Begin typing your search above and press return to search.

మమతను వెంటాడుతున్న కేంద్రం

By:  Tupaki Desk   |   31 Aug 2022 6:33 AM GMT
మమతను వెంటాడుతున్న కేంద్రం
X
ఏదో పద్దతుల్లో ఏదో కారణాలు చెప్పి ప్రత్యర్ధులను వెంటాడటమే నరేంద్రమోడీ సర్కార్ టార్గెట్ గా పెట్టుకున్నట్లుంది. తాజాగా పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జీ మేనల్లుడు, ఎంపీ అభిషేక్ బెనర్జీకి మరోసారి ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) విచారణకు హాజరుకావాలని నోటీసులిచ్చింది. అభిషేక్ తో పాటు ఆయన మరదలు మేనకాగంభీర్ కు కూడా ఈడీ నోటీసులివ్వటం సంచలనంగా మారింది. ముందేమో అభిషేక్ తో పాటు ఆయన భార్యకు నోటీసులిచ్చి విచారించింది. ఇపుడేమో ఆయన మరదలికి కూడా నోటీసులిచ్చింది.

బొగ్గు చోరీ , అక్రమరవాణా ఆరోపణలపై ఇప్పటికే అభిషేక్ ను ఈడీ, సీబీఐ చాలాసార్లు విచారించాయి. ఒకేకేసులో ఇంకాఎంతకాలం ఈ ఎంపీని దర్యాప్తుసంస్ధలు విచారిస్తాయో అర్ధంకావటంలేదు. నరేంద్రమోడీకి మమతకు మధ్య సంబంధాలు ఉప్పునిప్పులాగ తయారైందన్న విషయం అందరికీ తెలిసిందే. వచ్చే ఎన్నికల్లో ఎన్డీయేని ఎలాగైనా ఓడించాలన్న పట్టుదలతో మమత నాన్ ఎన్డీయే పార్టీలన్నింటినీ ఏకతాటిపైకి తీసుకురావాలని ప్రయత్నిస్తున్నారు.

ఇదే సమయంలో మమత ప్రభుత్వాన్ని ఎలాగైనా సరే కూల్చేయాలని బెంగాల్ బీజేపీ తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. తన ప్రభుత్వాన్ని కూల్చటం బీజేపీ వల్ల కాదుకాబట్టే దర్యాప్తుసంస్ధలను రంగంలోకి దింపినట్లుగా మోడీపై మమత మండిపోతున్నారు.

దర్యాప్తుసంస్ధలను అడ్డంపెట్టుకుని విచారణలపేరుతో తమను వేధించటమే టార్గెట్ గా పెట్టుకున్నట్లు మమత ఆరోపించారు. ఇంతకీ అభిషేక్ పై బీజేపీ ఎందుకు ఇంతగా దృష్టిపెట్టిందంటే ఆయన తృణమూల్ ఎంపీ కావటం మాత్రమే కాదు. స్వయానా మమతకు మేనల్లుడు అవ్వటంతో పాటు మొత్తం పార్టీవ్యవహారాలను ఆయనే చూస్తున్నారు.

బెంగాల్లో బీజేపీని అధికారంలోకి రాకుండా అభిషేక్ గట్టిగా అడ్డుకుంటున్నారు. ఇందుకనే మమతకు గట్టి మద్దతుదారులుగా ఉన్న అభిషేక్ తో పాటు అలాంటి మరికొందరిపై దర్యాప్తు సంస్ధలు దృష్టిపెట్టి వేధింపులకు గురిచేస్తున్నట్లు ఆరోపణలు పెరిగిపోతున్నాయి.

నిజంగానే ఎవరైనా అవినీతికి పాల్పడుంటే వాళ్ళపైన చర్యలు తీసుకోవాల్సిందే. కానీ విచారణల పేరుతో సంవత్సరాలుగా వేధింపులకు గురిచేయటం మాత్రం తప్పు. అలాగే అలాంటి ఆరోపణలనే ఎదుర్కొంటున్న తమ పార్టీలోని వారిని పట్టించుకోకపోవటం ఇంకా తప్పు. మోడీ సర్కార్ రెండు తప్పులనూ చేస్తున్నది. అందుకనే దేశంలో ఇంత గోల పెరిగిపోతోంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.