Begin typing your search above and press return to search.

నో రిజల్ట్ : ఢిల్లీలో మళ్లీ డ్రామా మాటలు!

By:  Tupaki Desk   |   24 Nov 2017 3:58 AM GMT
నో రిజల్ట్ : ఢిల్లీలో మళ్లీ డ్రామా మాటలు!
X
తెలుగు రాష్ట్రాలకు సంబంధించినంత వరకు విభజన చట్టం కొన్ని ప్రత్యేక వెసులుబాటులను కల్పించింది. సాక్షాత్తూ పార్లమెంటు ఆమోదించిన చట్టం సాక్షిగా ఈ రెండు రాష్ట్రాలకు కొన్ని ప్రత్యేక ఏర్పాట్లు జరిగాయి. అయితే వాటిని అమలు చేయడంలో మాత్రం.. కేంద్రం రకరకాల డ్రామాలు ఆడుతోంది. కీలకమైన కొన్ని కేటాయింపుల విషయంలో వారు నాన్చివేత ధోరణి అవలంబిస్తున్నా ప్రత్యేకించి ఏపీ సర్కారు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నదనే ఆరోపణలు ఉన్నాయి. అయితే ప్రజల ముందు ఆ ప్రస్తావన వచ్చినప్పుడు మాత్రం ఏవో పడికట్టు మాటలతో పబ్బం గడిపేస్తున్నారు. కడప ఉక్కు పరిశ్రమ విషయంలోనూ ఏపీ అలాంటి బుకాయింపులకే పాల్పడుతున్నట్లు కనిపిస్తోంది.

కడపలో జాతీయ ఉక్కు కర్మాగారం అనేది విభజన చట్టం సాక్షిగా ఇచ్చిన హామీ. అయితే.. దాని అమలు విషయంలో కేంద్రం నిర్లక్ష్యం వహించింది. వారిలో కదలిక తీసుకురావడానికి తెలుగుదేశం సర్కారు కూడా ప్రయత్నించలేదు. కేంద్రలోని పెద్దలు.. ఫీజిబిలిటీ రిపోర్టులు నెగటివ్ గా ఉన్నాయని.. కడపలో ఉక్కు పరిశ్రమ వచ్చే అవకాశం లేదని తిరస్కారంగా మాట్లాడినా కూడా.. కొన్ని వేల మందికి ఉపాధి కల్పించే ఈ పరిశ్రమ గురించి.. పోరాడి సాధించుకోవాల్సిన అగత్యాన్ని సర్కారు పట్టించుకోలేదు.

అదే సమయంలో.. బయ్యారంలో ఉక్కు పరిశ్రమ గురించి.. తెలంగాణ సర్కారు ఒక రేంజిలో ప్రయత్నాలు ప్రారంభించింది. ఎట్టి పరిస్థితుల్లోనూ బయ్యారం ఉక్కు పరిశ్రమను సాధించడానికి మంత్రి కేటీఆర్ ఢిల్లీ చుట్టూ తిరుగుతున్నారు. ఈ నేపథ్యంలో మరోసారి కేంద్రంనుంచి బుకాయింపు మాటలు వినిపిస్తున్నాయి. ఈ రాష్ట్రాలకు చెందిన నేతలు వచ్చి తమను కలిసినప్పుడు మాత్రం.. ఏదో చేసేస్తున్నట్లుగా మాటలు చెప్పడం.. హామీలు గుప్పించడం ఆ తర్వాత.. వారి వ్యవహారాన్ని విస్మరించడం అనేది.. కేంద్రంలోని పెద్దలకు అలవాటుగా మారిపోయింది. ఏపీ నాయకులు కూడా కడప ఉక్కు పరిశ్రమగురించి అంత సీరియస్ గా పట్టించుకోవడం లేదనే విమర్శలూ ఉన్నాయి. ఏదో ఢిల్లీ వెళ్లినప్పుడు జనాంతికంగా ఓ మాట ప్రస్తావించడం మినహా గట్టి ప్రయత్నాలు జరగడం లేదని ఆరోపణలున్నాయి. ఆక్రమంలో భాగంగా.. తాజాగా మళ్లీ ఇవే డ్రామా తరహా హామీలు ఢిల్లీనుంచి వినిపిస్తునాయి. కడప, బయ్యారం గురించి అధ్యయనం చేస్తున్నాం.. నివేదికలను బట్టి నిర్ణయాలు తీసుకుంటాం.. అంటూ అటూ ఇటూ కాని కంటితుడుపు మాటలతో కాలం వెళ్లబుచ్చుతున్నారు.