధిలో కేంద్రం ఇచ్చిన నిధుల్ని తెలంగాణ ప్రభుత్వం ఖర్చుచేయలేదన్న విషయాన్ని గుర్తు చేసింది. గత ఏడాది విడుదల చేసిన నిధుల్లో ఇప్పటికి రూ.458 కోట్లు మిగిలే ఉన్నాయన్న విషయాన్ని ప్రస్తావిస్తూ నడ్డా లేఖ రాయటం విశేషం.

ఇదిలా ఉంటే.. కేసీఆర్ కు మాంచి దోస్త్ అయిన కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ అయితే.. తన స్నేహితుడి కుమారుడు.. మంత్రి కేటీఆర్ కు తనదైన శైలిలో చురకలు అంటించారు. కేంద్రం సాయం చేయటం లేదన్న కేటీఆర్ మాటల్ని బలంగా తిప్పి కొట్టారు. ఐటీఐఆర్ ప్రాజెక్టు నిలిచిపోయిందంటూ మంత్రి కేటీఆర్ మాటల్లో నిజం లేదన్న దత్తాత్రేయ వాస్తవాలు తెలుసుకొని మాట్లాడాలంటూ.. ‘‘ఈ ప్రాజెక్టుకు సంబంధించిన డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ ఇప్పటివరకూ కేంద్రానికి అందలేదు. ఈ ప్రాజెక్టుకు 2014-15 బడ్జెట్ లో రూ.90 కోట్లు కేటాయించినట్లుగా తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. ఆ నిధుల్ని ఖర్చు చేయలేదు. ఈ ప్రాజెక్టుకు కేంద్ర సహకారం ఉంటుంది. ఈ అంశంపై ఢిల్లీకి వచ్చి మాట్లాడానికి సిద్ధమైతే మాట్లాడటానికి సిద్ధంగా ఉన్నాం’’ అంటూ తిప్పి కొట్టే ప్రయత్నం చేశారు. ఇలా వాస్తవాలతో విరుచుకుపడుతున్న కేంద్రమంత్రుల మాటలు వెనువెంటనే కేసీఆర్ సర్కారు మీద ప్రభావం చూపించకున్నా.. ప్రజల మనసుల్లో రిజిష్టర్ అవుతాయన్న విషయాన్ని మర్చిపోకూడదు.