Begin typing your search above and press return to search.

వాయిదాలపై వడ్డీ ...ఆర్బీఐ, కేంద్రానికి సుప్రీం నోటీసులు !

By:  Tupaki Desk   |   26 May 2020 11:50 AM GMT
వాయిదాలపై వడ్డీ  ...ఆర్బీఐ, కేంద్రానికి సుప్రీం నోటీసులు !
X
కేంద్ర ప్రభుత్వం, ఆర్‌బీఐకి సుప్రీంకోర్టు మంగళవారం నోటీసులు జారీ చేసింది. మహమ్మారి కారణంగా విధించిన లాక్ డౌన్ తో రుణ వాయిదాల(ఈఎంఐ)పై కేంద్ర ప్రభుత్వం మారటోరియం విధించిన సంగతి తెలిసిందే. అయితే, ఈ మారటోరియం సమయంలో పేరుకుపోయిన రుణ వాయిదాల పై బ్యాంకులు వడ్డీని వసూలు చేయడాన్ని సవాల్‌ చేస్తూ దాఖలైన పిటిషన్ ‌పై సుప్రీం నోటీసులిచ్చింది.

ఈఎంఐల చెల్లింపుపై మారటోరియంను ఆగస్ట్‌ 31 వరకూ ఆర్‌ బీఐ పొడిగించిన తర్వాత, ఈ పిటిసన్‌ దాఖలైంది. ఆర్ ‌బీఐ తొలుత రుణ వాయిదాల చెల్లింపుపై మూడు నెలల మారటోరియం ప్రకటించి మరో మూడు నెలల పాటు పొడిగించిందని పిటిషనర్‌ తరపు వాదనలు వినిపించిన సీనియర్‌ అడ్వకేట్‌ రాజీవ్‌ దత్తా పేర్కొన్నారు.ఈ సంక్షోభ సమయంలో ఇప్పుడు అందరికి ఉపశమనం అవసరమని, చెల్లించని వాయిదాలపై వడ్డీ వేస్తూ చక్రవడ్డీతో కొనుగోలుదారుల నడ్డివిరచరాదని ఆయన సర్వోన్నత న్యాయస్ధానాన్ని అభ్యర్ధించారు.

దేశవ్యాప్త లాక్‌ డౌన్‌ తో ప్రజల రాబడి పూర్తిగా తగ్గిపోయిన క్రమంలో మారటోరియం సమయంలో రుణ వాయిదాలపై వడ్డీ వసూలు చేయడం చాలా అన్యాయం అని దత్తా ఆందోళన వ్యక్తం చేశారు. లాక్‌ డౌన్ ‌తో ప్రజలు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటుండంగా మారటోరియం సమయంలో చెల్లించని రుణ వాయిదాలపై వడ్డీ భారం మోపడం రాజ్యాంగ విరుద్ధమని అన్నారు. వైరస్‌ సంక్షోభంతో వివిధ రంగాల్లో పనిచేసే పలువురు ఉద్యోగులను జీతం చెల్లించకుండా యాజమాన్యాలు సెలవుపై వెళ్లాలని కోరాయని గుర్తుచేశారు. పిటిషన్‌ ను విచారణకు స్వీకరించిన సుప్రీంకోర్టు దీనిపై స్పందించాలని కేంద్ర ప్రభుత్వం, ఆర్‌ బీఐని కోరుతూ నోటీసులు జారీ చేసింది.