Begin typing your search above and press return to search.

ఆ పెద్ద మనిషి తెలంగాణకు ఎందుకు వస్తున్నాడు?

By:  Tupaki Desk   |   26 Jun 2020 7:00 PM IST
ఆ పెద్ద మనిషి తెలంగాణకు ఎందుకు వస్తున్నాడు?
X
ఊరికే రారు మహానుభావులు అంటూ గతంలో ఒక సామెతను తరచూ వాడేవారు. డిజిటల్ యుగంలో ఆ మాటను గుర్తు చేసుకునేటోళ్లు పెద్దగా కనిపించరు. కొంతమంది ఊరికే రారు. వారు వచ్చారంటే ఏదో ఒక కారణం ఉంటుంది. కొంతమంది రావటం మంచి పరిణామం అయితే.. మరికొందరు రావటం మాత్రం అందుకు భిన్నమైన పరిస్థితి. మహమ్మారి దేశానికి వచ్చిన నాటి నుంచి ఒక పెద్ద మనిషి దేశ ప్రజలకు సుపరిచితులయ్యారు.

ఆయన ఎవరో కాదు.. కేంద్ర వైద్య ఆరోగ్య శాఖసంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్. తరచూ ప్రెస్ మీట్లలో కనిపించే ఆయన చాలా తక్కువ వ్యవధిలోనే సామాన్యులకు పరిచయస్తుడిగా మారిపోయారు. తరచూ ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి.. తాజా పరిస్థితి గురించి వివరిస్తుంటారు.

అలాంటి ఆయన తాజాగా దేశంలోని మూడు రాష్ట్రాల్లో పర్యటించేందుకు షెడ్యూల్ సిద్ధం చేసుకున్నారు. ఈ నెల 26 నుంచి 29 వరకు అంటే.. మూడు రోజుల పాటు ఆయన మహారాష్ట్ర.. గుజరాత్.. తెలంగాణలో పర్యటించనున్నారు. ఈ మూడు రాష్ట్రాల్లో కామన్ గా కనిపించే అంశం.. పాజిటివ్ కేసులుపెద్ద ఎత్తున నమోదు కావటంగా చెప్పాలి.

కేసుల తీవ్రత ఎక్కువగా ఉన్న రాష్ట్రాల్లో పర్యటించటం.. అక్కడ తీసుకుంటున్నచర్యల్ని పరిశీలిస్తారు. కట్టడికి చేపట్టాల్సిన చర్యల్ని.. అవసరమైన సలహాల్ని ఇస్తారు. ఇదంతా చూస్తున్నప్పుడు.. మాయదారి రోగాన్ని మొదట్లో అద్భుతంగా కట్టడి చేసినట్లుగా పేరు ప్రఖ్యాతుల్ని సొంతం చేసుకున్న కేసీఆర్ సారు.. తాజాగా అందుకు భిన్నమైన పరిస్థితిని ఎదుర్కొంటున్నారని చెప్పక తప్పదు.